- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక శక్తిలో 4వ స్థానం గొప్పదే.. కానీ
భారతదేశం 2025లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని అంతర్జాతీయ

భారతదేశం 2025లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదికలు సూచిస్తున్నాయి. బీజేపీ నాయకులు దీనిని గొప్ప విజయంగా చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ జీడీపీ వృద్ధి వెనుక దాగిన సవాళ్లు అనేకం... నిరుద్యోగం, పేదరికం, మధ్యతరగతి సమస్యలు, వ్యవసాయ రంగ సంక్షోభం, విద్యా-వైద్య రంగాల్లో నాణ్యతా లోపాలు వంటి అంశాలను విశ్లేషిస్తే, ఈ గొప్పలు ఎంతవరకు నిజమైన అభివృద్ధిని ప్రతిబింబిస్తాయనే ప్రశ్న తలెత్తుతుంది.
జీడీపీ వృద్ధి నిజమైన చిత్రం
ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, 2025 లో భారతదేశ నామమాత్ర జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఇది జపాన్‌ను అధిగమించి మన దేశాన్ని నాల్గవ స్థానానికి చేర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 8.2 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి. అయితే, ఈ గణాంకాలు ఆర్థిక వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల జీవన పరిస్థితుల్లో గణనీయమైన మార్పులను తీసుకు రాలేదని ఆర్థిక నిపుణులు విమర్శనాత్మకంగా తగిన ఆధారాలతో పేర్కొన్నారు.
నిరుద్యోగం- పేదరికం వృద్ధి వైరుధ్యం
భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం, నిరుద్యోగ రేటు 8.4 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వ గణాంకాలు దీనిని 3.2 శాతంగా చూపిస్తున్నాయి. యువతలో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉంది, 2024-25 లో అర్బన్ యువతలో నిరుద్యోగం 16.8 శాతంగా నమోదైంది. అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం, 23 కోట్ల మంది పేదరిక రేఖ కిందకు జారిపోయారని, ఇది 2004-15 మధ్య 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడిన సాఫల్యాన్ని రద్దు చేస్తుంది. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (2024) ప్రకారం, 234 మిలియన్ భారతీయులు ఇప్పటికీ తీవ్ర పేదరికంలో ఉన్నారు.
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం
వ్యవసాయ రంగం, భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ప్రస్తుతం ఇది తీవ్ర సంక్షోభంలో ఉంది. కనీస మద్దతు ధర (ఎం.ఎస్.పి) లేకపోవడం, అధిక పురుగు మందుల వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను అనేక దేశాలు తిరస్కరిస్తున్నాయి. భారత ఆగ్రోకెమికల్స్ ఎగుమతులు గత ఆరేళ్లలో రెట్టింపు అయినప్పటికీ, అవి గ్లోబల్ మార్కెట్‌లో నాణ్యతా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. రైతులు అధిక రుణభారంతో బాధపడుతున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఉత్పత్తుల నాణ్యత తగ్గుతోంది.
ఈ రంగాల నాణ్యతా లోపం
విద్య, వైద్య రంగాలు సామాన్య ప్రజలకు అందు బాటులో లేవు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేకపోవడం, వైద్య సేవల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడే పేదలకు సరైన సౌకర్యాలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో భారతదేశం 126వ స్థానంలో, జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్‌లో 108వ స్థానంలో ఉంది, ఇది సామాజిక అభివృద్ధిలో వెనుకబాటుతనాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది కేవలం గణాంకాలలో మాత్రమే వ్యక్తం అయ్యేది కాదు, అది ప్రజల జీవన ప్రమాణాలలోనూ నిత్యం ప్రతిబింబించాలి. సమగ్ర అభివృద్ధి కోసం దేశంలోని సమస్యలను పరిష్కరించడం అత్యవసరం.
డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్,
98493 28497






