- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృత్రిమ కొరత? సిలిండర్ కోసం ఎదురు చూపులు.. గ్రామాల్లో గ్యాస్ సరఫరా కష్టాలు
పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం యుద్ధం జరుగుతున్న దేశాల్లోనే కాకుండా భారత దేశంలో కనిపిస్తున్నట్లు, ముఖ్యంగా చమురు సంస్థలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత భయం మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం యుద్ధం జరుగుతున్న దేశాల్లోనే కాకుండా భారత్‌లో కనిపిస్తున్నట్లు, ముఖ్యంగా చమురు సంస్థలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వంటింటి కష్టాలు మొదలైనట్లేనని మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరో పక్క అధికారులు మాత్రం ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని చెబుతున్నారు. గ్యాస్ కొరత పేరుతో బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు హోటల్స్, రెస్టారెంట్లలో దొంగచాటుగా కమర్షియల్ సిలిండర్ల మాటున వాడుతున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఇప్పటివరకు గ్యాస్ కొరత లేని కారణంగా విచ్చలవిడిగా గ్యాస్ ఏజెన్సీలు అధిక ధరలకు కమర్షియల్ వినియోగదారులకు విచ్చల విడిగా గ్యాస్ సిలిండర్లు సప్లయ్ చేసేవారు. ఎల్పీజీతో నడిచే కారులో నింపుకునేందుకు కూడా వాహన చోదకులు గృహావసరాలకు వినియోగించే గ్యాస్ నే ఎక్కువగా వాడే వారు. భీమ్ గల్, ఆర్మూర్, సిరికొండ, నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డి, బాల్కొండ, డిచ్ పల్లి, నందిపేట్, నవీపేట్, బోధన్ వంటి పట్టణాలు, మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోనూ కారులో ఎల్పీజీ గ్యాస్ ను నింపే వ్యక్తులు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరితో పాటు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ హాస్టళ్లలో కూడా డొమెస్టిక్ సిలిండర్ల వాడకం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. వీరంతా గ్యాస్ ఏజెన్సీలతో కుమ్మక్కై వారి అక్రమ వ్యాపారానికి అవసరమైనన్ని గ్యాస్ సిలిండర్లను ఏజెన్సీల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసే సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా పరిస్థితి అంతా మారడంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హోటల్స్, టిఫిన్ సెంటర్లలో విజిలెన్స్ తనిఖీలు
గృహావసరాలకు వినియోగించే గ్యాస్ పక్కదోవ పట్టకుండా ఉండేందుకు అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా గృహావసరాలకు ఉపయోగించే గ్‌యాస్ సిలిండర్లను కమర్షియల్ కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ హల్ చల్ చేస్తున్నారు. అధికారులు హోటల్స్, టిఫిన్ సెంటర్లపైనే దృష్టి సారించారు తప్ప ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ పై తనిఖీల గురించి ఆలోచించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 500 సిలిండర్ రావట్లేదు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ చాలా మందికి రావడం లేదు. గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై గతంలో వచ్చిన సబ్సిడీ డబ్బులే వినియోగదారుడి ఖాతాలో జమవుతున్నాయని పలువురు వినియోగదారులంటున్నారు. ఈ రకంగా తాము సిలిండర్ బుక్ చేసిన ప్రతిసారి రూ. 400 లకు పైగా నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. తాజాగా సిలిండర్ పై రూ. 60 లు పెరగడంతో అది కూడా తమకు అదనపు భారమైందంటున్నారు మహిళలు. ప్రస్తుతం గ్యాస్ కొరత పేరు చెప్పి మా గ్రామాల్లోకి వారంలో రెండు సార్లు డోర్ డెలివరీకి వచ్చే గ్యాస్ సిలిండర్ల లోడ్ రావడం లేదని, అధికారులు చెపుతున్నట్లు గ్యాస్ సిలిండర్ల కొరత లేకపోతే ఏజెన్సీలు గ్యాస్ లోడ్ ఎందుకు తీసుకురావడం లేదని భీమ్ గల్, సిరికొండ, మోర్తాడ్, మోపాల్ తదితర మండలాలకు చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గ్యాస్ వినియోగం పెరిగింది..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. గ్యాస్ పై కేవలం వంట మాత్రమే కాకుండా స్నానానికి నీళ్లు వేడి చేయడం, అవసరానికి తగ్గట్లుగా గ్యాస్ ను పొదుపుగా వాడుకోక పోవడం వంటి కారణాల చేత గ్యాస్ వినియోగం పెరగడమే కాకుండా, వృధా కూడా అవుతున్నట్లు తెలుస్తోంది. వంటింటి మహిళలే గ్యాస్‌ను పొదుపుగా వాడుకునే ప్రయత్నాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
50కి పైగా గ్యాస్ ఏజెన్సీలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 వరకు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 8.20లక్షల మంది వినియోగదారులు అన్నారు. వీరిలో సింగిల్ కనెక్షన్, డబుల్ కనెక్షన్, దీపం, ఉజ్జ్వల, సీఎస్ఆర్, కమర్షియల్ కనెక్షన్ వినియోగదారులున్నారు. ఈ కనెక్షన్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.48 లక్షల మంది గృహ వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న మహాలక్ష్మి స్కీమ్ కు అర్హులు గా ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సగటున ఒక్కో వినియోగదారుడు ప్రతినెలా ఒక సిలిండర్ వాడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సిలిండర్ తీసుకోగానే పదిహేను రోజుల్లోపు మరో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 21 రోజులు దాటితే కానీ, మరో సిలిండర్ బుక్ చేసుకునే వీలు లేకుండా పోయింది. రెండు సిలిండర్లున్న వినియోగదారులైతే 30 రోజుల తర్వాత బుక్ చేసుకోవాల్సి వస్తోంది.






