- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 సంవత్సరాలు దర్శకుడిపై నిషేధం.. అయినా తీసిన అద్భుత సినిమాలెన్నో..?
ఇరానియన్ సినిమా రంగంలో జాఫర్ పనాహి ఒక ముఖ్యమైన శక్తి. ఆయన సినిమా ప్రపంచం పాఠశాల దశలో ప్రారంభమై, అబ్బాస్

ఇరానియన్ సినిమా రంగంలో జాఫర్ పనాహి ఒక ముఖ్యమైన శక్తి. ఆయన సినిమా ప్రపంచం పాఠశాల దశలో ప్రారంభమై, అబ్బాస్ కియారోస్తామీ వంటి దిగ్గజుడి శిష్యరికంలో పరిపక్వమైంది. ఆయన తీసుకున్న కథలు ప్రజల చిన్న చిన్న జీవితాలు, వాటి వెనుక దాగి ఉన్న పెద్ద సామాజిక, రాజకీయ వాస్తవాలను నిశబ్దంగా విప్లవాత్మకంగా బయటపెడతాయి. నిషేధాలు, గృహ నిర్బంధం, సినిమా తీయొద్దని ప్రభుత్వం చెప్పినా –పనాహి తన కథనాలతో ప్రభుత్వానికి ధీటుగా ఇరవై ఏళ్లుగా సవాలు చేస్తూనే ఉన్నాడు.
ఇరానియన్ సినీ దర్శకులు ఎన్నో వాస్తవమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు వారి కథనాలు సెన్సార్ చేయబడతాయి, అక్కడ సినిమాలు నిషేధిస్తారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి, దేశం విడిచిపోవదానికి అక్కడ నిషేదాలు అడ్డం పడతాయి. దర్శకుడు జాఫర్ పానాహీకి అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. 2010 డిసెంబరులో జాఫర్ పానాహికి ఇరాన్ దేశ ప్రభుత్వం 20 సంవత్సరాల పాటు సినిమాలు తెరకెక్కించరాదని, దేశం విడిచిపోవద్దని నిషేధం విధించింది. అయితే, పానాహి ప్రతిస్పందనగా మరిన్ని సినిమాలు తీయడం మొదలుపెట్టారు.
విమర్శే సినిమాగా మారి...
జాఫర్ పానాహి ఇరానియన్ గొప్ప సినీ దర్శకుల్లో ఒకరు. ఆయన మొదటి చిత్రం ది వైట్ బెలూన్ (1995)కి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కెమెరా ‘ద ఓర్’ అవార్డు లభించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక చలనచిత్రోత్సవాలలో గౌరవించబడ్డారు. అయితే ఇరానియన్ ప్రభుత్వంతో ఆయనకు విభేదాలు ఎదురయ్యాయి. తన సినిమాలకు ఎంచుకున్న అంశాలు అరెస్టులకు దారితీసాయి. సినిమాల నిర్మాణానికి అధికార అనుమతి తీసుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అయినా ఆయన నోరు మూసుకు కూర్చోలేదు. సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన సినిమాలు.. చదివిన పత్రికలు కాదు. బతికిన జీవన అనుభవాలు.. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలు, మహిళలపై నియమాలు, శాస్త్ర నిషేధాలు – ఇవన్నింటినీ విమర్శిస్తూ, ఆయన కథనాలు ప్రజల జీవితాల్లో ఉన్న వాస్తవాలను చెబుతాయి. The Circle, Offside, No Bears ఇవి లింగ వివక్ష, ప్రజా స్వేచ్ఛలపై సూటిగా మాట్లాడతాయి. పనాహి ఫిక్షన్ (కల్పన) డాక్యుమెంటరీ (నిజం)ల మధ్య వున్న సరిహద్దులను చెరిపేస్తాడు. ఆయన నాన్-ప్రొఫెషనల్ నటులు, రియల్ టైమ్ ఫుటేజీలు, దీర్ఘ కట్‌లేని షాట్లతో ఆయన తన సినిమాలను జీవన అనుభూతిగా మార్చుతాడు.
నిర్బంధాలకు హాస్యంతో సమాధానం
పానాహీ తన తాజా చిత్రం 'ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్'తో ఈ ఏడాది కేన్స్‌లో రెండవసారి కెమెరా ‘ద ఓర్’ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా హాస్యంతో కూడిన తేలికపాటి శైలిలో చీకటి, విషాదకరమైన సంఘటనలను ఆవిష్కరిస్తుంది. ఇది ప్రతీ కారంగా ఉండే కథ, అయినప్పటికీ ఇందులో హాస్యం, మానవత్వం ఎక్కువగా కనిపిస్తాయి. ఇది పనాహి అన్ని సినిమాల్లో కనిపించే ప్రధాన లక్షణం. ఇరానీయులలో హాస్యం ఆ సమాజానికి చెందిన ఒక ముఖ్యమైన లక్షణం. ప్రభుత్వం నాలుగు దశాబ్దాలుగా ప్రజలపై విషాదం, కన్నీళ్లు, బాధలు మోపే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇరానీయులు మాత్రం ఎప్పుడూ హాస్యం, జోకులతో తిరిగి వస్తారు. ఇది ఇరానియన్ మనస్తత్వానికి ఒక సూచనగా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా వ్యక్తిగత అనుభవం కాదు గానీ, గత నాలుగు దశాబ్దాలుగా ఇలాగే బాధపడిన వారందరి అనుభవాల సంకలనం. ఈ సినిమాలోని పాత్ర నిజమైన వ్యక్తిపై ఆధారపడింది కాదు.
నిషేధం లేకున్నా మారని పరిస్థితి
ఎవరికయినా కళ్లకు గంతలు కట్టి ఉన్నప్పుడు వినే ధ్వని చాలా కీలకమవుతుంది. ఎవరమయినా చూసే అవకాశం లేకపోతే, శబ్దాలపై దృష్టి పెడతాం. మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడే వారిది ఎంత వయసు వారు ఏమి ఆలోచిస్తారు ఇట్లా ఆలోచిస్తాం. అలాంటి ఆలోచనలోంచే వచ్చిందే 'ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్' సినిమా. 15 ఏళ్ల తర్వాత పనాహిపై ఉన్న నిషేధాలు ఎత్తివేశారు. తాను ప్రయాణించగలుగుతున్నాడు. కానీ నిషేధం లేనప్పటికీ, వాస్తవిక పరిస్థితి మారలేదు. తాను ఇప్పటికీ రహస్యంగా పని చేయాల్సి వస్తోంది. చాలా తక్కువ మంది నటీనటులతో, సిబ్బందితో పని చేయాలి. జాఫర్ పనాహి తనపై నిషేధం విధించినా స్వేచ్ఛను ఇచ్చినా లేదన్నా, ప్రభుత్వానికి నచ్చే రీతిలో సినిమాలు తీయలేడు. ఆయన సినిమాలు ఎప్పుడూ అధి కారిక వ్యవస్థకు ప్రత్యామ్నాయంగానే వుంటాయి.
సినిమాను ఆయుధంగా మలిచి..
ఇన్ని కష్టాల మధ్య కూడా మీలో సినిమాపై ప్రేమను ఎలా నిలబెట్టుకుంటారు అని ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని జర్నలిస్ట్ ప్రశ్నించారు. ‘ఒకసారి సినిమా మీద ప్రేమ పెరిగితే, ఆ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. నాకు సినిమా తీయడమే జీవితం. నా తర్వాతి సినిమా ఎప్పుడూ మరింత ఉత్తమమే అని నమ్ముతాను. ఇంట్లో లైట్, బల్బ్ మార్చమన్నా చేయలేను. కానీ సెట్లో అయితే, అన్నీ నేనే చేయాలి. అదే నాకు జీవితం. మీరు ఇంకా ఆ తపనను కలిగి ఉంటే, ఇంకా నాకు తీయాల్సిన ఉత్తమ సినిమా ముందుంది’ అనే నమ్మకం మీకుంటే, మీ ఆనందాన్ని ఎవరూ హరించలేరు అన్నారు పనాహి. జాఫర్ పనాహి సినిమాల విజయం కేవలం కళాత్మక విజయం కాదు. అవి మనిషి స్వేచ్ఛ, జీవన విలువల గురించి చేసిన పోరాటం. ఆయన ప్రతి సినిమా చూపించేదే – మనల్ని చూస్తుంది. మనల్ని మనకు చూపిస్తుంది. సినిమా ఒక ఆయుధంగా ఎలా పనిచేయగలదో సినిమాలు చూపిస్తాయి.
- వారాల ఆనంద్
94405 01281






