దేశంలో ఎన్నికల యుద్ధం!

by Ravi |   (  Updated:2026-03-17 00:30:16  IST  )

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు మరియు పుదుచ్చేరిలో జరుగుతున్న శాసనసభ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి. బీజేపీ-ప్రతిపక్షాల మధ్య పోటీ, ప్రాంతీయ పార్టీల ప్రభావం, ఎన్నికల వ్యూహాలపై విశ్లేషణ.

దేశంలో ఎన్నికల యుద్ధం!
X

దేశ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల హోరు మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. సాధారణ ఎన్నికల తర్వాత ప్రతీ ఏడూ దేశంలో ఎక్కడో ఒకచోట రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.. ఈసారి జరుగుతున్నవి మాత్రం ప్రత్యేకమైనవి. యావత్ దేశం దృష్టిని తమవైపు తిప్పు కొనేలా చేసేవి. ఏప్రిల్ 9 నుండి 29 వరకూ జరిగే ఈ ఎన్నికలు వైరి పక్షాల మధ్య నువ్వా.. నేనా? అనే తీవ్ర పోటీతో జరగబోతున్నాయి. మూడు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపేతర పార్టీల పాలనలో ఉండగా అస్సాంలో బీజేపీ పాలన. పుదుచ్చేరిలో బీజేపీ మిత్రపక్షంతో కలిసి అధికారంలో ఉంది. కాబట్టి అటు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీలు తమ బలాన్ని కోల్పోయే పరిస్థితి రాకుండా తీవ్రంగా శ్రమించాలి. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కూడా కీలకంగా మారనుంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీల వ్యూహాలు ఎంతవరకు ఫలి స్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల సంకీర్ణ రాజకీయాల అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న పార్టీల మద్దతు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇటు పాలక పక్షం బీజేపీ తమకు అను వుగాని చోట అధికమయ్యే ప్రయత్నాలు చేయాలి. వెరసి రెండు వైపులా ఎదురీత ప్రయత్నాలే.. ఎవరు ఏ మేరకు సఫలీ‌కృతమౌతారో వేచి చూడాల్సిందే.. ఇక పశ్చిమాసియాలో యుద్ధం మన ఇంధన భద్రత, ఆర్థిక రంగాల్ని ప్రభావితం చేస్తున్న వేళ ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ పై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తమ అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ లిస్ట్ సవరణ (సర్) వివాదాస్పదం కాగా సుప్రీం సూచనలతో ఇంకా తుది జాబితా విడుదల ప్రాసెస్‌లోనే ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యుద్ధరంగం పరిస్థితి వేరే.. అక్కడ బీజేపీకి పెద్ద ఆశలు లేవు.. వెరసి ఈ ఎన్నికలు ఇరువైపులా వైరి పక్షాలకు అనుకూలం కాని యుద్ధాలే.. పరాభవ నామ సంవత్సరం ఎవరికి పరాభవం మిగులుస్తుందో? ఎవరికి ప్రాభవం కల్పిస్తుందో?

- డా.డి.వి.జి.శంకరరావు,

9440836931

Next Story