- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుగుబాటుకు ప్రతీక... తెలంగాణ గుండె చప్పుడైన బతుకమ్మ
జనం ఉనికిలో లేని ఆట-పాటలైనా, చివరకు పండుగలైనా సరే... కనుమరుగై పోవడం ఖాయం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజలు

జనం ఉనికిలో లేని ఆట-పాటలైనా, చివరకు పండుగలైనా సరే... కనుమరుగై పోవడం ఖాయం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజలు వందల యేండ్లుగా పూలను బతుకమ్మ పండుగ పేరుతో ప్రకృతిని ఆరాధిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంతపు ఆత్మగౌరవ ప్రతీక. ఈ రాష్ట్ర పండుగైన బతుకమ్మను తిరుగుబాటు అనే మాటకు ప్రతిరూపంగా చూపించవచ్చు.
ఈ పండుగ చరిత్ర చూస్తే చోళులు వేములవాడ నుండి శివలింగాన్ని, గౌరమ్మ నుండి వేరు చేశారు అని అక్కడి ప్రజలు నిరసనగా శివలింగ ఆకారంలో పూలను పేర్చి ఆటపాటలతో వారి ఆవేదన వ్యక్తం చేశారు..
ఉద్యమానికి ఆయువుపట్టు బతుకమ్మ
అంతేకాదు నిజాం రజాకారుల పరిపాలనా కాలంలో, 1947లో స్వాతంత్ర్యం వచ్చాక కూడా తెలంగాణ ప్రజలను హింసిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజలు తమకు స్వాతంత్ర్యం కావాలని చేస్తున్న తిరుగుబాటు ప్రయత్నంలో బతుకమ్మని పేర్చి రేపటి భవిష్యత్ కోరుకుంటూ నిరసనగా ఆడి పాడుతున్న ఆడవాళ్లను నగ్నంగా ఆడించి, అత్యాచారాలకు పాల్పడినా సరే.. బతుకమ్మ కుంగిపోలే.. పడిలేసిన కెరటమై యావత్ తెలంగాణ ఉద్యమానికి ఆయువు పాటయ్యింది. విద్యార్థులు, ఉద్యమకారులు నిరాహార దీక్షలు, ఉద్యమాల్లో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు కూడా నిరసనగా జరిపారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బహుజనుల బతుకమ్మ, పోరు బతుకమ్మ వంటి కార్యక్రమాలు వీటిలో భాగమే, తెలంగాణ వచ్చాక ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది, తెలంగాణలో వచ్చిన ప్రతీ తిరుగుబాటుకు బతుకమ్మ సమానత్వమై నిలబడింది.
బతుకమ్మలో కూడా కులజాఢ్యమేనా..?
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ ముఖ్య ఉద్దేశ్యం తిరుగుబాటు మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, యాస-బాస ఇక్కడి భౌగోళిక వనరులను సహితం నిత్యం ప్రభావితం చేయగలుగుతూ వస్తుంది కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ మనగలుగుతోంది. ఇలాంటి బతుకమ్మలో కూడా కులజాఢ్యం అవతరించిందని చెప్పు కోవాలి. రాష్ట్ర పండుగగా వర్ధిల్లాల్సిన బతుకమ్మ కుల బతు కమ్మగా అవతరించింది ఇది స్వేచ్ఛా- సమానత్వపు స్ఫూర్తి గల్గిన బతుకమ్మ ఉనికికే అతి ప్రమాదం. శూద్ర-అతిశూద్ర జాతుల స్త్రీలు అందరితో కలిసి ఆడి పాడే అవకాశం లేకుండా వాడకో లేదా బజారుకో కుల బతుకమ్మలు వెలసి తెలంగాణ ఆత్మగౌరవ స్పూర్తిని దూరం చేస్తున్నాయి.
కులం కంపులో ముగిసిన సంబురాలు..
తిరుగుబాటుకు నిదర్శనంగా మొదలైన బతుకమ్మ దగ్గర కూడా కుల వివక్షతో ఊగిపోతున్న ఆధిపత్య వర్గాలు అణగారిన బడుగు-బలహీన జాతులను బతుకమ్మకు దూరంగా చేసే కుట్రలు లేకపోలేదు. ఇందుకు రాష్ట్రంలో ప్రతి ఏడాదికు బతుకమ్మ పట్ల వివక్ష సంబంధించిన ఎన్నో కేసులు నమోదవూతూనే ఉన్నాయి. ఇలా ఒక తరం స్త్రీల జీవితాలు తమ ఉనికిని తెలుసుకోకుండానే, వారి హక్కును సాధించుకోకుండానే, తమ సంబురాలను జరుపుకోకుండానే కులకంపులోనే ముగిసిపోయాయి. నేటికీ పేదరికంతోనే మగ్గిపోతున్న జీవితాలు ఊర్లలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గర జీతాలు ఉండి బతికే జీవితాల్లో పిల్లలకు విద్యను అందించి కొత్త వెలుగులా గూడెంలో నుండి ఒక్కొక్కరుగా విద్యాపరమైన విలువలను అర్థం చేసుకునీ నిలబడిన వైనం లేకపోలేదు. బడుగు బలహీన వర్గాలు, దళితులపై జరుగుతున్న ఈ అవమానీయ సంఘటనలు తెలంగాణ వచ్చాక ఊరూరా, వాడ-వాడల బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలి అని ప్రభుత్వం ప్రచారం చేసినా ఇంకా కొన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో కులం మోసుకొస్తున్న భయాలు, మూఢనమ్మకాలు నుండి బయటికి రావడానికి భయపడే అమ్మలూ, అక్కా,చెల్లెల్లూ ఉన్నారు.
బతుకమ్మలూ కల్తీ అయితే..?
బతుకమ్మ అంటే ఎవరికి వారే ఇంట్లో జరుపుకోవడం కాదు, స్త్రీలు అంతా ఒకే చోట కలిసి ఆడి-పాడుతూ తొమ్మిది రోజులు సంతోషంగా గడిపే సందర్భం, రకరకాల చిరు ధాన్యాలతో నైవేద్యం అంటూ స్వీకరించడం ఆరోగ్య ప్రయోజనాలు. ఇప్పుడు ప్రకృతి పరంగానూ బతుకమ్మ బరువైతున్నది. ఒకప్పుడు బతుకమ్మ అనగానే తంగేడు, గునుగు .. అడవికి వెళ్లి బస్తాల్లో నింపుకొని వస్తే ప్రతి ఇంట్లో బంతి చెట్లు తోటలా దర్శనమిచ్చేవి, సీతజడ, చామంతి తీరొక్క పువ్వు ఇంటిలోనే ఉండేవి, కానీ ఇప్పుడు ఖర్చులతో పూలు బరువై పోతున్నాయి, పువ్వుల్లో ఉండే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చెరువులోని నీటితో కలవడం వలన సైంటిఫిక్‌గా వాతావరణం మెరుగవుతుంది. కానీ నేటి బతుకమ్మలు కల్తీ అయిపోయాయి, ప్రతి పువ్వు మార్కెట్‌లో కొనుక్కోవడమే కాదు... తెచ్చిన పూలకు కూడా మార్కెట్‌లో దొరికే రంగులను అద్ది, అవి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల చెరువు నీళ్లు కలుషితం. మనసుకి ప్రశాంతత నిస్తూ ప్రతి నోటా ఉయ్యాలా అటూ పలికే పదాల నుండి సినిమా పాటలు, డీజేల సౌండ్‌లతో వాతావరణం కాలుష్యం, పిండి పదార్థాలనుండి రెడీమేడ్ స్వీట్స్‌తో ఆహార కలుషితం.
సామూహిక బతుకమ్మ కావాలి
తెలంగాణ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు బతుకమ్మ ఆవిర్భావాన్ని, అవసరాన్ని అర్థం చేసుకోవాలి, అవమానం ముందుకు వస్తే తిరుగుబాటు బతుకమ్మతో మొదలవ్వాలి, ప్రపంచం అంతా గుర్తించి జరుపుకుంటున్న బతుకమ్మకు నేటికి గ్రామాల్లో కులపిచ్చి నమ్మకాలతో దూరంగా ఉంటున్న ప్రజల్లో అవగాహన, ఆసక్తి కలిగించి ముందుకు తీసుకురావాలి, తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అవసరమైనప్పుడు నేను దేనినైనా ఎదిరించి నిలబడుతా అనే ధైర్యానికి గుర్తుగా చేతిలో బంగారు బతుకమ్మతో నిలబడాలి. ఆట పాటలతో కూడిన ఈ పండుగలో కులం, మతం, వర్గ బేధం, ధనిక, పేద తేడా లేకుండా ప్రజలంతా ఏకతాటిపై చేరుకోవాలి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తూ తిరుగుబాటుతో మొదలైన బతుకమ్మ జాతరలు ప్రతి పల్లెలో సామూహికంగా జరుపుకుంటూ తెలంగాణ గుండె చప్పుడుగా గొంతెత్తి ప్రపంచానికి వినిపించి బతుకమ్మకు బతుకునిద్దాం. తెలంగాణ ప్రజలందరికి బతుకమ్మ శుభాకాంక్షలతో..
-ఓర్సు హేమలతా అశోక్
94948 12216






