ఇండియా-ఇంగ్లాండ్ సీరీస్.. మరింత కఠినంగా బయోబబుల్

by  |
india-england test
X

దిశ, స్పోర్ట్స్: కీలకమైన ఇండియా టెస్ట్ సిరీస్ ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కరోనా బారిన పడి ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అప్రమత్తమైంది. గత ఏడాది కరోనా సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయిన సమయంలో తొలి సారి బయోబబుల్ ఏర్పాటు చేసి క్రికెట్ ఆడించిన ఘనత ఈసీబీది. ఎంతో ధీమాగా వరుసగా సిరీస్‌లు నిర్వహించుకుంటూ వస్తున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, శ్రీలంక సిరీస్ విజయవంతంగా నిర్వహించిన అనంతరం ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు సహా ఏడుగురు కరోనా బారిన పడటంతో ఈసీబీ ఆందోళన చెందింది. మరో నెల రోజుల్లో ఇండియాతో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 సైకిల్ ఈ సిరీస్ ద్వారా ప్రారంభం కానున్నది. ఇది రెండు జట్లకూ కీలకమే.

అంతే కాకుండా ఈ సిరీస్ నిర్వహణ ద్వారా ఈసీబీ 137 మిలియన్ డాలర్లు (దాదాపు. రూ. వెయ్యి కోట్లు) అర్జించాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. ఇప్పటికే బ్రాడ్‌కాస్ట్ హక్కులు, స్పాన్సర్‌షిప్ ద్వారా భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నది. టెస్ట్ సిరీస్‌కు ప్రేక్షకులను కూడా అనుమతించి గేట్ ఆదాయం రాబట్టుకోవాలని భావిస్తున్నది. కేవలం ఆదాయపరంగానే కాకుండా ఈ సిరీస్‌లో కరోనా ప్రభావం కనిపిస్తే తర్వాత యూఏఈలో జరిగే ఐపీఎల్ రెండో దశ, టీ20 వరల్డ్ కప్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈసీబీ అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేయబోతున్నది. సిరీస్‌కు ముందే ఇరు జట్ల ఆటగాళ్లకు రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నది. ఐపీఎల్ లాగా వాయిదా వేసి మరో సమయంలో నిర్వహించే అవకాశం ఉండబోదు కాబట్టి ఈసీబీ బయోబబుల్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Next Story

Most Viewed