- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందూరులో పేకాట రాజ్యం.. రహస్య స్థావరాల్లో లక్షల ఆటలు! అధికారుల నిఘా ఏది?
నిజామాబాద్ జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. ఓ రకంగా ఇందూరు జిల్లా పేకాటకు అడ్డాగా మారిందని పేకాట స్థావరాలపై తరచూ జరుగుతున్న దాడులను బట్టి తెలుస్తోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. ఓ రకంగా ఇందూరు జిల్లా పేకాటకు అడ్డాగా మారిందని పేకాట స్థావరాలపై తరచూ జరుగుతున్న దాడులను బట్టి తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వరకు అనధికారిక పేకాట క్లబ్బులు రహస్య స్థావరాల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఊరి బయట వ్యవసాయ క్షేత్రాల్లో, రహస్య ప్రదేశాల్లో రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తులు, అధికారుల అండతో క్లబ్బులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోనూ హోటల్ గదులను అద్దెకు తీసుకుని పేకాట కొనసాగిస్తున్నారు. కొంతమంది ఇళ్లలోనూ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో పేకాట ఆడుతున్న రెగ్యులర్ ఆటగాళ్లు హోటల్ గదులు అద్దెకు తీసుకొని పేకాటాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ శివారులోని ఓ ప్రముఖ హోటల్లో ప్రత్యేకంగా రూమ్‌లు అద్దెకు తీసుకొని ప్రతిరోజు రూములు మారుస్తూ పేకాటను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కమ్మర్ పల్లి బస్టాండ్ సమీపంలోనే గుట్టుగా సాగుతున్న పేకాట క్లబ్‌పై పోలీసులు రైడ్ చేసేంతవరకు అక్కడో పేకాట క్లబ్ ఉన్నట్టు, రూ. లక్షల్లో అక్కడ పేకాట ఆడుతున్నట్లు ఎవరికీ తెలియలేదు. అలాంటి అడ్డాలు జిల్లాలో రహస్యంగా చాలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్మూర్ ప్రాంతం లోని పేకాట క్లబ్బుపై పోలీసులు రైడ్ చేసినప్పుడు కొందరు ప్రముఖులు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు సమాచారం.
హైదరాబాద్‌లోని క్లబ్బుల మాదిరి!
జిల్లాలో కొనసాగుతున్న పేకాట క్లబ్బులకు ఇతర జిల్లాలు జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, బాన్సువాడ, నిర్మల్, నిజామాబాద్ తదితర పట్టణాల నుంచి పేకాట ఆడేందుకు కస్టమర్లు తరచూ వస్తారని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్ నగరంలోని క్లబ్బుల మాదిరిగా జిల్లాలో కూడా కాయిన్ కరెన్సీ తో ఆడే ఈ క్లబ్ లు కూడా ఉన్నట్లు కొంతమంది రెగ్యులర్ పేకాట రాయుళ్ల మాటలను బట్టి తెలుస్తోంది. ఆర్మూర్, నిజామాబాద్, డిచ్పల్లి, బోధన్ తదితర పట్టణాల శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో, ఫామ్ హౌస్ లలో రెగ్యులర్ పేకాట ఆడుతూ లక్షల్లో నష్టపోయిన రైతులు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు ఉన్నారని తెలుస్తోంది. జిల్లాలో ఓ యువకుడు ఆన్ లైన్ గేమ్ లకు బానిసై దాదాపు రూ. 40 లక్షల వరకు నష్టపోయి, ఇక లాభం లేదనుకొని అందిన కాడికి అప్పులు చేసి పేకాట వైపు దృష్టి సారించాడు. ఇక్కడ కూడా కథ అడ్డం తిరిగి పేకాటలో కూడా దాదాపు పది లక్షలు నష్టపోయాడు. జీవితంపై విరక్తి చెంది రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసి అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకు బతికుంటే చాలని వారికున్న భూమి ఆస్తులు అమ్మేసి కొడుకు చేసిన అప్పులను పేరెంట్స్ వడ్డీతో సహా తీర్చేశారు. ప్రస్తుతం కొడుకును బుజ్జగించి మంచి ప్యాకేజీ పై గల్ఫ్ దేశాలకు పంపించారు. భీంగల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు డబుల్ బెడ్ రూమ్ పోర్షన్ అద్దెకు తీసుకొని దర్జాగా పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో గేమ్ కు పేకాట రాయుళ్ల దగ్గర కమిషన్ బేస్ పై చార్జీలు వసూలు చేస్తూ నాలుగు ఐదేళ్లలో బాగానే డబ్బులు బాగానే కూడా పెట్టినట్లు తెలిసింది. మరోపక్క పేకాటలో ఉన్నదంతా పోగొట్టుకొని ఎకరం పొలం అమ్మేసి ఓ వ్యక్తి ముంబైలోని ఇండస్ట్రియల్ ఏరియాలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. పేకాట వ్యసనంతో నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి, చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారు. వ్యవసాయంలో, వ్యాపారంలో బాగా సంపాదిస్తున్న వ్యక్తులు పేకాటను ఫ్యాషన్ గా భావించి ఆడుతూ వేలకు వేలు పెట్టి గేమ్ ఆడుతున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. పోలీసు శాఖ పేకాటపై ఇటీవల కాలంలో ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తమకు అందుతున్న విశ్వసనీయ సమాచారంతో పేకాట స్థావరాలపై దాడులు జరుపుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, సీ సీ ఎస్ పోలీసులు కూడా ఇటీవల కాలంలో తరచూ దాడులు నిర్వహిస్తూ పేకాటరాయుళ్లకు దడ పుట్టిస్తున్నారు.
ప్రతివారం హైదరాబాద్‌కు..
జిల్లాలోనే పేకాట జోరుగా సాగుతున్నా, కొంతమంది రెండు చేతులతో బాగా సంపాదించే వ్యాపారులు, ప్రొఫెషనల్స్ నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి ప్రాంతం నుండి ప్రతి వారం వీకెండ్ లో హైదరాబాదులోని క్లబ్బులో పేకాట ఆడేందుకు వెళుతున్నారు. దాదాపు పది పదిహేను కార్లలో వెళ్తుండటం ఆనవాయితీగా మారిందని పలువురు చెబుతున్నారు. వీలు కుదరక ఒక వారం హైదరాబాద్ వెళ్లకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఉంటుందని చెప్పడాన్ని బట్టి చూస్తే పేకాటకు వారెంత అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ఆర్థికంగా స్థిరపడిన వారు, ప్రతి రోజూ రూ. లక్షల్లో సంపాదించే వారు కావడంతో పేకాటలో ఎన్ని నష్టపోయినా వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కానీ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకొని మరి ఆడుతున్నట్లు మహిళలు వాపోతున్నారు. ఊళ్లో, పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో పేకాట స్థావరాలపై రైడ్స్ నిత్యకృత్యమయ్యాయి. పేకాట స్థావరాలపై ఇన్ని దాడులు జరుగుతున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం అధికారికంగా పేకాటను నిషేధిస్తే చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నుండి కాపాడినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. గుట్కా, గంజాయి వంటి మాదకద్రవ్యాలను నిషేధించిన విధంగానే ప్రభుత్వం పేకాటపై కూడా నిషేధాన్ని విధిస్తే బాగుంటుందని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.






