ఇలాంటి జీవితం... ఎప్పటికీ ఖాళీ గ్లాసే

by Ravi |   (  Updated:2025-06-05 01:15:55  IST  )

మనలో చాలామందిలో ఖాళీ గ్లాస్ మనస్తత్వం ఉంటుంది. తృప్తి పడాల్సిన క్షణాలూ, ఆనందించాల్సిన క్షణాలూ వాళ్ల ముందు దాటిపోతుంటాయి.

ఇలాంటి జీవితం... ఎప్పటికీ ఖాళీ గ్లాసే
X

మనలో చాలామందిలో ఖాళీ గ్లాస్ మనస్తత్వం ఉంటుంది. తృప్తి పడాల్సిన క్షణాలూ, ఆనందించాల్సిన క్షణాలూ వాళ్ల ముందు దాటిపోతుంటాయి. వాటిని ఆస్వాదించడం తెలీదు. అలా జీవితమంతా చిరాకులతో, ఘర్షణలతో ఏదో కోల్పోయిన మనుషుల్లా బతికేస్తుంటారు. శాంతి, ఆనందాలు మన మనస్సులోనే తిష్ట వేసి ఉంటాయని తెలియక వాటిని పర్వతాల్లోనూ, నైనిటాల్‌లోనూ, డార్జిలింగ్‌లోనూ వెతుకుతుంటారు..

సరే, డబ్బుంటే ఎక్కడికైనా వెళ్లడం వారి ఇష్టం. కానీ, ఆనందించే గుణం లేనప్పుడు వారికి డార్జిలింగ్ కూడా ఆనందం ఇవ్వదు. అక్కడ కూడా భార్య భర్తలు గొడవపడి, దెబ్బలాడుకొని, నిందించుకుని మరలా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఖర్చయి ఉంటాయి కానీ శాంతి మాత్రం లభించదు. అక్కడ మీరు ఫలానా ఐటం హోటల్లో ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదని భార్య, అదేదో నువ్వే చెప్పొచ్చు కదా అని భర్త, అది మీకు తెలీదా అని భార్య ఇలా రాళ్ళు విసురుకుంటారు. అక్కడ గడిపినా అనుభూతిని ఒక్క రోజు కూడా పదిలపర్చుకోరు.

ఆనందాలు వెతుక్కునే ఊబిలో పడుతూ..

ప్రపంచీకరణ నేడు భారత పౌరులకు విలాసాలు నేర్పింది. ఆధునిక టెక్నాలజీ కారణంగా పెరుగుతున్న కన్జ్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనుగోలుదారులకు అందాలి. వేగం కారణంగా పాత వస్తువులు చెల్లిపోయి మరలా అప్డేటెడ్ వస్తువులు కొనాలి. పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మనుషుల్లో భూమి దాహం, ప్లాట్ల దాహం ఇంజెక్ట్ చేసింది. దానికి తోడు స్పా ఇండస్ట్రీ. ఇదో కొత్త జీవిత విధానం. కార్పొరేట్ల ఈ ట్రాప్ నుండి బయటపడడం చాలా కష్టం. అందుకోసం రకరకాల లోన్లు, క్రెడిట్ కార్డులతో అప్పుల్లో మునగడం నేర్పింది. పే లేటర్ అనేది మరింత ఖర్చు చేయిస్తుంది. ఇలా కొత్త కొత్త ఆనందాలు వెతుక్కునే ఊబిలోకి మనిషిని నేటి ప్రపంచీకరణ నెట్టేసింది.

అన్నీ డబ్బుతోనే కొలిస్తే..

ఈ జీవిత విధానం అలవర్చుకున్న వారు జీవితంలో ప్రతి ఒక్కటి డబ్బుతోనే కొలుస్తారు. వీరికి సంతృప్తి చిన్న చిన్న సందర్భాల్లోనూ దొరకదు. పెద్ద పెద్ద టూర్లలోనూ దొరకదు. ఈ ఆర్టికల్ రాస్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని వీరు ఆశ పడ తారు. ఆ కోణంలోనే ఆలోచిస్తారు. ఉదాహరణకు మనం ఓ ఆర్టికల్ రాశాం. మనలో ఒక సృజనాత్మక ప్రతిభ రచనలో బయటికి వచ్చింది. అదో సంతృప్తి. ఇక ఆ ఆర్టికల్ ఏదో ఒక పత్రిక వారు గుర్తించి ప్రచురిస్తారు. అది మరో సంతృప్తి. ఆ ఆర్టికల్ ఎన్నెన్నో దేశాల్లో ఎంతో మంది చదువుతారు. అది మరో ఆనందం. ఆ చదివిన కొందరు ఫోన్ చేసి చాలా బాగుంది. ఇలానే రాయండి అంటారు. ఇది మరో ఆనందం. ఇవన్నీ కూడా మనసును రిలాక్స్ చేస్తాయి. ఈ రిలాక్సేషన్ వల్ల గుండె జబ్బులు వేల మైళ్ళ దూరంలో పారిపోతాయి.

డెబిట్ క్రెడిట్లలోనే జీవితాలు

ఇదంతా కూడా డబ్బుతో మాత్రమే కొలిచి ఇన్ని రకాల సందర్భాలలో దొరికే సంతృప్తిని, ఆనందాన్ని మిస్ చేసుకుంటారు. ఇలా మిస్ చేసుకుని ఎక్కడ డబ్బు వస్తుందో అక్కడ మాత్రమే ఆనందం వెతుక్కుంటారు. కాబట్టి వీరు డబ్బు మనుషులు అయిపోతారు.. మానవ సంబంధాలు కూడా వీరి దృష్టిలో డబ్బు సంబంధాలుగానే మిగిలిపోతాయి. అవతలి వ్యక్తులు మనకు ఏమి ఇచ్చారు మనం అవతలి వ్యక్తులకు ఏం ఇచ్చాం అనే డెబిట్ క్రెడిట్‌లలోనే వీరి జీవితాలు ఉంటాయి. జీవితాన్ని ఇలా దొరికిన ప్రతి క్షణాన్నీ, ఆనందించాల్సిన క్షణాన్నీ జార విడుచుకుంటూ గడిపేస్తారు.

కొత్త ఆనందాల కోసం.. ఎక్కడో వెతికితే!

జీవితంలో సంతృప్తి చెందే స్వభావం మనకు ఉంటే ఒక మిత్రునితో హోటల్‌లో తాగే ఇరవై రూపాయల టీ కూడా సంతృప్తినిస్తుంది. అలా టీ షిప్ చేస్తూ నాలుగైదు జోకులు వేస్తూ హాయిగా మనసు లోపలి నుండి నవ్వుతూ గత స్మృతులు గుర్తు చేసుకుంటూ ఓ 10 నిమిషాలు హాయిగా గడిపేయవచ్చు. సంతృప్తిగా జీవించడానికి ఇలాంటి అత్యంత సాధారణమైన రహస్యాలు తెలియని వారు కొత్త ఆనందాల కోసం వెతుక్కుంటారు. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. కొంత షో ఆఫ్ చేయాలనుకుంటారు. బాగా ఉన్నాం అనేకంటే బాగా ఉన్నామని చూపించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే వీరి స్ట్రెస్ లెవెల్ కూడా పెరుగుతుంది. మన సంతృప్తి కోసం మనమే దారులు వెతుక్కోవాలి. ఒక మంచి పుస్తకం చదివి, ఒక మంచి మూవీ చూసి, ఒక మంచి పాట పాడి లేదా పాట విని సంతృప్తి ఫీల్ అవ్వచ్చు. ఇలా చిన్నచిన్న సన్నివేశాల్లో సంతృప్తిగా జీవించగలిగే అవకాశం ఒక రోజులో ఎన్నెన్నో సార్లు దొరుకుతుంది. కానీ, ఈ అవకాశాలన్నీ జారవిడుచుకుంటూ ఇంకేదో పెద్ద సంతృప్తి కావాలని ఖాళీ గ్లాస్ మనస్తత్వంతో వెతికే ప్రజలు అసలు సంతృప్తిని మిస్ చేసుకుని ఘర్షణలకు గురువుతారు.

ఇల్లు ఇరుకైపోతే నచ్చదు...

తాము కొన్న ఫ్లాట్ చాలా స్పేసియస్‌గా బాగా ఉందని లక్షలు ఖర్చుపెట్టి కొంటారు. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్‌తో ఇల్లంతా నిండిపోయిన తర్వాత ఆ ఇల్లు ఇరుకైపోయి ఇక నచ్చక మరో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కావాలనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తూ బ్యాంకుల్లో డెబ్భై, ఎనభై లక్షలు అప్పులు చేసి ఈఎంఐలు చెల్లించలేక మరలా చిరాకులు, కోప తాపాలు. పిల్లలు కూడా డబ్బులు సంపాదించాలని ఆశతో పిల్లల్ని కూడా వారు డబ్బు సంపాదించే మర మనిషిగా మార్చేస్తారు. అసహజమైన సంతృప్తి కోసం తహతహలాడే ఇలాంటి జీవిత విధానాలు ఆధునిక జీవితం అందించిన ఖాళీ గ్లాసులే. ఇవి ఎప్పుడూ నిండవు. మనసును నిలకడగా ఉంచవు.

- కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story