వినోదంతో పాటు ఆలోచింపజేసే కథ.. వాలా 2

by Ravi |   (  Updated:2026-04-25 00:45:30  IST  )

యువత భావోద్వేగాలు, విద్యా వ్యవస్థలోని లోపాలు, స్నేహం విలువలను సహజంగా చూపించిన వాలా 2 మలయాళ చిత్రం పై సమగ్ర సమీక్ష. ఫహాద్ ఫాసిల్ ప్రత్యేక పాత్రతో ఈ సినిమా మరింత ఆకట్టుకుంటుంది.

వినోదంతో పాటు ఆలోచింపజేసే కథ.. వాలా 2
X

మలయాళ చిత్ర పరిశ్రమ భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేక ముద్ర వేస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం సర్వసాధా రణం అయిపోయింది. ఆ కోవలోనే వచ్చిన వాలా మొదటి భాగం యువతను విశేషంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన వాలా 2 ప్రస్తుతం సినీ ప్రియుల చర్చల్లో నిలుస్తోంది. సమాజం పనికిరాని వారుగా ముద్ర వేసిన కొంతమంది యువకుల జీవిత ప్రయాణమే ఈ కథా సారాంశం.

దర్శకుడు హషీమ్ అబు ఈ సీక్వెల్‌ను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఒక సామాజిక అద్దంగా తీర్చి దిద్దారు.. ఈ సినిమా కథనం ప్రారంభం నుండే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగే యువత ఎదుర్కొనే ఒత్తిళ్లు, చదువులో వెనుకబడితే ఎదురయ్యే అవమానాలు ఇందులో ఎంతో వాస్తవికంగా కనిపి స్తాయి. సమాజం నిర్ణయించే విజయానికి, అసలైన సంతో షానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని దర్శకుడు ఈ చిత్రంలో చాలా సున్నితంగా విశ్లేషించారు..

పాత్రల్లో ఒదిగిపోయిన నటులు..

కథలోని ప్రధాన పాత్రధారులు తమ వ్యక్తిగత జీవితాల్లో పడే వేదన, కుటుంబ సభ్యుల అసహనం మధ్య వారు పొందే స్నేహం ఎంతో అందంగా పండాయి. హషీమ్ అబు దర్శకత్వ ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నటీనటుల మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రేక్షకులకు తమ సొంత స్నేహితుల గుంపును గుర్తు చేస్తుంది. నటన పరంగా చూస్తే హాషిర్, సాఫ్ బాయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.. వారు నటించినట్లు ఎక్కడా అనిపించదు. నేటి తరం యువత వాడే భాష, వారి బాడీ లాంగ్వేజ్ చిత్రానికి సహజత్వాన్ని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వారి పరిణతి చెందిన నటన ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ ఫహాద్ ఫాసిల్ పోషించిన ప్రత్యేక పాత్ర. ఆయన స్క్రీన్ మీద కనిపించే ప్రతి నిమిషం ఒక మ్యాజిక్ లాంటిది. తనదైన ముద్రతో ఆయన సినిమా స్థాయిని పెంచేశారు. కీలక మలుపుల వద్ద ఆయన పాత్ర ఇచ్చే ఇంపాక్ట్ ప్రేక్షకులపై దీర్ఘకాలం ఉంటుంది. ప్రతి నటుడు తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించి సినిమాను ముందుకు నడిపించారు.

ప్రతి ఫ్రేం అర్థవంతమే..

సాంకేతిక విభాగాల పనితీరు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం. విపిన్ దాస్ అందించిన కథలో లోతు ఉంది. యువత మనస్తత్వాలను అధ్యయనం చేసి రాసిన సంభాషణలు గుండెకు హత్తుకుంటాయి. నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని గాఢతను పెంచింది. ఆహ్లాదకరమైన బాణీలు సినిమా మూడ్‌ను చక్కగా క్యారీ చేశాయి. ఛాయాగ్రహణం కేరళ పరిసరాలను ఎంతో సహజంగా, ఏ రకమైన ఆడంబరాలు లేకుండా చూపించింది. లైటింగ్, ఫ్రేమింగ్ ప్రతి దృశ్యాన్ని ఒక అర్థవంతమైన చిత్రంగా మార్చాయి. ఎడిటింగ్ విభాగం కూడా ఎంతో పకడ్బందీగా వ్యవహరించింది. ఎక్కడా కథనం నెమ్మదించినట్లు అనిపిం చకుండా జాగ్రత్త పడ్డారు. అనవసరపు సన్నివేశాలకు తావు ఇవ్వకుండా కథను సూటిగా చెప్పారు.

విద్యావ్యవస్థలోని లోపాలు ఎండగడుతూనే..

వాలా 2 చిత్రం కేవలం ఒక కామెడీ డ్రామా మాత్రమే కాదు. ఇది ప్రతి తల్లి, తండ్రి తప్పకుండా చూడాల్సిన సినిమా. పిల్లలపై చదువు పేరుతో ఒత్తిడి తీసుకురావడం వల్ల వారిలోని అసలైన ప్రతిభ ఎలా నలిగిపోతుందో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు.. సమాజం గీసిన గీతల్లో ఇమడలేని వారు ఎప్పటికీ ఓడిపోయినట్లు కాదని, వారికి ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటుందని ఈ చిత్రం చాటి చెబుతుంది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే చక్కని హాస్యాన్ని పండించడం ఈ సినిమా గొప్పతనం. ప్రతి యువకుడు తనను తాను ఈ పాత్రల్లో చూసుకుంటాడు. సినిమా ముగిసే సమయా‌నికి ప్రేక్షకులు ఒక బరువైన హృదయంతో పాటు గొప్ప ఆలోచనతో థియేటర్ బయటకు వస్తారు. మొత్తంగా చెప్పాలంటే వాలా 2 మలయాళ సినిమా సత్తాను చాటిన మరో అద్భుత చిత్రం. కమర్షియల్ హంగులకు పోకుండా కథను, పాత్రలను నమ్ముకుని తీసిన తీరు ప్రశంసనీయం. నేటి తరం ఎదుర్కొనే సవాళ్లను, అభద్రతా భావాన్ని ఇంతటి సహజత్వంతో మరే ఇతర భాషా చిత్రాల్లో చూడటం అరుదు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం కేవలం అంకెలకు సంబంధించింది కాదు, అది కోట్ల మంది యువత హృదయాలను గెలుచుకుంది. మంచి కథలను ఆదరించే ప్రతి సినీ అభిమాని తప్పకుండా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది.

-డా. కట్కూరి

[email protected]

Next Story