- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన భద్రతా వ్యూహంలో.. కొత్త అధ్యాయం
ఉగ్రవాదంపై తన విధానాన్ని మరోసారి చాటి చెప్పి భారత్, ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ఉగ్రవాదంపై తన విధానాన్ని మరోసారి చాటి చెప్పి భారత్, ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ ఆపరేషన్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాక, కోట్లాది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. 'ఉగ్రవాదం, చర్చలు కలిసి ఉండలేవు. రక్తం, నీరు కలిసి పారవు, ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య కాదు. ఇది భారత సైనిక పరా క్రమానికి ఒక కొత్త అధ్యాయం. ఉగ్రవాదంపై పోరాటంలో మైలురాయి చర్య' అని మోదీ స్పష్టంగా తెలిపారు. ఇది తాత్కాలిక చర్య కాదు.. దీని వెనుక ఉన్న విధాన మార్పే ప్రపంచం గమనించాల్సిన అంశం.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన దారుణ ఉగ్రదాడిలో అమాయక పౌరులు, తమ కుటుంబాల ఎదుటే హత్య చేయబడిన సంఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిని కేవలం క్రూర నేరంగా కాకుండా, భారతీయ గౌరవం, సామరస్యం మీద జరిగిన కుట్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు.
ఆపరేషన్ సిందూర్ గట్టి గుణపాఠం
ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 6 - 7 తేదీలలో భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిక్షణా శిబిరాలపై ఖచ్చితమైన క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దశాబ్దాలుగా భారత్‌కు ముప్పుగా ఉన్న 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ చర్య ఉగ్రవాద నిర్మూలనలో కీలక మలుపుగా నిలిచింది. భారత దాడులు పాకిస్తాన్‌ను కుదిపేశాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వాయుసేన స్థావరాలు, నౌకాదళ ప్రధాన కేంద్రంపై నేరుగా దాడి చేయడం వారి మౌలిక సదుపాయాలను మాత్రమే కాక, మనో ధైర్యాన్ని కూడా ఛిన్నాభిన్నం చేసింది. బహవల్‌పూర్, మురిద్కే వంటి ప్రదేశాలు, గతంలో 911, లండన్ ట్యూబ్ దాడులు, ముంబయి ఉగ్రదాడులతో అనుసంధానించబడిన కేంద్రాలుగా ఉండగా, ఇప్పుడు భారత్‌కి సునాయాస లక్ష్యాలుగా మారాయి.
‘మేడ్ ఇన్ ఇండియా’ డిఫెన్స్ సుపర్బ్!
ఈ ఆపరేషన్ విజయానికి ‘మేడ్ ఇన్ ఇండియా’ రక్షణ పరికరాలు కీలకంగా నిలిచాయి. ఇది స్వదేశీ రక్షణ సామర్థ్యాలపై ప్రభుత్వ నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక డ్రోన్లు, ఖచ్చితమైన క్షిపణులు... ఇవన్నీ భారత్ త్రివిధ దళాల పోరాట పటిమకి ఆధునిక సాంకేతిక వినియోగానికి పరిపక్వతకు సంకేతాలు.. మన భద్రతా సిద్ధాంతంలో మూడు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి కఠినమైన ప్రతీకారం ఉగ్రవాదంపై భారతదేశం ఇక నిర్దయగా, నిర్దిష్టంగా ప్రతీకారం తీసుకుంటుంది. భారత్ అణు బెదిరింపులను లెక్కచేయదు.. దానికంటే ప్రాధాన్యం దేశ గౌరవం అని ఈ ఆపరేషన్ సిందూర్ నిరూపించింది.
స్కాల్ఫ్-ఇజి క్రూయిజ్ క్షిపణులు
భారత రాఫెల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించిన SCALP-EG (Storm Shadow) క్రూయిజ్ క్షిపణులు ఫ్రాన్స్, యూకే సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఖచ్చితత్వ దాడి ఆయుధం కొన్ని అత్యాధునిక లక్షణాలతో రూపొందించ బడింది. ఈ ఆయుధం రాడార్‌లకు చిక్కకుండా లక్ష్యాన్ని చేరు తుంది. భారీ కాంక్రీటు బంకర్లను ధ్వంసం చేయగల సత్తా కలిగి వుంది. శక్తివంతమైన వార్‌హెడ్ ఉండటంతో పాటు లక్ష్యాలను స్వయంగా గుర్తించగలదు. 250 కి.మీ పైగా ప్రయాణించగలదు, అంత దూరం ఉన్న లక్ష్యాలను ఇక్కడి నుండే దాడి చేయగలదు. ఈ క్షిపణులను ఉపయోగించి బహావల్పూర్, మురీద్కే వంటి ఉగ్ర స్థావరాలను అత్యంత ఖచ్చితంగా ధ్వంసం చేశాయి. అదే సమయంలో, భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు కూడా ఉపయోగించబడ్డాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ క్షిపణులలో ఒకటి. వీటిని కీలకమైన పాకిస్తాన్ మౌలిక సదుపాయాలను వేగంగా ధ్వంసం చేయడానికి వినియోగించారు.
గేమ్ చేంజర్ ఎస్- 400
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఎస్-400 విస్తృతమైన రేంజ్‌ను కలిగి ఉంది. 600 కి.మీల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది గుర్తించగలదు. 400 కిలోమీటర్ల వరకూ మిసైళ్లను ప్రయో గించి శత్రు దేశాలకు చెందిన యుద్ధ విమానాలు (F-16, F-35, సుఖోయ్-30), క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు, ఇతర హానికర వాయుసేన వస్తువులను నాశనం చేయగలిగింది. దీని రియాక్షన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల 5-10 సెకన్లలో కదులుతున్న టార్గెట్‌ను లాక్ చేసి నేల కూల్చగలిగింది. ఈ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఉన్న కీలకమైన సాంకేతిక ఆంశాలు ఏకకాలంలో 100 కంటే ఎక్కువ లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 4 రకాల మిసైళ్లతో విభిన్న రేంజ్‌లలో రక్షణ. లక్ష్యాన్ని 5–10 సెకన్లలో గుర్తించి తిప్పికొట్టే సామర్థ్యం. వాహనాలపై కదిలే విధంగా రూపొందించబడిన ఈ వ్యవస్థ ఎక్కడికైనా తేలికగా మోహరించగలదు.
ఫలించిన పారికర్ దృఢ నిర్ణయం
2016లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న దృఢమైన నిర్ణయం ఫలితంగా, S-400 కొనుగోలు చేయవద్దని అమెరికా, భారత్‌పై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చింది. మన దేశంలోని నేతలు వ్యతిరేకించినప్పటికీ.. భారత్‌కి చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా వీటిని రష్యా నుంచి కొనుగోలు చేశారు. అదే ఇప్పుడు మనల్ని కాపాడింది. అదే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ డిఫెన్స్ టెక్నాలజీ ఆయన హయాంలోనే భారత్‌కు లభ్యమైంది. ఇప్పుడు ఆ విజ్ఞానం వాస్తవంగా ఫలాలు ఇస్తోంది. సాంకేతిక సమన్వయం, విజయం వెనుక ఉన్న శాస్త్రీయ శక్తి ఈ ఆపరేషన్ విజయవంతంగా సాగడానికి ప్రధాన కారణం.. భారత సైన్యం అత్యంత ఆధునిక వ్యవస్థలను ఖచ్చితంగా సమన్వయం చేయడమే. రియల్ టైం శాటిలైట్ ఇమేజింగ్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ జామింగ్ టెక్నా లజీలు Network-centric warfare ఆధారిత సమాచార బదిలీ మొత్తంగా, ఆపరేషన్ సిందూర్ ఒక సాంకేతిక విజ్ఞాన ఆధారిత దేశభక్తి.. శాస్త్ర, వ్యూహ, సామర్థ్యాల సమన్వయ రూపకల్పనగా నిలిచింది. ఇది భవిష్యత్తులో భారతదేశం సాధించబోయే వ్యూహాత్మక ఆధిక్యం వైపు తీసుకెళ్లే మరొక అడుగు.
- వి. సుధాకర్
99898 55445






