- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి కోపంతో అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం! వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నాశనం. తమను ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన.

దిశ, మోర్తాడ్: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం ధాటికి బాల్కొండ నియోజకవర్గంలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. భూమాతను నమ్ముకుని సేద్యం చేసుకునే రైతన్నలు అకాల వర్షం కారణంగా భారీగా నష్టపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భీంగల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, వేల్పూర్ మండలాల్లో రైతులు పండిస్తున్న మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు పెద్ద మొత్తంలో నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. . నియోజకవర్గం లోని రైతులు 86,441ఎకరాల విస్తీర్ణంలో వరి, 14,581 ఎకరాల్లో మొక్కజొన్న, 4,650 ఎకరాల్లో పసుపు 16588 ఎకరాల్లో , నువ్వుల పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్న వరి పంట కోత దశకు వచ్చిన సమయంలోనే భారీగా ఈదురు గాలులు వీయడంతో చేతికొచ్చిన వరి ధాన్యం నేల రాలిపోవడంతో బాగా నష్టపోయమని ఆవేదన చెందుతున్నారు.
తడిసి పోయిన మొక్కజొన్న..
ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవకపోవడంతో మొక్కజొన్న పంట (మక్కలు) ను రోడ్లపైనా, , కల్లాల్లో ఎక్కడికక్కడే ఆరబోశారు. సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్లపైన, కల్లాల్లో రైతులు ఆరబోసిన మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షం, ఈదురు గాలులతో నష్టపోయిన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
నియోజకవర్గంలో రైతులు ప్రధాన పంటలైన పసుపు, మొక్కజొన్న,వరి పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది కూడా నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. మొక్కజొన్న పంట కోతలు, పంట నూర్పిడి, ఆరబోత పూర్తి చేసుకుని దాదాపు నెలరోజులుగా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల కోసం ఎదిరి చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షం భయంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,400 లు ప్రకటించినా, దళారులు మాత్రం రూ. 1800 లకు మించి చెల్లించడం లేడు. ఇప్పటికే చాలా మంది వర్షానికి భయపడి దళారులకు అమ్ముకుని నష్టపోగా, కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల కోసం చూస్తున్నారు.
తాజాగా కురిసిన వర్షం భయానికి మళ్లీ దళారులకే అమ్ముకోవాల్సి వచ్చేలా ఉందని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గంలోని బాల్కొండ, సావెల్ రెంజర్ల, వేంపల్లి తాళ్ల రాంపూర్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, కోనాసముందర్, చౌట్పల్లి, మోర్తాడ్, శెట్పల్లి, వేల్పూర్ పచ్చల నడుకుడ సొసైటీల ద్వారా మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో కల్లాల్లో ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎకరాల్లో నువ్వుల పంట వేశాను.. ఇంకా 15 రోజుల్లో కోతకు వస్తుంది. సోమవారం కురిసిన వర్షం కు పంట మొత్తం నేలకొరిగింది. సుమారు రూ. 1.50 లక్షల నష్టం జరిగింది. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి.- బాస దేవానందం రైతు, తొర్తి గ్రామం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, మక్కలను కల్లాలలో ఆరబోశాను. ఇలా అకాల వర్షం వస్తుందని ఊహించలేదు. మొక్కజొన్న ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. రంగు మారిన ధాన్యం కొంటారో కొనరోనని దిగులుగా ఉంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.- దేవదాస్, రైతు మోర్తాడ్
ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం
అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తాం. రైతులకు పంట నష్టపరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదికను పంపుతాం.-లావణ్య., ఏడిఏ. భీంగల్
వానా.. హైరానా
దిశ, నందిపేట: జిల్లాలో అకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్లు వానకాలం సీజన్ పంటలకు నష్టం చేకూర్చాయి. ఆర్మూర్, బాల్కొండ, నందిపేట్, ఆలూరు, మాక్లూర్, డొంకేశ్వర్ తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నేల వాలింది. కోతకొచ్చిన ధాన్యం గింజలు పంటచేలాలోనే రాలిపోయాయి. కల్లాలపై ఆరబోసిన ధాన్యం కుప్పలు అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అలాగే ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఉడకపెట్టి ఆరబెట్టిన పసుపు పంట తడిసిపోయింది.
మొక్కజొన్న, ఎర్ర జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. భారీ ఈదురు గాలులకు మామిడికాయ నేలరాలింది. వ్యవసాయ శాఖ యంత్రాంగం నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో తిరిగి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదే ప్రతికూల వాతావరణ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగుతుందని, వడగండ్లు కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్లాలపై ఆరబోసిన ధాన్యం, జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలను రాశులుగా పోసి తాడిపత్రిలో కప్పి ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డిలో జోరువాన
దిశ, కామారెడ్డి : కామారెడ్డి లో జోరు వాన కురిసింది. సోమవారం అర్ధరాత్రి కూడా వర్షం కురిసింది. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన జోరువాన కురిసింది. కాగా జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన విషయం విధితమే. జిల్లాలో 41-61 కిలోమీటర్ల గరిష్ట ఉపరితల గాలి వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. దీంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంటలు కోతలకు రాగా మరికొన్నిచోట్ల పొట్ట దశలో ఉండగా ఇంకొన్ని ప్రాంతాల్లో వరి గెలలు వంగుతున్నాయి. అయితే ఈదురుగాలులు వీస్తే వరి పంటలతో పాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేల వాలే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వణుకు పుట్టించిన ఉరుములు..
దిశ, తాడ్వాయి : తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా చల్లబడ్డాడు..ఉదయం పది గంటలకే సెగలు కక్కుతూ, జనాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండలు మంగళవారం తెల్లవారు జాము నుంచే మాయమయ్యాయి. తాడ్వాయి మండలంలో ప్రకృతి ఒక్కసారిగా తన రంగు మార్చుకుంది. నిన్నటి వరకు వరకు మండిపోయిన ఆకాశం,ఉదయం అయ్యేసరికి ఉగ్రరూపం దాల్చింది.ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొచ్చాయి. భీకరమైన ఉరుముల శబ్దాలకు తాడ్వాయి మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వెన్నులో వణుకు పుట్టించేలా మెరుపులు మెరుస్తుంటే, అకాల వర్షం ఊహించని రీతిలో విరుచుకుపడింది.రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు,పొలాల్లో ఉన్న రైతులు ఈ అకస్మాత్తు పరిణామానికి షాక్ తిన్నారు. మే నెల ఎండలు ఇప్పుడే చూస్తున్నాం అనుకుంటే...ఈ వానలేంటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు.ఇదేమి కాలం.. ఇదేమి వింత?అంటూ వృద్ధులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కాలచక్రం తలకిందులైందా అన్నట్లుగా వాతావరణం మారుతుండడం పై మండల కేంద్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఉరుములు.. మెరుపులతో వర్షం
దిశ, సదాశివ నగర్ : నిన్నటిదాకా నిప్పులు కురిపించిన భానుడు మంగళవారం తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. జనాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండలు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా చల్లబడ్డాయి. మండలంలో నిన్నటి వరకు మండిపోయిన ఆకాశం, ఉదయం అయ్యే సరికి ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొచ్చాయి. మెరుపులు మెరుస్తుంటే, వర్షం ఊహించని రీతిలో పడింది. కాలచక్రం తలకిందు అయిందా అన్నట్లుగా వాతావరణం మారుతుండడంపై మండల కేంద్రంలో చర్చ నడుస్తోంది. వర్షం సామాన్యులకు ఉపశమనం కలిగించిన, రైతన్న గుండెల్లో మాత్రం రైలు పరిగెత్తించింది. చేతికి వచ్చిన పంటలు నాశనం అవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.






