విశిష్ట శ్రావణ పౌర్ణమి

by Disha edit |
విశిష్ట శ్రావణ పౌర్ణమి
X

భారతీయ సంప్రదాయంలో రక్షాబంధన్‌కు విశిష్ట స్థానం ఉంది. ఈ పండుగను రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి, హయగ్రీవ జయంతి, వనపూజగాను జరుపుకుంటారు. ఈ పండుగకుపురాణాల ప్రకారం ఎన్నో అర్ధాలున్నప్పటికీ అన్నాచెల్లెళ్ల బాంధవ్యానికి ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది. ఈ రోజున అన్నదమ్ములు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అక్కాచెల్లెళ్లు వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది, తీపిని తినిపించి రాఖీని కడతారు. ధ్యానానికి ఆరాధనకి అనుకూలమైన యోగకాలం ఇది. దేవతలందరూ కలిసి తమలో విష్ణువే గొప్పవాడని నిర్ణయించారట. దీంతో బ్రహ్మకు కోపం వచ్చి 'విష్ణుమూర్తి శిరస్సు తెగి పడుగాక' అని శాపమిచ్చాడట. అలా శిరస్సు కోల్పోయిన విష్ణుమూర్తి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై పూర్వ శిరస్సును ప్రసాదించాడట. ఇది స్కంద పురాణ గాథ. జ్ఞానదాతగా, గురువుగా, పౌర్ణమి నాడు పూజలందుకునే దేవుడాయన.

హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని తలచి తపస్సు చేశాడు. రాక్షసుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకొమ్మంటే తనకు మరణం ఉండకుండా వరం ప్రసాదించాలని కోరుతాడు. సాధ్యపడదని దేవి చెప్పడంతో హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆ వరంతో రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి రాక్షసుడిని యుద్ధంలో ఎంత ఎదిరించినా ఫలితం లేకపోయింది. విష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించాక అలసటతో నిద్రపోతాడు. ఆయనను లేపడానికి దేవతలకు ధైర్యం సరిపోక వమ్రి అనే కీటకాన్ని పంపి ధనుస్సు కున్న అల్లెతాడును కొరకమని చెబుతారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందనేది వారి ఆలోచన. కానీ, వారు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి విష్ణువు తల ఎగిరిపడింది. ఎంత వెతికినా దొరకలేదు. బ్రహ్మదేవుడు ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెబుతాడు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి. హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. అందుకే నేడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు.

ఏడాదంతా రక్షణ

మనిషికి ప్రధానం జ్ఞానం. దానికి ఆధారం శాస్త్రాలు. వాటికి మూలం వేదం. వాటిని లోకానికి అందించింది హయగ్రీవావతారం. చదువుకున్న వారందరికీ కంకణం కడతారు. వారు రక్షకులు అవుతారు. కంకణ ధారణ అనేదే రక్షా బంధనం. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పౌర్ణమి నాడు ప్రారంభించి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. దీని తర్వాతనే శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, కల్పకం, ఛందస్సు, జ్యోతిష్యం అధ్యయనం చేస్తారు. ధర్మరాజు రక్షా బంధన విశేషాలను అడిగినప్పుడు కృష్ణుడు 'రక్షా బంధనాన్ని కట్టించుకుంటే ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని' చెబుతాడు.

రాక్షసులతో యుద్ధంలో దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత దేవేంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. రక్షా బంధనంలో చదివే శ్లోకం. 'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః / తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల' దీనిలో రక్షా బంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఉంది. రక్ష కోరిన సోదరిని కాపాడడానికి ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు బలి చక్రవర్తి. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది సోదరి. రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వదిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజు ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

తిరుమల మనోహర్ ఆచార్య

శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణ భారతదేశ సహాయ కార్యదర్శి

హైదరాబాద్

99890 46210

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed