- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక సేవలో డిగ్రీ.. నిరుద్యోగంలో మాస్టర్స్
తెలంగాణలో BSW, MSW పట్టభద్రులు ఎదుర్కొంటున్న ఉపాధి సంక్షోభం, ప్రభుత్వ నియామకాలలో అవకాశాల కొరత, ఖాళీ పోస్టులు, తక్కువ వేతనాలు, విధానపరమైన సమస్యలు, పరిష్కార మార్గాలపై విశ్లేషణ.

నేటి ఆధునిక సమాజంలో సంక్లిష్ట మానవ సంబంధాలు, పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, సామాజిక రుగ్మతల తరుణంలో 'సోషల్ వర్కర్ల' (BSW/MSW ) పట్టభద్రుల అవసరం గతంలో కంటే ఇప్పుడు ఎంతో పెరిగింది.
సమాజ హితం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే ఈ నిపుణుల జీవితాల్లో మాత్రం 'ఉద్యోగ భద్రత' అనే పదం ఒక కలగా మిగిలి పోతోంది. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని, వేలాది రూపాయల ఫీజులు చెల్లించి పట్టా పొందిన విద్యార్థులు నేడు ఉపాధి కోసం అల్లాడుతున్నారు..
పురుష అభ్యర్థుల పాలిట ఉరితాడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ (CDPO), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) వంటి కీలక పోస్టులకు స్త్రీ, పురుషులు ఇద్దరూ అర్హులుగా ఉండేవారు. కానీ, స్వరాష్ట్రంలో ప్రభుత్వం పాత జీవోలను సాకుగా చూపిస్తూ, ఈ నియామకాలను కేవలం మహిళలకే పరిమితం చేసింది. సామాజిక శాస్త్రంలో అత్యున్నత విద్యను అభ్యసించినప్పటికీ, కేవలం 'లింగ వివక్ష' కారణంగా పురుష అభ్యర్థులకు ఉన్న ఏకైక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధం. దీనివల్ల వేలాది మంది పురుష పట్టభద్రులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.
న్యాయస్థానంలో నిరుద్యోగుల భవిష్యత్తు..
తమకు జరుగుతున్న అన్యాయంపై అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, నిరుద్యోగులకు కోర్టు ఖర్చులు భారం కావడమే కాకుండా, విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఒకవైపు న్యాయపోరాటం కొనసాగుతుండగానే, ప్రభుత్వం నియామక ప్రక్రియను పూర్తి చేయడం అభ్యర్థుల గొంతు నొక్కడమే అవుతుంది. తీర్పు వచ్చేలోపు ఉద్యోగాలన్నీ భర్తీ అయిపోతే, కోర్టులో గెలిచినా తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
గ్రూప్-1లో అన్యాయం..
గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌లో సోషల్ వర్క్ పట్టభద్రులకు కొన్ని పోస్టులను కేటాయించింది. కానీ ప్రభుత్వం రీ-నోటిఫికేషన్‌లో ఆ పోస్టులను తొలగించడం శోచనీయం. మరోవైపు, దేశంలోని ప్రతి విద్యాసంస్థలో (100 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న చోట) ఒక అర్హత కలిగిన కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్‌ను నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపడం లేదు. ప్రభుత్వ అవకాశాలు లేక ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలను (NGOs) ఆశ్రయిస్తే అక్కడ పరిస్థితి మరీ దారుణం. కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించకపోగా మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికి ప్రారంభ వేతనం కేవలం ₹12,000 – ₹16,000 మాత్రమే అని ప్రకటిస్తున్నారు. అది కూడా ప్రాజెక్ట్ ఉన్నంత కాలమే! ప్రాజెక్ట్ ముగియగానే నిరుద్యోగి ముద్ర వేయించుకోవాల్సి వస్తోంది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు..
మహిళా శిశు సంక్షేమ శాఖ WDCW, గిరిజన సంక్షేమం, జైళ్ల శాఖ ఆసుపత్రులలో 'మెడికల్ సోషల్ వర్కర్' పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. అనేక నోటిఫికేషన్లు రాకపోవడం లేదా చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల అభ్యర్థుల వయస్సు మించిపోతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద పెద్ద కంపెనీలు సామాజిక కార్యకర్తలను నియమించుకోవాలి. కానీ, చాలా సంస్థలు MSW చదివిన వారికి బదులుగా ఇతరులను తక్కువ వేతనాలకే నియమించుకుంటున్నాయి.
పరిష్కార మార్గాలు..
సీడీపీఓఈఓ ఉద్యోగాల్లో పురుష అభ్యర్థులకు సమాన అవకాశం కల్పించాలి. BSW/MSW అభ్యర్థులకు కనీస వేతన చట్టం ప్రకారం అయిన జీతాలు చెల్లించాలి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కౌన్సిలర్ పోస్టులను సోషల్ వర్క్ అభ్యర్థులతో భర్తీ చేయాలి. సోషల్ వర్కర్ల కోసం ఒక ప్రత్యేక 'ప్రొఫెషనల్ కౌన్సిల్'ను ఏర్పాటు చేసి, కనీస వేతనాలు, వృత్తి గౌరవాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో తప్పనిసరిగా మెడికల్ సోషల్ వర్కర్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు MSW అభ్యర్థులను నియమించాలి. CSR నిధులను ఖర్చు చేసే సంస్థలు కచ్చితంగా శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలనే నియమించుకునేలా నిబంధనలు తీసుకురావాలి. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో సోషల్ వర్కర్ల సేవలను అందుబాటులోకి తేవాలి.
స్పష్టమైన విధానం..
సమాజంలోని రుగ్మతలను తొలగించాల్సిన సోషల్ వర్కర్లే నేడు నిరుద్యోగమనే రుగ్మతతో బాధపడుతున్నారు. రాష్ట్రాల్లో సామాజిక ప్రగతి సాధించాలంటే, ఆ ప్రగతికి పునాదులు వేసే సామాజిక కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా MSW అభ్యర్థుల గోసను ఆలకించి ఈ 'సామాజిక' సమస్యను పరిష్కరించాలి.
-ఎ. ఆనంద్ సాగర్
89196 59715






