వందకు వంద ఫలితాలు... సమాజ పతనానికి సంకేతం

by Bhoopathi Nagaiah |

ప్రతి విద్యా సంవత్సరాంతంలో వినిపించే ఒకే ఒక డిమాండ్... వందకు వందశాతం ఫలితాలు. ఈ సంఖ్యే నాణ్యతకు ప్రమాణంగా మారిపోయింది.

వందకు వంద ఫలితాలు... సమాజ పతనానికి సంకేతం
X

ప్రతి విద్యా సంవత్సరాంతంలో వినిపించే ఒకే ఒక డిమాండ్... వందకు వందశాతం ఫలితాలు. ఈ సంఖ్యే నాణ్యతకు ప్రమాణంగా మారిపోయింది. కానీ ఈ ఫలితాల వెనుక దాగి ఉన్న మౌన త్యాగం... పిల్లల బాల్యం, వారి మానసిక ఆరోగ్యం, వారి హక్కులు. మార్కులే ప్రధాన ప్రమాణంగా మారినప్పుడు, పిల్లాడు నేర్చుకునే మనిషిగా కాకుండా ఒక గణాంకంగా మారుతున్నాడు. ప్రశ్నలు అడగడం అనే తన సహజ గుణాన్ని జిజ్ఞాసను కోల్పోతున్నాడు.

ప్రశ్నలు అడగడం వాటికి సమాధానాలు అన్వేషిస్తూ సాగడం అనే చర్య ఒక వృథా ప్రయాసగా మారిపోయిన ఈ తరుణంలో , తప్పులు చేయడం వైఫల్యం పొందడం తద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదించడం అనే విషయం ఒక పనికిమాలిన పనిగా తీర్చిదిద్దబడిన నేటి పరిస్థితులలో, పిల్లవాడు తన స్వతః జ్ఞానాన్ని తానే తొక్కివేసుకుంటున్నాడు.

భయంతో నడిపించే విధానంగా విద్య

తక్కువ మార్కులు నేరంగా పరిగణింపబడుతున్న ఈ సమాజంలో, ఫెయిల్ అవ్వడం క్షమించరాని అవమానంగా మారిన ఇవాల్టి రోజున పిల్లవాడు తనకేం కావాలో తానే తేల్చుకోలేక అనేక పక్కదారులు పడుతున్నాడు. చివరికి బాల్యాన్ని, భవిష్యత్తును రెండింటినీ కోల్పోతూ ఒక భరించలేని ఆవేశాలకు, అర్ధంపర్ధం లేని ఆలోచనలకు బానిసలా మారుతున్నాడు. ఇది విద్యను భయంతో నడిపించే విధానంగా మార్చడం వలన కలిగిన ఒక దుష్పలితం. ఇది బాలల హక్కుల ఆత్మకు విరుద్ధం.

విద్య లక్ష్యం మార్కులేనా?

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కన్వెన్షన్ (యుఎన్‌సిఆర్‌సి) ప్రకారం ప్రతి పిల్లాడికి భయపడకుండా నేర్చుకునే హక్కు ఉంది. ఆర్టికల్ 28 విద్య హక్కును, ఆర్టికల్ 29 విద్య యొక్క అసలైన లక్ష్యాన్ని ఇంకా స్పష్టంగా నిర్వచిస్తాయి. విద్య లక్ష్యం కేవలం మార్కులు కాదని ; పిల్లవాడి వ్యక్తిత్వం, ఆలోచనా శక్తి మానసిక–శారీరక సామర్థ్యాల సంపూర్ణ అభివృద్ధి దిశగా ఆ లక్ష్యం సాగాలని . అయితే నేటి పరీక్షా కేంద్రిత వ్యవస్థలో ఈ లక్ష్యం క్రమంగా మసకబారుతోంది, లక్ష్యం దిశనూ మార్చుకుంటోంది.

ఆడుకోవడం టైం వేస్ట్‌ అట

యుఎన్‌సిఆర్‌సి ఆర్టికల్ 31 ప్రకారం పిల్లాడికి ఆడుకునే, విశ్రాంతి తీసుకునే హక్కు ఉంది. కానీ నేటి టైం టేబుల్‌లో ఈ హక్కు దాదాపు కనుమరుగైంది. సిలబస్ భారం, పరీక్షల ఒత్తిడి మధ్య బాల్యం నిశ్శబ్దంగా తొక్కబడుతోంది. ఆడుకోవడం టైం వేస్ట్‌గా ముద్ర వేయబడితే, పిల్లాడి మానసిక ఆరోగ్యం ఎవరి బాధ్యత? తద్వారా పిల్లవాడు కోల్పోతున్న శారీరక ఎదుగుదలకు ఎవరు మూల్యం చెల్లించాలి? అలాగే ఆర్టికల్ 12, 19లు పిల్లాడి గౌరవం, భద్రత, తన అభిప్రాయం చెప్పే హక్కును గుర్తు చేస్తాయి. కానీ మార్కుల ఆధారిత విద్యలో పిల్లాడి స్వరం వినిపించడం లేదు. ఉపాధ్యాయుడిపై ఫలితాల బాధ్యత మోపబడుతున్నప్పటికీ, బాల్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే స్వేచ్ఛ మాత్రం ఇవ్వబడటం లేదు.))

చదువును రుద్దితే బాల్యం హరీ

ఈ మొత్తం చర్చలో తరచూ మరిచిపోతున్న మరో ముఖ్యమైన అంశం..ఉపాధ్యాయుడి పాత్ర. బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుడు కీలకమైన స్థానం కలిగిన వ్యక్తి. యుఎన్‌సిఆర్‌సి స్ఫూర్తి ప్రకారం ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు; పిల్లాడి భద్రత, గౌరవం, అభివృద్ధిని కాపాడే బాధ్యత కలిగిన మార్గదర్శి. కానీ నేటి ఫలితాల కేంద్రిత వ్యవస్థలో ఉపాధ్యాయుడి పాత్ర తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. పిల్లవాడిని వాడి స్వచ్ఛ జీవితంలో నుంచీ పెకలించి ఒక అదనపు మోతలా చదువును రుద్దే వ్యక్తిలా నేటి ఉపాధ్యాయుడు మార్చబడ్డాడు.

ఫలితాల ఉత్పత్తిదారుగా టీచర్

వందకు వంద ఫలితాల డిమాండ్ ఉపాధ్యాయుడిని బోధకుడిగా కాకుండా, ఫలితాలు ఉత్పత్తి చేసే నిర్వాహకుడిగా మారుస్తోంది. విద్యార్థి వెనుకబడ్డప్పుడు, కారణాలను విశ్లేషించకుండానే, నేరుగా బాధ్యత ఉపాధ్యాయుడిపై మోపుతున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, సమాజపు ఒత్తిడి, పిల్లల మానసిక స్థితి వంటి అంశాలు పక్కకు నెట్టివేయబడి, “ఫలితాలు రాలేదు” అన్న ఒకే ఒక్క ప్రమాణంతో ఉపాధ్యాయుడి సామర్థ్యాన్ని కొలవడం పరిపాటిగా మారింది.

బాల్యాన్ని తొక్కే వ్యవస్థలో పావుగా...

ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు బాల్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, భయంలేని తరగతి గదిని నిర్మించాలనుకున్నా, వ్యవస్థ అతనికి ఆ స్వేచ్ఛ ఇవ్వడం లేదు. సిలబస్ పూర్తి చేయాలి, పరీక్షల కోసం డ్రిల్ చేయాలి, ఫలితాలు మెరుగుపరచాలి.. ఇవే ప్రధాన ఆదేశాలుగా మారాయి. ఫలితంగా, పిల్లవాడి భావోద్వేగాలు, అభిప్రాయాలు, ఆడుకునే హక్కు వంటి అంశాలు ద్వితీయ స్థాయికి నెట్టబడుతున్నాయి. ఇది ఉపాధ్యాయుడికి కూడా ఒక మానసిక సంఘర్షణ. ఒక వైపు బాలల హక్కులను గౌరవించాలనే వృత్తి ధర్మం, మరో వైపు ఫలితాల ఒత్తిడి. ఈ ద్వంద్వ బాధ్యతల మధ్య ఉపాధ్యాయుడు కూడా తన వృత్తి ఆనందాన్ని కోల్పోతున్నాడు. బాల్యాన్ని కాపాడే కాపలాదారుడిగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు, అనుకోకుండా బాల్యాన్ని తొక్కే వ్యవస్థలో ఒక పావుగా మారిపోతున్నాడు.

బాల్యాన్ని గౌరవించే విద్య కావాలి

కాబట్టి బాలల హక్కుల పరిరక్షణ గురించి, వారి విద్యా సామర్థ్య ఫలితాల గురించి మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయులను నిందించడం కాదు; వారికి అవసరమైన మద్దతు, స్వేచ్ఛ, విశ్వాసం కల్పించడం అత్యవసరం. ఉపాధ్యాయుడికి బాల్యాన్ని గౌరవించే విద్యను అమలు చేసే అవకాశం ఇస్తేనే, విద్యార్థి మానసిక స్థితిని అర్థంచేసుకుని తదనుగుణంగా బోధన చేసే అవకాశం కల్పిస్తేనే ఐక్యరాజ్యసమితి బాలల హక్కులు నిజంగా తరగతి గదిలో ఆచరణలోకి వస్తాయి. లేకపోతే, వందకు వంద ఫలితాల కోసం సాగుతున్న పోటీలో, పిల్లలతో పాటు ఉపాధ్యాయులూ ఓడిపోయే ప్రమాదం ఉంది.

ఏ సమాజ పతనానికి ఇది సంకేతం?

వందకు వంద ఫలితాలు తప్పు కావు. అవి నిశ్చింతతో కూడుకున్న, ఆనందమయ అవకాశాల ఫలితంగా, నిర్భయ లోకంలో సాధించబడాలి అంతేకానీ ఇష్టంలేని తప్పనిసరి వ్యాపకంగా మారి భయంతో, అవమానంతో, మానసిక ఒత్తిడితో సాధించబడితే, అవి విద్యా విజయాలు కాకుండా బాల్య హక్కుల ఉల్లంఘనలుగా మారతాయి. పరీక్షలో పాస్ అయిన పిల్లాడు, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం కోల్పోతే సమాజం నిజంగా గెలిచినట్టేనా!? అన్న ప్రశ్న ఎదురవుతోంది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థి లేదా వంద శాతం ఫలితాలు సాధించలేని పాఠశాల పైన ప్రకటించబడుతున్న నిర్లక్ష్య చూపు ఏ సమాజ పతనానికి సంకేతంగా మారుతోంది, అది ఏ దిశగా వ్యవస్థను తీసుకువెళుతోంది!? మనమే ఆలోచించుకోవాలి.

కాబట్టి అవసరం వందకు వంద మార్కులుకాదు; వందకు వందశాతం ఉత్తీర్ణతా కాదు. వందకు వంద శాతం బాల్యానికి గౌరవం. UN Child Rights పత్రాల్లోనే కాకుండా, తరగతి గదిలో ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉంది. బాల్యం కోల్పోయిన సమాజం, చివరికి మనుషులనే కోల్పోతుంది. ఈ నిజాన్ని గుర్తించే సమయం ఇదే. విద్యా వ్యవస్థ మారాల్సిన అవసరమూ ఇప్పుడే.

సుధా మురళి

83096 22246

Next Story