- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్రో ప్రయాణంలో మనసుల స్పర్శ.. 8 A.M. Metro
రాజ్ రాచకొండ దర్శకత్వంలో వచ్చిన ‘8 A.M. Metro’ సినిమా నగర జీవితంలోని ఒంటరితనం, మానసిక గాయాలు, మానవ అనుబంధాల విలువను హృద్యంగా చూపిస్తుంది. మెట్రో ప్రయాణంలో పరిచయమైన ఇద్దరి మనసుల ప్రయాణాన్ని ఈ సమీక్షలో తెలుసుకోండి

హైదరాబాద్ నగరం తెల్లవారుజామునే మేలుకొంటుంది. రైలు పట్టాలపై వేలాది పాదాల సవ్వడి, చేతిలో ఫోన్ పట్టుకుని లోపలికే చూస్తున్న కళ్లు, భుజాలు వంగిపోయిన మనుషులు ఇవే నేటి నగర జీవితపు చిహ్నాలు.. తెలుగు దర్శకుడు రాజ్ రాచకొండ తన హిందీ చిత్రం ‘8 A.M. Metro’లో ఈ నగరపు ముఖాన్నే తెరపై ఆవిష్కరించాడు.. కానీ అది కేవలం హైదరాబాద్ నగరపు ముఖం మాత్రమే కాదు. అది అన్ని నగరాల ఆత్మ ముఖచిత్రమే.
మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తెలుగు నవల ‘అందమైన జీవితం’ నుండి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం, తెలుగు సాహిత్య వారసత్వాన్ని హిందీ తెరపై విజయవంతంగా నిలబెట్టింది. ఇది కేవలం ఒక ఒక సినిమా మాత్రమే కాదు ఒక కవితా సంకలనం కూడా అనిపిస్తుంది.
మెట్రోలో పరిచయం అయ్యి..
ఇరావతి (సాయమీ ఖేర్) నాందేడ్‌లో బంధాల మధ్య ఇరుక్కున్న గృహిణి. చిన్నప్పుడు రైలు ప్రయాణంలో తండ్రి ప్రయాణం మధ్యలో దిగి తిరిగి తనను చేరుకునేందుకు పట్టిన 15 నిమిషాల వ్యవధిలో తప్పిపోయానేమోనన్న భయం ఆమెకు మానసిక గాయంగా మారి, రైలు ప్రయాణా లంటే పానిక్ అటాక్‌లు వస్తాయి. అయినా ఆమె హైదరాబాద్ చేరి అక్కడ కూడా సమయం, డబ్బు ఆదా చేయడానికి ఆసుపత్రి నుండి రియా ఇంటి వరకు ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తుంది. మెట్రోలో పుస్తకాలను ప్రేమించే నిశ్శబ్ద స్వభావం గల ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య)తో పరిచయం అవుతుంది. సాహిత్యం, కాఫీ సంభాషణల మధ్య ఇద్దరూ దగ్గరవుతూ తమ జీవిత గాయాలను పంచుకుంటారు. ఇద్దరూ తమ మానసిక గాయాలను మాన్పుకునే క్రమంలో, విషాదం మనసును ఎలా కొరుకుతుందో, కృత్రిమ సమస్యలతో కాలం వృథా చేసుకుంటూ మనం జీవితాన్ని ఎలా జారవిడుస్తామో హృదయానికి హత్తుకునే క్షణాలు కనిపిస్తాయి. దైనందిన జీవితంలో మనం జీవించే అబద్ధ ప్రమాణాలను సరిచేసుకోవడానికి గొప్ప సాహిత్యాన్ని ప్రమా ణంగా తీసుకోవాలనే ప్రీతమ్ విశ్వాసం ఆసక్తికరమైన ఆలో చన. అది ఆమెకు నచ్చుతుంది.
సినిమాటోగ్రఫీ ప్లస్..
ఇరావతి, ప్రీతమ్ ఈ రెండు అసంపూర్ణ అస్పష్ట వ్యక్తిత్వాలు ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల మెట్రోలో కలుస్తాయి. వారి మధ్య మాటల మెరుపులు, మౌనాలకు అర్థాలు, ఒకరి వ్యథను ఒకరు తెలిసీ తెలియకుండా ఉండేందుకు నటిస్తారు.. అది ప్రేమ కాదు అంతకన్నా సూక్ష్మమైనది, అంతకన్నా అమూల్యమైనది. అది మానవ హృదయ స్పర్శ. రాజ్ రాచకొండ ఇంతకు ముందు ‘మల్లేశం’ వంటి గొప్ప జీవితగాథను తెలుగు సినిమాకు అందించాడు. ఈసారి అతడు మెట్రో రైళ్ల అద్దాల్లో మానవ మనసులను చదివాడు. సన్నీ కురపాటి చేసిన సినిమాటోగ్రఫీ హైదరాబాద్ నగరాన్ని ఒక అందమైన కవితగా మార్చింది. చార్మినార్, హుస్సేన్ సాగర్, చౌమొహల్లా పాలెస్ ఇంకా నగరపు సందులూ కేవలం లొకేషన్లు కావు, అవి పాత్రల మానసిక స్థితికి అడ్డం పడతాయి. కెమెరా ప్రతి ఫ్రేం ఒక మంచి భావనను అందిస్తుంది.
సహజ నటన..
ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పుస్తకప్రియుడు, గుల్జార్ కవితలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మనిషి, లోపల ఒక అగోచరమైన వేదన పొంగుతూ వుంటుంది. పైకి కనిపించనీయడు. సినిమాకు అతిపెద్ద బలం గుల్జార్ కవిత్వం. ఆరు కవితలు రాసి ఈ చిత్రానికి ప్రాణం పోశారాయన. ఒక్కో పాట ఒక్కో గాయానికి మాటలు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ‘జింద్‌గీ కో జింద్‌గీ కీ తరహ్ జీయో’ అనే సందేశం చిత్రంలో చూస్తే కళ్లు తడి అవుతాయి. ప్రీతమ్‌గా అసాధారణ నటన ప్రదర్శించాడు. అతని కళ్లలో ఆనందం చెప్పాలనే తపన ఉంటుంది. కానీ మాటల వెనుక ఒక దుఃఖం దాగి ఉంటుంది. ఆ ద్వంద్వాన్ని అతను అద్భుతంగా పండించాడు. పాత్ర చివరిలో నిజంగా మనల్ని కుదిపేస్తుంది. సయామీ ఖేర్ కూడా ఇరావతిగా సహజ సిద్దంగా నటించింది కళ్లలో ప్రశ్నలు, నడకలో నిరీక్షణ. ఆమె పాత్ర ఇరావతికి నిండైన జీవం ఇచ్చింది.
‘మనిషికి మనిషి అవసరమని’ చెప్పే సినిమా!
ఈ సినిమా ‘ది లంచ్‌బాక్స్’ తరహాలో ఒక మంచి ప్రయత్నం. వేగంగా నడిచే ఇవ్వాల్టి కమర్షియల్ సినిమాల నడుమ ఇది మంద్రంగా నిదానంగా నడిచే ఒక నదిలాంటి భావనను అందిస్తుంది. నిశ్శబ్దంగా, గాఢంగా మానసిక ఆరోగ్యాన్ని సున్నితంగా, హుందాగా చర్చించిన విధానం బాగుంటుంది. ఈ చిత్రం చూసిన తర్వాత మన మనసులో ఒక నిశ్శబ్దం మిగులుతుంది. అది దుఃఖపు నిశ్శబ్దం కాదు, స్వచ్ఛమైన అనుభవం తర్వాత కలిగే నిశ్శబ్దం. ఈ సినిమా మనకు చెప్పేది ఒక్కటే ‘మనిషికి మనిషి అవసరం’. ప్రేమ కాకపోయినా, చుట్టరికం కాకపోయినా, ఒక స్నేహపు స్పర్శ, ఒక అర్థవంతమయిన మాట, ఒక మెట్రో ప్రయాణంలో పంచుకున్న నిట్టూర్పు కూడా ఒక జీవితాన్ని మళ్లీ జీవించేలా చేయగలదు..
- వారాల ఆనంద్
94405 01281






