139 సంవత్సరాల పండగ.. కానీ నేటికీ గుర్తింపు లేకుండానే

by Ravi |   (  Updated:2025-05-02 00:30:41  IST  )

139 సంవత్సరాల పండగ.. కానీ నేటికీ గుర్తింపు లేకుండానే
X

నేడు ప్రపంచీకరణ, సరళీకరణ పేరుతో, విదేశీ బహుళజాతి కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో, ఆటోమొబైల్స్, బీమా నుండి రిటైల్ వ్యాపారం వరకు ఆధిపత్యం చెలాయించడానికి ద్వారాలు తెరిచేశారు. ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ ఆస్తులను, సేవలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే కార్యక్రమం. ఇది వివిధ రూపాల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ-ప్రైవేటు భాగ స్వామ్యం వంటి వివిధ పేర్లతో అమలు చేయబడుతుంది. ముఖ్యమైన ప్రజా సేవలను లాభాల వనరులుగా మార్చడమే దీని లక్ష్యం. రైల్వేలు, బొగ్గు గనులు, ఆర్.టి.సి, విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, అనేక ఇతర రంగాలలోని కార్మికుల పరిస్థితులను మరింత దిగజార్చింది. కార్మిక హక్కులకు ఎటువంటి చట్టపరమైన రక్షణ లేకుండా, కాంట్రాక్ట్ కార్మికులను అవుట్‌ సోర్సింగ్ పద్ధతిలో నియమించడం ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలలో విస్తృతంగా పెరిగింది. ఇది కార్మికుల బేర సారాల శక్తిని బలహీన పరిచేందుకు ఉపయోగపడుతుంది. నూతన లేబర్ కోడ్ల ద్వారా కార్మిక చట్టాలు కార్మికులు నచ్చిన యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కోల్పోతున్నాయని ట్రేడ్ యూనియన్ల వాదన.. కోట్లాది మంది కార్మికులు సామాజిక భద్రత హక్కును కోల్పోతున్నారు. యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కార్మికులను నియమించుకోవడం, తొలగించుకోవడం జరుగుతుంది. తాత్కాలిక ఒప్పందాలపై ఎక్కువ మంది కార్మికులను నియమించుకొని పని గంటలను రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు మించి పని చేయడం జరుగుతుంది. తమ రక్తాన్ని చెమటగా మార్చి దేశాభివృద్ధికి పాటుపడిన విశ్రాంత కార్మికులకు పెన్షన్ పెరగక పోవడం వలన వారి పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది. 139 సంవత్సరాల నుంచి మే డే పండుగ జరుపుకుంటున్న శ్రామికుల శ్రమకు గుర్తింపు ఎన్నడు లభిస్తుందో చూడాలి.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Next Story