పెరుగుతున్న ఎలక్ట్రానిక్ చెత్త

by  |
పెరుగుతున్న ఎలక్ట్రానిక్ చెత్త
X

ఇంట్లో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ టీవీ గానీ పాడైతే ఏం చేస్తాం? వెంటనే ఎలక్ట్రీషియన్‌ను పిలిచి రిపేర్ చేయిస్తాం. కొద్ది రోజులు పనిచేసి మళ్లీ పాడైందనుకోండి, మళ్లీ నిపుణుడిని పిలవాలంటే చిరాకు కలుగుతుంది. అందుకే వెంటనే ఇది పక్కకు వేసి కొత్తది కొనేస్తాం. మరి పాతది ఏమవుతుంది? పాత సామాన్ల వాడికిచ్చేస్తాం. మీ ఇంట్లో ఉండేది ఒక టీవీ, ఒక కంప్యూటర్ కాబట్టి సరిపోయింది. అదే ఇప్పుడు కొవిడ్ కారణంగా ఆఫీసులకు ఆఫీసులు, పరిశ్రమలకు పరిశ్రమలు మూత పడుతున్నాయి. మరి ఆయా సంస్థల్లో కూడా కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా.. మరి వాటి సంగతేంటి? వాటిలో పనికి రానివన్నీ ఎలక్ట్రానిక్ చెత్త కింద పేరుకుపోవాల్సిందే కదా! అంతర్జాతీయ స్థాయిలో ఈ చెత్త ఇప్పుడు మరింత వేగంగా పెరుగుతోంది. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి పర్యావరణానికి ఎంతో ప్రమాదం వాటిల్లే అవకాశముంది. ఈ చెత్తను సాంకేతికంగా ఈ-వేస్ట్ అని పిలుస్తారు.

ఈ-వేస్ట్ అంటే?

వాడి పారేసిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఉత్పత్తి అయిన చెత్తను ఈ-వేస్ట్ అంటారు. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి ఉష్ణోగ్రత వినిమయ పరికరాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి స్క్రీన్లు, మానిటర్లు, ఫ్లోరోసెంట్ బల్బులు, ఎల్ఈడీ ల్యాంపులు, వాషింగ్ మెషిన్లు, పెద్ద ప్రింటింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, వీడియో కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లు ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు.. వాడకం పూర్తయిన తర్వాత ఈ-వేస్టుగా మిగిలిపోతాయి.

గణాంకాలు డేంజరే!

ప్రతీ ఒక్క పనికి కంప్యూటర్ అవసరం తప్పనిసరి కావడంతో వాటి వాడకం పెరిగిపోయింది. దీంతో ఈ-వేస్టు కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల తక్కువ జీవిత కాలం, తక్కువ రిపేర్ ఆప్షన్ల వల్ల ఈ-చెత్త దారుణంగా పెరిగిపోతోంది. 2014లో ఒక్కొక్కరు 6.4 కేజీల చొప్పున ఈ-వేస్ట్ ఉత్పత్తి చేస్తే 44.4 మెట్రిక్ టన్నులుగా అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. 2019లో 53.6 మెట్రిక్ టన్నులుగా నమోదైన గణాంకాలను బట్టి 2025లో 65.3 మెట్రిక్ టన్నులు, 2030లో 74.7 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2019లో అధికంగా ఆసియాలో 24.9 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా, ఒక్కో వ్యక్తి 16.2 కేజీల చొప్పున ఐరోపా మొదటి స్థానంలో ఉంది.

ఈ-చెత్త మొత్తం ఏమవుతుంది?

ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో కేవలం 17.4 శాతం అంటే 9.3 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ మాత్రమే సేకరించి, పునర్వినియోగానికి రీసైకిల్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా 82.6 శాతం ఈ-వేస్ట్‌కి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు. ఇది ఎక్కడపడితే అక్కడ పడేయడంతో పర్యావరణానికి హాని కలిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ-వేస్ట్‌లో బంగారం, ప్లాటినం, ఇతర ముఖ్యమైన మూలకాలు ఉంటాయి. వీటిని సెకండరీ మెటీరియల్‌గా వాడుకోవడానికి రీసైకిల్ చేయవచ్చు. అంతేకాకుండా వీలైనన్ని ఎక్కువ విడిభాగాలను పునర్వినియోగించడం ద్వారా దాదాపు 10 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుపుకోవచ్చని మానిటర్ 2020 నివేదిక చెబుతోంది. తద్వారా పర్యావరణ నష్టాన్ని ఎంతోకొంత తగ్గించే అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పడేయడానికి ముందే వాటిని మీరే స్వయంగా విడదీసి, ఉపయోగపడే విడి భాగాలను వేరు చేయడం మంచిది.



Next Story