- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భానుడి భగభగలు.. జగిత్యాల జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి
భానుడి భగభగలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి : భానుడి భగభగలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ కొడుతుంటే మిట్ట మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిలా మారుతుంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎండ తీవ్రతతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతుండగా, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హీట్‌వేవ్ పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తలు సూచిస్తున్నప్పటికీ, అత్యవసర అవసరాల కోసం బయటకు వెళ్లిన పలువురు వడదెబ్బకు గురవుతున్నారు.
పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు
జిల్లాలో గత వారం రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన కట్కూరి జమున (39) శుక్రవారం సాయంత్రం తీవ్రమైన వడదెబ్బకు గురై మృతి చెందగా, కోరుట్ల రూరల్ మండలం చిన్న మెట్టుపల్లి గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ (50) గురువారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై చికిత్స అందక ముందే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన డిష్ టీవీ ఆపరేటర్ జుంబర్తి రాజు (32) ఈనెల 16న గొల్లపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎండ దెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలగా, 108 సిబ్బంది పరిశీలించి అతను తీవ్ర వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
జగిత్యాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భానుడు
జగిత్యాల జిల్లాలో గత పది రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, శనివారం ఏకంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హెచ్చరిస్తూ జిల్లాలో హీట్‌వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయితే సాయంత్రం 5 గంటల సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గకపోవడం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా.ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తీవ్ర ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ, టోపీ ధరించాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదు. వడదెబ్బ లక్షణాలైన తలనొప్పి, వాంతులు, అధిక చెమటలు, అలసట కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలి’ అని సూచించారు.






