- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో ఎంఓయూల వెల్లువ.. అంచనాలకు మించిన పెట్టుబడులు!
విశాఖ భాగస్వామ్య సదస్సు దిగ్విజయం అయింది. సాగర తీరం విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్ టైం రికార్డు సృష్టించింది.

విశాఖ భాగస్వామ్య సదస్సు దిగ్విజయం అయింది. సాగర తీరం విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్ టైం రికార్డు సృష్టించింది. 60 దేశాల నుంచి 4,975 మంది ప్రతినిధులు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం ఒక రికార్డు. వివిధ దేశాల నుంచి 630 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు..
ప్రపంచంలోని ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీలో తమ సంస్థలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని, రెండు రోజుల్లోనే సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని ప్రభుత్వం అంచనా వెయ్యగా అంతకు మించి రూ 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు పోటెత్తడం విశేషం. ఇది అంచనా కంటే 30 శాతం అదనం.
తొలిరోజు నుంచే అభివృద్ధిపై దృష్టి!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పారిశ్రామికాభివృద్ధిపై దృష్టిపెట్టింది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశాల తరహాలోనే ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో, ఐటీ మంత్రి నారా లోకేష్ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా రాష్ట్రానికి ఆహ్వానించారు. దీంతో పెట్టుబడుల సదస్సుకు పారి శ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ఇది కేవలం ఒక ఇండస్ట్రియల్ ఈవెంట్ మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే దౌత్య వేదిక కూడా అవుతుంది. దిగ్గజ సంస్థలకు చెందిన వ్యాపార పారిశ్రామిక ప్రతినిధులు, ద్వైపాక్షిక సంబంధాలు, చర్చోప చర్చలు, వీటి అన్నింటితో పాటు మరిచిపోలేని ఆంధ్రా ఆతిథ్యం- భారత పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు అద్భుతం, అపూర్వం అని చెప్పాలి. ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక వేత్తల విశ్వాసాన్ని చూర గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్!
ఉత్సాహభరిత వాతావరణంలో సదస్సు ప్రారంభానికి ముందురోజే భాగస్వామ్య సదస్సులో భాగ్యరాసులు కురిసాయి. సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. రూ. 13, 25,716 కోట్ల పెట్టుబడులు, 613 ఎంఓయూలు 16.31 ఉద్యోగాల ఒప్పందాలు జరిగాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో 7,63,210 కోట్లు, మంత్రుల సమక్షంలో రూ. 5,62,506 కోట్ల ఒప్పందాలు జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి 650 మంది డెలిగేట్స్ వచ్చారు. ఈ సారి 450 నుంచి 500 మందిని ప్రాస్పెక్టివ్ ఎంట్రప్రెన్యూర్స్‌గా ఆహ్వానించారు.. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజర య్యారు. భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎంఓయూలు ఇలా 67 సెషన్లను నిర్వహించారు. 700కు పైగా బీటూబీ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల సీఐఐ సదస్సులో వైద్యారోగ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, టెక్స్ టైల్స్, పర్యాటక రంగాల్లోనూ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, హెట్రో డ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్టీఎల్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిములేటింగ్ సెంటర్, సిడాక్, పాస్కల్ తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు..
విశాఖ సాగర తీరాన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహించిన సీఐఐ 30వ భాగస్వామ్య మూడు రోజుల సదస్సులో జరిగిన 613 ఒప్పందాలు ద్వారా 12 రంగాల్లో పెట్టుబడులకు కంపెనీలు ముందుకు వచ్చాయి. దీని ద్వారా 16.31 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో రూ. 13,25,716 ఒప్పందాలు జరిగితే.. అందులో సగానికి పైగా ఒప్పందాలు సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.7,63,210 కోట్ల పెట్టుబడులు గాను 123 ఎంఓయూలు జరిగాయి. ఈ ఒప్పం దాల మేళాలో తొలి రోజున రూ.3,65,304 కోట్లు, రెండవ రోజున 3,49,476 కోట్లు, మూడవ రోజున రూ.48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ.5,62,506 కోట్ల మేర ఒప్పందాలు జరిగాయి.
ఆర్థిక నిర్మాణానికి దీపస్తంభాలు..
ఉద్యోగాలు, టెక్నాలజీ, ఇండస్ట్రీ, గ్లోబల్ కంపెనీల నమ్మకం ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక నిర్మాణానికి దీప స్తంభాలు. పెట్టుబడులు ఏ రాష్ట్రానికైనా మాటలతో రావు. విశ్వాసం, స్థిరత్వం, పారదర్శకత పెట్టుబడిదారులు వెతికే మూడు ప్రధాన అంశాలు.. ఈ మూడు అంశాలూ చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తాయి. క్లియర్ పాలసీ, ఫాస్ట్ ట్రాక్ పరిశ్రమ అనుమతులు, పెట్టుబడిదారులకు గవర్నెన్స్ హామీ. ఇవి ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి మ్యాప్‌లో ముందుకు తెచ్చాయి, కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అంశాలు.. ఒప్పందాలు జరిగిన పెట్టుబడులను గ్రౌండ్‌లో అమల్లోకి తేవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను వేగంగా విస్తరించడం, యువతకు ఇండస్ట్రీ స్కిల్ శిక్షణ ప్రోగ్రాం ఏర్పాటు, భవిష్యత్ టెక్నాలజీలకు ప్రత్యేక జోన్‌లు సదస్సు విజయాన్ని నిజంగా కొలిచే అంశాలు.. ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే కీలక మలుపు ఈ విశాఖ భాగస్వామ్య సదస్సు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో విశాఖ సదస్సు విజయవంతమయింది. ఒక్కమాటలో చెప్పాలంటే భాగస్వామ్య సదస్సులో భాగ్యరాసులు కురిశాయి.
- నీరుకొండ ప్రసాద్
98496 25610






