నడుస్తున్న చరిత్ర: వడ్ల పోరులో చిక్కిన రైతు

by Disha edit |
నడుస్తున్న చరిత్ర: వడ్ల పోరులో చిక్కిన రైతు
X

ఆకలితో ఉన్నవాడికింత ముద్ద పెట్టక వాని ఆకలికి నువ్వు కారణమంటే నువ్వని కొట్లాడుకుంటున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వాటి తోవన అవి ప్రజా యుద్ధాన్ని ప్రకటించాయి. ఎవరి వెనుకా జనం లేరు, కారణం వారి గొడవంతా రేపటి పాలనపైనే కాని, తమకోసం కాదని జనానికి అర్థమైపోయింది. నేతలు తప్పు మీదంటే మీదని నెపాన్ని మరొకరిపై నెడుతున్నారు. కేంద్రం మెడలు వంచి యాసంగి వడ్లు కొనిపిస్తాం అని టీఆర్ఎస్ నేతలంటుంటే, ధాన్యం కొనే శక్తి లేకపోతే గద్దె దిగాలని బీజేపీ అంటోంది. అటు రైతులేమో వ్యాపారుల తప్పుడు లెక్కలకు, తక్కువ రేట్లకు బలవుతున్నారు.

'తెలంగాణ రావాలి అనే ఆకాంక్షకు, తెలంగాణను ఏలాలి'అనే కాంక్షకు ఎంతో భేదమున్నది. మొదటిది ప్రాంత విముక్తి, సామూహిక ప్రయోజనం కాగా, రెండోది నాటి దొరల పట్టు, అధికారదాహంతో కూడుకున్నది. ఎవరు ఉద్యమం చేసినా ఆకాంక్షనే ప్రధానమైతే అంతా సజావుగానే సాగి ఉండేది. తామే ఏలాలనే కాంక్ష అన్ని అనర్థాలకు దారి తీస్తోంది. తెలంగాణాలో మరో పార్టీ బతికి బట్ట కట్టకూడదు, ఏ జెండా పట్టుకొని గెలిచినా చివరికి మా కండువా కప్పుకొని గుంపులో కలవాల్సిందే అనే అప్రజాస్వామిక రాజకీయ చతురత సంఖ్యను పెంచి నాణ్యతను చంపేసింది.

అసెంబ్లీలో మరో గొంతు పెగలొద్దు అనే గుత్తాధిపత్యం బలాన్నిచ్చే హస్తాలను కాక ఆడించే తోకని పెంచింది. దీర్ఘకాల వ్యూహరచన కాక ఇప్పటి గండం గడిస్తే చాలు అనే షార్ట్ కట్ తోవ, ఏవో పథకాలు చెప్పి ఓట్లేయించుకొనే పన్నాగం ఏదోనాడు ఇరకాటంలో పడవేస్తాయి.119 మంది ఎమ్మెల్యేలలో 6 కాంగ్రెస్, 3 బీజేపీ మినహా అంతా పాలక పక్షం వైపే. సంపూర్ణ శాసనాధికారం ఉండి కూడా ఒక అభద్రతా భావం, వచ్చే ఎన్నికలలో కనీస మెజారిటీ వచ్చేనా, బొటాబొటి వస్తే మాయావి బీజేపీ ఎటు నుంచి కుర్చీ లాగేసుకుంటుందో అనే భయం టీఆర్‌ఎస్‌కు పట్టుకుంది.

ఎవరి వెనుకా జనం లేరు

నిజానికి ఎవరు గెలిస్తే ఏమి? ప్రజలు వారికి నచ్చినవారికి ఓటేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాధాన్యతనియ్యాలి గాని, తెచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి గాని 'మేము, మా కుటుంబమే ఏలాలి'అనే పట్టు రాజరికాన్నే సూచిస్తుంది. రాజులు ప్రజల బాగోగుల కన్నా తమ సింహసనానికే ఎక్కువ విలువనిస్తారు. రాజ్యాధికారం కాపాడుకొనేందుకు వారు ఎంతటి రక్తపాతానికైనా సిద్ధపడతారు. నేటి తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ అనే ముగ్గురు రాజుల మధ్య మూలుగుతోంది.

ఆకలితో ఉన్నవాడికింత ముద్ద పెట్టక వాని ఆకలికి నువ్వు కారణమంటే నువ్వని కొట్లాడుకుంటున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వాటి తోవన అవి ప్రజా యుద్ధాన్ని ప్రకటించాయి. ఎవరి వెనుకా జనం లేరు, కారణం వారి గొడవంతా రేపటి పాలనపైనే కాని, తమకోసం కాదని జనానికి అర్థమైపోయింది. నేతలు తప్పు మీదంటే మీదని నెపాన్ని మరొకరిపై నెడుతున్నారు. కేంద్రం మెడలు వంచి యాసంగి వడ్లు కొనిపిస్తాం అని టీఆర్ఎస్ నేతలంటుంటే, ధాన్యం కొనే శక్తి లేకపోతే గద్దె దిగాలని బీజేపీ అంటోంది. అటు రైతులేమో వ్యాపారుల తప్పుడు లెక్కలకు, తక్కువ రేట్లకు బలవుతున్నారు.

బాధ్యత రాష్ట్ర సర్కారుదే

వడ్ల కొనుగోలు తప్పిదాన్ని కేంద్రంపై వేసి బీజేపీని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, రాజకీయ లబ్ది కోసం టీఆర్‌ఎస్‌ ప్రణాళిక ఉన్నా తెలంగాణ రైతులను ఏ రకంగానైనా ఆదుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు 'మీరు వడ్లు వేయండి, ఎలా కొనదో చూద్దామని'బీజేపీ రైతులను రెచ్చగొట్టినా సమస్య రాష్ట్ర ప్రభుత్వం నెత్తినే ఉంటుంది. ఈ రెండు పార్టీల చిక్కుముడి తెగేలా లేదని రైతులు వడ్లను అమ్ముకోవడం మొదలుపెట్టారు. రైతుల నిస్సహాయతను వాడుకుంటూ వ్యాపారులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు కొంటున్నారు. అందుకు ఆగ్రహించిన రైతన్నలు ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టిన వార్త పత్రికలలో వచ్చింది. రెండు పార్టీల బాహాబాహీకి రైతుల కాయకష్టమైన వరి గింజల కొనుగోలు వేదికైంది.

పంటల విషయంలో ఏదీ స్పష్టత?

తెలంగాణాలో జలకళ తెచ్చి, వడ్లరాసులతో అన్నపూర్ణను చేసింది టీఆర్‌ఎస్‌ ఏలుబడిలోని రాష్ట్రప్రభుత్వమే. పంట పొలాలు నీళ్లతో నిండి పచ్చని పైరుతో పంట పండితే చాలు రైతు కలకాలపు కష్టాలు గట్టెక్కినట్లే అని అందరు అనుకున్నారు. పంట విస్తీర్ణం పెరగడం గొప్పగా చెప్పుకున్నాం. కానీ అధిక పంట కూడా అనర్థానికి దారి తీస్తుందని సోయి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీళ్లు సమృద్ధిగా చేతికందాక ఏ పంటలు వేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందనే విషయంలో ఇప్పటికి ఎలాంటి స్పష్టత రాలేదు.

భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేనట్లే. ఎందుకంటే రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అంచనాలు కూడా తప్పుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎప్పుడు ఏ పంట దిగుబడి అధికంగా వచ్చి ధరలు పడిపోతాయో ఊహించడం కష్టం. కందులకు మంచి ధర ఉందని కంది వేయమని చెబితే ఆ పంట ఎక్కువచ్చి రేటు సగానికి తగ్గింది. తెలంగాణకు సాగు నీళ్లు అందితే రైతు ఆత్మహత్యలు ఆగుతాయనేది కూడా అర్ధసత్యమేనని రాష్ట్రంలో ఆగని రైతుల బలవన్మరణాలు చెబుతున్నాయి. రైతుల పంటకు గిట్టుబాటు ధర, కష్టానికి తగ్గ విలువ దక్కితేనే వారి ఇక్కట్లు తీరినట్లు అవుతుంది.

రైతు బతుకకుంటే ఎలా?

నీళ్ళే అసలు సమస్య అని ఊదరగొట్టి ఇప్పటికి లక్ష కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితంగా పంట పెరిగింది కానీ రైతును బతికించడం లేదు. నిజానికి తెలంగాణ రైతులకు యాసంగిలోనే పంటలకు కాలువ, చెరువుల నీళ్లు అవసరమైతాయి. కాళేశ్వరం ఎత్తిపోసిన నీరు 60 శాతం లక్ష్యం అదే. అలా ఆ నీళ్లతో పండించిన వడ్లకే మార్కెట్ లేనప్పుడు, యాసంగిలో వరి మినహా మరో పంట వేయక తప్పని పరిస్థితి వచ్చినపుడు అంత భారీ నిర్మాణమెందుకు? ఆ నీళ్లెందుకు? పంటలెందుకు? కాంగ్రెస్ హయాంలోని ప్రాణహితను కాళేశ్వరానికి మార్చి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా తీర్చిదిద్దిన ఫలితం కూడా అదే స్థాయిలో ఉండాలి.

ఖర్చు పెరిగింది, దిగుబడి పెరిగింది

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పాత 7 జిల్లాల్లో 1,581 గ్రామాలలో 18 లక్షల ఎకరాల నేలకు సాగునీటి వసతి కలుగుతుంది. నీటి ఎత్తిపోతలకు 48 లిఫ్టులకు ఏడాదికి 6 వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తి అవసరం. అన్ని పంపులు పనిచేస్తే రాష్ట్ర నీటిపారుదల విభాగం కరెంటు బిల్లుగా ఏడాదికి సుమారు వేయి కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు చెల్లించాలి. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు ఎకరానికి అయిదున్నర లక్షలు అయింది. భూమి ధరలు పెరగడంతో అది సరిపోయిందనుకోవచ్చు.

కరెంటు బిల్లు విభజిస్తే ఎకరానికి ఏడాదికి కనీసం 40 వేల రూపాయలు అవుతుందని టి జాక్ అధ్యయనం తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం పెట్టే ప్రతి రూపాయి ఖర్చుకు రూ.1.55 రాబడి ఉంటుందని ప్రభుత్వం 2019లో లెక్కలతో చూపింది. పంట సమృద్ధిగా పండినంక ఎవరు కొనాలి అనే పితలాటం వస్తుందని, చివరకు రైతు చిక్కులలో పడతాడని తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టే దశలోనే ఊహించి ఉండదా? అని అనుమానం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కన్నా ముందే అనగా 2015-16 లోనే తెలంగాణలో 26 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగేది. ఇప్పుడది 50 లక్షల ఎకరాలుగా మారి దిగుబడి కూడా 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుండి ఆరేడు రెట్లు పెరిగింది.

ముందస్తు ప్రణాళికలు ఉండాలి

పెరిగిన దిగుబడి ధాన్యాన్ని ఎలా మార్కెటింగ్ చేసి రైతులకు గిట్టుబాటు పని చేయాలనే ప్రణాళిక ముందే ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఉన్నా రాజకీయ ప్రయోజనం కోసం రైతులను పావులుగా వాడుకుంటున్నారా అనేది కూడా తేలాలి. ప్రతి రూపాయి ఖర్చుకు రూ.1.55 రాబడి ఉంటుందన్న మాటను రుజువు చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. యాసంగి వడ్ల సమస్యకు రాష్ట్రమే శాశ్వత పరిష్కారం వెతకాలి. ఒక విధంగా మిల్లర్లకు నూకల ద్వారా వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిల్లర్లు ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్ముకుంటారు.లేదా మిల్లర్లతో బేరమాడి రాష్ట్ర ప్రభుత్వమే ఒక ధర నిర్ణయించి రైతులకు తగ్గిన మొత్తాన్ని వారి ఖాతాలలో వేయవచ్చు. ఇలా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు చేస్తున్నాయి.నూకల ధర మార్కెట్లో కేజీకి రూ.20 దాక ఉంది. నూకలకు విదేశాల్లో డిమాండ్ తో ఉందని బియ్యం ఎగుమతి దారులు అంటున్నారు. ఇలా ఏదో మధ్యంతర మార్గం వెతక్కుండా రైతును గాలికొదిలేసి నల్లజెండాలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, ఢిల్లీలో ధర్నాలు చేస్తే మూకుమ్మడిగా అవి ప్రభుత్వానికి ప్రజలకు మరింత దూరం పెంచడానికే పనికొస్తాయి.

బి.నర్సన్

94401 28169


Next Story

Most Viewed