అందువల్లే స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు : విజయసాయిరెడ్డి

by  |
mp vijayasaireddy
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో అవతరించిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభలో బుధవారం వైసీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్‌ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటైజేషన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు ఇప్పటికి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. వాస్తవానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ 2002 నుంచి 2015 వరకు లాభాల్లో నడిచిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతే నష్టాల్లోకి వచ్చిందని తెలిపారు.

ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకునేందుకు స్టీల్‌ ప్లాంట్‌ పెద్ద ఎత్తున విస్తరణను చేపట్టింది. అందుకోసం పెద్ద మొత్తాలలో రుణాలను సేకరించింది. అదే సమయంలో అంతర్జాతీయంగా స్టీల్‌ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా నష్టాలపాలైంది. విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌కు సొంత ఇనుప ఖనిజం గనులు లేనందున ముడి ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయవలసి వస్తోంది. ఈ కారణాల వల్లే నష్టాలు ఏర్పడినట్లు వివరించారు. కేవలం కొన్ని సంవత్సరాల నష్టాలను సాకుగా చూపిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం సమంజసం కాదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed