ఒక నర్తకి, ఒక దర్శకుడు.. భారతీయ తెరపై కళా జంట గాధ

by Ravi |   (  Updated:2025-10-11 01:15:26  IST  )

భారతీయ సినిమా రంగంలో రూపొందిన కొన్ని సినిమాలు అజరామరమైన కీర్తిని పొందాయి. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ విజయవంతమయినవి అనేకం ఉన్నాయి.

ఒక నర్తకి, ఒక దర్శకుడు.. భారతీయ తెరపై కళా జంట గాధ
X

భారతీయ సినిమా రంగంలో రూపొందిన కొన్ని సినిమాలు అజరామరమైన కీర్తిని పొందాయి. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ విజయవంతమయినవి అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనకు అట్లా మనస్సులో గుర్తుండిపోతాయి. ఇంకొన్నింటి ఇట్లా చూసి అట్లా మర్చిపోతాం. ఇంకొన్నింటిని ఎందుకు చూసాం రా బాబూ అనుకుంటాం. కానీ భారతీయ సినిమా తొలి దశాబ్దాల లో వివిధ లలితా కళా రూపాల్ని సినిమాల్లో అంతర్లీనం చేసి గొప్ప సినిమాలు తీసిన సందర్భాలున్నాయి..

హిందీ చిత్ర సీమలో 1950–1970 దశకంలో సృజనాత్మకత, కళాత్మకత, సంగీత రంగం గొప్ప ప్రవాహంగా సాగి మంచి దృశ్యమానమయిన సినిమాలు పుష్కలంగా వచ్చిన కాలం అది. ఆ కాలంలో హిందీలో ఒక దర్శకుడి దృష్టికోణం, ఒక నటి కళాత్మక ప్రతిభ వ్యక్తిత్వం కలిసిపోయి సమన్వయము చెంది సినిమాల్లో అద్భుతమైన కళాజగతిని సృష్టించాయి. ఆ నటి సంధ్యా శాంతారాం. ఆ దర్శకుడు ఆమె భర్త వి. శాంతారాం.

శాస్త్రీయ నృత్య శిక్షణ లేకున్నా..

నిజానికి వి. శాంతారం రూపొందించిన సినిమాల్ని పరిశీలిస్తే దర్శకుడిగా భారతీయ హిందీ సినిమాల్లో శాంతారాం ఒక సౌందర్య శిల్పి అని చెప్పుకోవచ్చునేమో.. వీరిద్దరి జంట భారతీయ చలనచిత్ర రంగంలో నృత్య సంగీత భరితమైన సినిమాల ఒరవడిని ఏర్పరిచింది. అది ఒక సరళిగా నిలబడిపోయింది. సంధ్య అసలు పేరు విజయా దేశ్‌ముఖ్ 1932 సెప్టెంబరు 22న కొచ్చిలో జన్మించింది. నాటక కుటుంబంలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ కళపై ఆసక్తి ఉన్నా, ఆమెకు నృత్య శిక్షణ గొప్పగా లభించలేదు. కానీ అదేమీ ఆమెకు ఆటంకం కాలేదు. ఎలాంటి శాస్త్రీయ శిక్షణ లేకున్నా ఆమె నృత్యంలో అద్భుతాల్ని సృష్టించింది. ఆమె లోపల ఉన్న భావ ప్రకటనా సౌందర్యం, కవితాత్మక మాధుర్యం సినీ రంగంలో ఆమెను ముందుకు నడిపింది.

ప్రతి సినిమా ఒక కళాత్మక దృశ్య యజ్ఞం..

వి.శాంతారాం దర్శకత్వంలో 1951 వచ్చిన ‘అమర్ భూపాలి’ చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత ఈ ఇద్దరి జంట రూపొందించిన ప్రతి సినిమా ఒక కళాత్మక దృశ్య యజ్ఞంలా నిలిచింది. తర్వాత 1955లో వచ్చిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ సినిమా సంధ్య జీవితంలో మరపురాని సినిమా. ఒక నృత్యకారిణిగా ఆమె పోషించిన పాత్ర విశేష ప్రశంసలను అందుకుంది. ఆమెతో పాటు గోపి కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా దాదాపు మొట్టమొదటి టెక్నికల్ సినిమా. ఇందులో సంధ్య చేసిన తాండవ నృత్యం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు వసంత్ దేశాయి సంగీత దర్శకత్వంలో రూపొందిన ప్రతి పాట శాస్త్రీయ సంగీత భరితంగా ఉంది నృత్య రూపకంగా ఉంటుంది.

దో ఆంఖే బారా హాత్..

తర్వాత ఆమె నటించిన ‘దో ఆంఖే బారా హాత్’ ఒక ప్రయోగాత్మక సినిమా. బహిరంగ జైలు అన్న కాన్సెప్ట్‌తో నిర్మించిన ఈ చిత్రం లో ఒక జైలర్ ఆరుగురు అత్యంత క్రూరమైన ఖైదీలు, వారిని మంచి మనుషులుగా మార్చేందుకు ఆ జైలర్ చేసిన ప్రయోగమే ఈ సినిమా ఇందులో ‘సైయ్యా ఝూటోన్కా బడా సర్తాజ్ నికలా’ పాటలో ఎక్తారా మీటుతూ సంధ్య చూపిన నటన ఆ నాటి ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఇప్పటికీ మిగిలిపోయింది. ఇది బెర్లిన్‌తో సహా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో పాల్గొంది. అక్కడ సిల్వర్ బియర్ అవార్డుతో పాటు అనేక ఉత్సవాల్లో ప్రశంసలను అందుకుంది.

ఆధా హై చంద్రమా..

తర్వాత ‘నవరంగ్’‌లో నృత్య ప్రధాన పాత్రలో సంధ్య మెరిసిపోయింది. ‘ఆదా హై చంద్రమా రాత్ ఆదీ’ లాంటి పాటలో కుండలని తలపై ఉంచుకుని ఆమె చేసిన నృత్యం నేటికీ విలక్షనమయిందే. భరద్వాజ్ రాసిన ఈ పాటకు సి.రామచంద్ర గొప్ప సంగీతాన్ని అందించారు. ఇది ఒక కవి కలలో స్ఫూర్తి పొందిన పాత్ర. ఆ రూపంలో కనిపించే మహిళ పాత్ర. దాంట్లో ‘రాణి’గా సంధ్య కనిపించింది. తర్వాత సంధ్య కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన ‘స్త్రీ’ చిత్రంలో శకుంతల పాత్రలో నిశ్చల సౌందర్యంగా కనిపించింది. నిజమైన సింహాల మధ్య సన్నివేశాలు చేయడం ద్వారా ధైర్యవంతమైన నటిగా ఆమె గుర్తింపు పొందింది. నృత్యంలో భావ వ్యక్తీకరణకు రూపం ఇచ్చిన నటి సంధ్య.

ప్రతి పాత్రలోనూ మానవతా భావాల స్ఫూర్తి

తర్వాత సంధ్య నటించిన ‘పింజ్రా’ మరాఠీ చిత్రసీమలో ఆమెకు ఎంతో ఉన్నత స్థానం తెచ్చిన సినిమాగా నిలబడింది. ఈ సినిమా ఒక నాట్యకారిణి జీవితంలోని బాధ, సౌందర్యాల సంగమం ఇతివృత్తంగా రూపొందింది. సంధ్య ఈ పాత్రలో నటనలో ఆత్మగౌరవం, సమాజపు న్యాయ అన్యాయాల మధ్య స్త్రీ స్థితిగతులను అద్భుతంగా చూపించింది. ఇక నటిగా ఆమె ప్రత్యేకతలను చెప్పుకుంటే ఆమె పోషించిన ప్రతి పాత్రలోనూ మానవతా భావాల స్ఫూర్తిని చూపించింది. కథక్ నృత్య లయలోని సౌందర్యం నింపిన కదలికలని ఆమె అత్యంత స్వభావ సిద్ధంగా ప్రదర్శించింది.. నటిగా సంధ్య దర్శకుడు వి.శాంతారాం ఆలోచనలకు జీవం పోసిన కళామూర్తి అని చెప్పు కోవచ్చు. 1970ల తర్వాత సంధ్య సినిమాలకు దూరమై, కళా సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. వి.శాంతారాం ఫౌండేషన్ ద్వారా అనేక మంది యువ కళాకారులను ప్రోత్సహించారు. ఆమె 2025 అక్టోబర్ 4న మరణించారు. కానీ ఆమె నటన నృత్యం మాత్రం భారతీయ సినిమాకు ముఖ్యంగా హిందీ మరాఠీ సినిమాలకు శాశ్వత ప్రతిధ్వనిగా మిగిలింది.

-వారాల ఆనంద్

94405 01281

Next Story