85 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలే.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవా?

by Ravi |   (  Updated:2025-04-29 01:00:28  IST  )

సమాజ పురోభివృద్ధికి విద్య ఒక ముఖ్యమైన సాధనం. విద్య వ్యక్తుల అంతరాల్లో దాగి వున్న నైపుణ్య, సామర్థ్యాలను వెలికి తీసి

85 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలే.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవా?
X

సమాజ పురోభివృద్ధికి విద్య ఒక ముఖ్యమైన సాధనం. విద్య వ్యక్తుల అంతరాల్లో దాగి వున్న నైపుణ్య, సామర్థ్యాలను వెలికి తీసి దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. “ప్రపంచాన్ని మార్చడానికి విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం" అని నెల్సన్ మండేలా అంటారు. మరి అంతటి శక్తివంతమైన ఆయుధం నేడు మన దేశంలో ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల వ్యాపారీకరణ, వాణిజ్యీకరణ దాహానికి బలై విలవిల్లాడుతోంది.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాల్లోని విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో (దాదాపు 85% పైనే) ఉంటే, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాత్రం ప్రభుత్వం విద్యారంగం నుండి వెనక్కి తగ్గుతూ ఉండటం వల్ల విద్య ప్రైవేట్, కార్పొరేట్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. దేశంలో 2003 నాటికి 83.5% పైగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉంటే నేడు 85%నికి పైగా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళినట్లు ఒక అంచనా. అంటే విద్యారంగం నుంచి ప్రభుత్వాలు ఎంత వేగంగా తప్పుకుంటున్నాయో కదా!

విద్యతో వ్యాపారం చేయడం నేరం!

భారత రాజ్యాంగంలోని 21ఎ అధికరణం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. కానీ ఈ నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థ అసలు ఈ అధికారణ ఊసే ఎత్తవు. విద్యతో వ్యాపారం చేయడమే ధ్యేయం తప్పితే కొంచెం కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించడం లేదు. ఈ చర్యల వలన ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నాయి. ఫలితంగా సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు..

గత కొన్ని దశాబ్దాలుగా ప్రైవేటు విద్యాసంస్థలు విచ్చల విడిగా, పుట్టగొడుగుల్లా వెలిసి విద్యా వ్యాపారానికి పూనుకున్నాయి. నాణ్యమైన విద్య అంటే కేవలం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అది దొరకదనే భావనని ప్రజల్లోకి చొప్పించాయి. దానితో తమ దోపిడీకీ అడ్డూ అదుపును తొలగించుకున్నాయి ప్రైవేట్, కార్పొరేట్ శక్తులు.. అందుకు ప్రభుత్వాల పరోక్ష సహకారం కూడా దండిగానే ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థలేమో అరకొర వసతులతో, ఉపాధ్యాయుల కొరతతో, కనీసం మౌలిక వసతులకు నోచుకోలేక విద్యార్థులు ఈ వైపు చూడాలంటేనే భయపడేటట్లు ఉంటే, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచి, టెక్నో, ఈ టెక్నో వంటి బ్రాండ్ల పేరుతో అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నాయి. అదే స్థాయిలో ఫీజులను విపరీతంగా పెంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.

ప్రైవేట్ విద్యవైపే ప్రభుత్వాల మొగ్గు

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యా వ్యాపారీకరణను అరికట్టడానికి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఒకే రకమైన తరగతికి ఒక్కో విద్యాసంస్థ ఒక్కో రకమైన ఫీజును వసూలు చేయడమేంటనే కనీస ప్రశ్న ఉత్పన్నం అవ్వడం లేదు? ప్రభుత్వాలు ఎందుకు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు 25% సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుక బడిన కుటుంబాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలని చెప్తున్నా, ఏ ఒక్క విద్యా సంస్థా అమలు చేయడం లేదు.

ఫీజుల నియంత్రణ తోటే సమానత్వం

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ అనేది విద్యా వ్యవస్థలో సమతుల్యత, న్యాయం, సమానత్వాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన దశ. ఇది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడమే కాకుండా విద్యా వాణిజ్యీకరణను నిరోధిస్తుంది. యాజమాన్యాల దృక్పథం నుండి కాక విద్యార్థుల తల్లిదండ్రుల కోణం నుండి, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేయాలి. పేద, అణగారిన వర్గాల పిల్లలకు 25% సీట్లను ఉచితంగా కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించి, సరైన టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలి. ప్రభుత్వం విద్య అభివృద్ధికి బడ్జెట్ పెంచి, సౌకర్యాలు కల్పించాలి. ఈ చర్యలతో ప్రభుత్వ విద్యారంగం మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటే ప్రైవేటు విద్యాసంస్థల నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చూపు ప్రభుత్వ విద్యాసంస్థల వైపు మరలే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం విద్యలో ముందుండే అవకాశం ఉంది.

- విజయ్ పుట్టపాగ

80080 28237

Next Story