- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 ఏళ్ల సంకీర్ణ పాలన, మారని బీహార్ పరిస్థితి...
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదుగుతున్న వేళ, బీహార్ మాత్రం అభివృద్ధి అంచుల దాకా చేరుకోలేక ఉంది.

భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదుగుతున్న వేళ, బీహార్ మాత్రం అభివృద్ధి అంచుల దాకా చేరుకోలేక ఉంది. ఒకప్పుడు ‘ఆటవిక రాజ్యం’ అని బీజేపీ విమర్శించిన ఈ రాష్ట్రం, గత రెండు దశాబ్దాలుగా అదే పార్టీ మిత్రపక్ష పాలనలో ఉంది. అయినా పేదరికం, నిరుద్యోగం, నేరాలు, వలసలు ఇలా ఏ రంగంలోనూ మార్పు కనిపించలేదు.
దశాబ్దాలుగా బీహార్ అభివృద్ధి లేకుండా మిగిలి పోయింది. 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంటే, బీహార్ మాత్రం వెనుకబడి ఉండటం దేశ సమానతకు సవాలుగా మారింది. రాజకీయ నేతలు, పార్టీలు తమ బాధ్యతను గుర్తించి మారితేనే రాష్ట్రానికి మార్గం చూపే అవకాశం ఉంటుంది.
నేరాలు, మర్డర్లు.. అన్నింట్లోనూ టాప్
బీహార్ రాష్ట్రం నేరాలకు నిలయం. రాష్ట్ర క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ప్రతి నెలా 229 హత్యలు జరుగు తున్నాయి. రోజూ హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు ఉంటాయి. 2023 ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం మర్డర్ రేట్ 2.0, కిడ్నాపింగ్ రేట్ 8.2, రేప్ రేట్ 4.4, మహిళలపై నేరాలు 16.3 శాతం పెరిగాయి. 2018 - 2022 మధ్య ప్రతిరోజు 953 నేరాలు జరుగుతున్నాయి. అందులో 8 హత్యలు, 33 కిడ్నాప్‌లు, 55 మహిళలపై నేరాలు. నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర నేర చరిత్రలో మార్పు లేదు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంటున్నారు. అక్కడ న్యాయ వ్యవస్థ కూడా నేరాలను అరికట్టే లేకపోతోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పెద్ద గుదిబండ సమస్యగా ఉంది.
వలసబాటలో 75 లక్షల మంది ..
బీహార్ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రం. పేదరికం 33.76 శాతంగా ఉంది. ఇది దేశంలో అత్యధికం. నీతి ఆయోగ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం బీహార్ లాస్ట్ ర్యాంక్‌లో ఉంది. తలసరి ఆదాయం దేశ సగటు కంటే తక్కువ. స్థూల దేశీయోత్పత్తి కూడా తక్కువ. నిరుద్యోగిత రేట్ 3.9 శాతం. దేశ సగటు 3.2 శాతం కంటే ఎక్కువ. మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చాలా తక్కువ. 60 శాతం జనాభా 30 ఏళ్లలోపు వారే. వారికి ఉద్యోగాలు లేవు. దీంతో శాంతిభద్రతల సమస్యలు పెరుగుతున్నాయి. లక్షలాది మంది యువత చిన్నాచితక పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. 74.5 లక్షల మంది బీహారీలు బయట రాష్ట్రాల్లో పని చేసుకుని దుర్భరంగా బతుకుతున్నారు.
35 వేల ఉద్యోగాలకు కోటి అప్లికేషన్లు..
సామాజిక అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, పాలనలో ఇలా అన్ని విధాలా బీహార్ అధమ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 35 వేల రైల్వే ఉద్యోగాల కోసం కోటి మంది అప్లై చేశారు. ఎంపికలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆందోళన చేశారు. రైళ్లకు నిప్పు పెట్టారు. కాల్పులు జరిగాయి. ఎన్నికల ముందు పార్టీలు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇస్తాయి. కానీ అవి నినాదాలుగా మిగులుతాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం బీహార్‌లో అత్యధిక పేదరికం, నిరుద్యోగం సమస్యలు ఉన్నాయి. కుల సర్వేలో 94 లక్షల మంది రోజుకు 200 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న వారు కేవలం 10 శాతం మాత్రమే.
15 ఏళ్ల పాలనలో రూపురేఖలు మారలేదు...
బీహార్ రాజకీయాలు ఎంత సేపూ దారిద్య్రం, వలసలు, పాలనా వైఫల్యాలు, హింస, కులతత్వం, అవినీతి చుట్టూ తిరుగుతుంటాయి. ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టడం అక్కడ సర్వ సాధారణం అయిపోయింది. ఇక్కడ విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తోంది. మోడీ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రాజెక్టులు పేపర్‌పై ప్రకటనలను గుప్పిస్తోంది. కానీ ఆచరణలో అమలైన దాఖలా లేదు. ఉపాధి కల్పన లేదు. బీహార్ రూపురేఖలు గత 15 ఏళ్ల పాలనలో మారలేదు. దీనికి నితీష్ కుమార్, మోదీ ద్వయం బాధ్యత వహించాలి.
ఇవి మెరుగుపరచుకోవాలి..
బీహార్ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతాయి. కుల లెక్కలు, మత విద్వేషాలు, తాయిలాలు ప్రభావితం చేస్తాయి. వీటిని అధిగమించాలి రాజకీయ పార్టీలు, వాటి నేతలు తమ బుద్ధులు మార్చుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, భద్రత మెరుగుపరచాలి. అప్పుడే బీహార్ మారుతుంది. ఈ ఎన్నికలు ఒక అవకాశం. ప్రజలు సరైన నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే బీహార్ భవిష్యత్ ఉజ్వలం. లేకపోతే ప్రజలు ఎదురు తిరుగుతారు.
-డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్
98493 28496






