మనసు వినిపించుకోలేని సంబంధాల కథ!

by Ravi |   (  Updated:2026-05-30 01:01:10  IST  )

గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ నటించిన ‘8 ఏఎం మెట్రో’ సినిమా వివాహ బంధాల్లోని మానసిక ఒంటరితనం, పానిక్ అటాక్స్, భావోద్వేగ అవసరాలను హృద్యంగా చూపిస్తుంది. సంబంధాల సున్నితత్వాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంపై విశ్లేషణ.

మనసు వినిపించుకోలేని సంబంధాల కథ!
X

జీవితంలో ఏ సమయంలోనో ఎదురైన కొన్ని అనుభవాలు నిమిషాలో, క్షణాలో మాత్రమే కావచ్చు, అవి తీవ్రమైన దిగుళ్లుగా, ఫోబియాలుగా మారి జీవితాంతం వెంటాడతాయని, దారుణమైన శారీరక, మానసిక రుగ్మతలుగా మారి ప్రాణాలే తీయవచ్చని మనలో ఎందరం గమనిస్తున్నాం? బాధితులను చులకన చెయ్యకుండా, చిరాకు పడకుండా, పిచ్చివాళ్లనే ముద్రలు వెయ్యకుండా మనసులో మాట పంచుకునేందుకు కాస్త చోటు కల్పిస్తున్నాం?

'8 ఏఎం మెట్రో' అనే ఈ సినిమాలో ఇరావతి వెదుక్కున్నది కూడా అలాంటి కాసింత స్పేస్ కోసమే. ఆమె ప్రపంచమే చాలా చిన్నది. దానికి కేంద్రం ఆమె ఎంతో ప్రేమించే, విశ్వసించే, మానసికంగా ఆధారపడే భర్త. తన అనుభవాలు, భయాలు, ఆసక్తులు అతనితో పంచుకోవాలని ఆమె తపన. అలా అతనికి మరింత సన్నిహితం కావాలని, మనసు తేలిక పరచుకునే మోరల్ సపోర్ట్ పొందాలనీ ప్రయత్నం. పెద్ద కోరికలేమీ కావు, కానీ ప్రయత్నించిన ప్రతిసారీ నిరాశ! కారణం వాళ్లు భార్యాభర్తలు కావటమే!

ఆదర్శవంతమైన భర్త అయినప్పటికీ..

నాందేడ్ నుంచి హైదరాబాద్ వరకు ఒంటరిగా రైలులో ప్రయాణం చేయాల్సి రావడంతో ఆమె భయంతో భర్తను వెంట రావాలని అడిగింది. కానీ ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్న అతడు “లీవ్ దొరకదు” అంటూ నిరాకరించాడు. సాధారణంగా కనిపించే ఈ ప్రయాణం ఆమెకు మాత్రం భయంకరమైన అనుభవం, ఎందుకంటే చిన్నప్పుడు నాన్నతో రైలులో వెళ్తూ ఒక స్టేషన్‌లో ఆయన దిగిపోయి, రైలు కదలడంతో వేరే కంపార్ట్‌మెంట్‌లో ఎక్కాల్సి వచ్చిన సంఘటన ఆమె మనసులో తీవ్రమైన ముద్ర వేసింది. ఆ పావుగంట భయం సంవత్సరాల తరువాత కూడా ఆమెను విడిచిపెట్టలేదు. ఒంటరిగా రైలెక్కినప్పుడల్లా గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, స్పృహ తప్పిపోతుందేమో అన్న భయం వెంటాడుతూనే ఉన్నాయి అదే ఆమె పానిక్ అటాక్‌కు కారణం. అలాగని ఉమేష్ చెడ్డవాడేమీ కాదు. అధికారం చెలాయించే పెత్తందారీ భర్త అసలే కాదు. కష్టపడి ఉద్యోగం చేస్తాడు. దురలవాట్లు లేవు. భార్యాపిల్లలను ఇష్టంగా, బాధ్యతగా చూసుకుంటాడు. ఆమె పుట్టింటి వాళ్ల కష్టాల్లో కన్సర్న్ చూపుతాడు. ఒక్కమాటలో ఆదర్శవంతమైన భర్త.

భర్త ప్రేమను కోరుకుని..

ఇరా తన భర్తను ప్రేమిస్తూ గౌరవించినా, అతడిలో స్నేహితుడిని, ఆత్మీయతను వెతుకుతోంది. కానీ అతడికి ఆమె భావాలు అర్థం కాక, ఆమె ఒంటరితనం పెరుగుతుంది. ఆ ఖాళీని అనూహ్యంగా సహ ప్రయాణికుడు ప్రీతమ్ దగ్గర కనుగొంటుంది. ప్రీతమ్ కూడా కుటుంబాన్ని ప్రేమించినా, పుస్తకాలకే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఆత్మీయత కోరి దగ్గరవుతున్న మృదుల నిరాశ చెందుతూ, చివరికి కోల్పోయిన ప్రేమను గుర్తుచేసుకుని బాధపడుతుంది. భార్యాభర్తల నడుమ స్వార్థాలతో, ద్వేషాలతో ధ్వంసమయిపోయే సంసారాల గురించి ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ సినిమాలో జంటల సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి? స్త్రీ, పురుషులు కలిసి బతికే యూనిట్‌లో భౌతికమైన అవసరాలు, బాధ్యతలే గాక మానసికమైన అవసరాలుంటాయని గుర్తించకపోవటం. అలా గుర్తించాలన్న స్పృహకే చోటివ్వని విధంగా వాళ్ల పాత్రలు తయారయిపోయి ఉండటం. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తులను గ్రాంటెడ్‌గా తీసుకోవటం. ఒకరికొకరు ఆంతరికమైన స్పేస్‌ను కేటాయించాలన్న సున్నితత్వం లోపించటం. ఒకరికొకరు ‘అలవాటుపడి’ బతికెయ్యటం. జంటలోని ఇద్దరూ ఇలాగే బతికెయ్యగలిగితే సమస్యే లేదు. ఏ ఒక్కరో ఆ రొటీన్‌లో ఇమడకపోతే కథ మలుపు తిరుగుతుంది.

‘అందమైన జీవితం’ నవల ఆధారంగా

మనసు కోరుకునే స్నేహాన్ని ఇంటి వెలుపల వెదుక్కోవటం మొదలవుతుంది. అది కేవలం మానసికమైనదే కావచ్చు. కానీ ఆపోజిట్ సెక్స్ నడుమ ఏర్పడినప్పుడు సమాజం నుండి ఆమోదం దొరకదు. ఆ 'సమాజం' లో తన భర్త/ భార్య కూడా భాగమేనన్న ఎరుక ఆ వ్యక్తులలో గిల్ట్‌కు కారణమవుతుంది. ఇరా లో ఏర్పడిన అపరాధ భావన, ఆమె భర్తలో సందేహం వాళ్ల జీవితాల్లో కొత్త సమస్యలను సృష్టిస్తాయా? లోపించిన అవగాహనను కల్పిస్తాయా? అనే ప్రశ్నను ఓపెన్ ఎండెడ్‌గా వదలటం ద్వారా ఈ చర్చకు మరింత విస్తృతిని తెచ్చింది సినిమా. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల 'అందమైన జీవితం' ఆధారంగా రాజ్ రాచకొండ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన హిందీ చిత్రం 8AM METROలో చెప్పుకోదగిన అంశాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఆహ్లాదకరమైన పార్శ్వాన్ని, గుల్జార్ గీతాల తాత్వికతను చక్కగా ఉపయోగించుకున్నారు. సినిమాకు, సాహిత్యానికి సంబంధం తెగిపోతోందని బెంగపడే వాళ్లకు దేశ, విదేశీ రచయితల ప్రస్తావన ఒక ఊరట. సినిమాకు అనుగుణంగా కథను తీర్చటంలో తెలుగు కథకులు వెంకట్ సిద్దారెడ్డి, డా. భారతి (గీతాంజలి)పేర్లు టైటిల్స్‌లో కనబడటం మనకు మరికాస్త దగ్గరతనాన్ని ఇస్తుంది. కుటుంబ సంబంధాలలోని అతి సున్నితమూ, సంక్లిష్టమూ కూడా అయిన అంశాలను ఆసక్తికరంగా చెప్పిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5లో అందుబాటులో ఉంది.

సమీక్షకులు

-కాత్యాయని ఎస్.

63038 05727

Next Story