కుంటలో రోడ్డు.. బఫర్ జోన్‌లో ప్లాట్లు.. ఇదీ ప్రైవేట్ వెంచర్ తీరు!

by Ramesh Naini |

ప్రైవేట్ వ్యక్తులు చేసే రియల్ దందాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అలవాటుగా మారింది.

కుంటలో రోడ్డు.. బఫర్ జోన్‌లో ప్లాట్లు.. ఇదీ ప్రైవేట్ వెంచర్ తీరు!
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రైవేట్ వ్యక్తులు చేసే రియల్ దందాలో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అలవాటుగా మారింది. హైదరాబాదుకు సమీపంలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లలు చెరువులు, కుంటల భూమి లేదా ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించకుండా ఉన్న వెంచర్లు లేవని చెప్పొచ్చు. అందులో భాగంగానే మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో కూడా వెంచర్ ఏర్పాటుతోపాటు రోడ్డు కోసం కూడా కుంట భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చింది.

యెల్ల మల్లయ్య కుంటలో రోడ్డు నిర్మాణం...

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో శ్రీ రక్షిత వెంచర్ ను 141, 144, 170 ,171, 172, 175, 184,185 సర్వే నెంబర్లలో ఏర్పాటు చేశారు. అయితే ఈ వెంచర్ లోకి వెళ్లడానికి 141 సర్వే నెంబర్ లో ఉన్న యెల్ల మల్లయ్య కుంట ప్రభుత్వ భూమి నుంచి సుమారు 30 ఫీట్ల వెడల్పుతో దాదాపు 300 మీటర్ల పొడవు రోడ్డు నిర్మాణం చేశారు. అక్కడ రోడ్డు కోసం దాదాపు 20 గుంటల భూమి ఆక్రమణ జరిగినట్లు స్థానికులు ఆరోపించారు. దీంతో పాటుగా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 175 సర్వే నెంబర్ లో ఉన్న వాయిళ్ల కుంట లో ఎఫ్టీఎల్ పరిధిలో కూడా ఫామ్ ల్యాండ్ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రియల్ వ్యాపారి ఆక్రమించిన మొత్తం భూమి సుమారు ఎకరం వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఆ భూమి విలువ ప్రస్తుతం కోటి రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తుంది.

పత్తా లేని 10 శాతం భూమి..?

వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ, రేరా ప్రభుత్వం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ తోపాటు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉండాలి. అసలు ఉండాలంటే ఏ గ్రామపంచాయతీలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నామో ఆ గ్రామ పంచాయతీకి వెంచర్ ఏర్పాటు చేస్తున్న భూమిలో 10 శాతం భూమిని గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి. అలా రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో పిల్లల కోసం పార్క్, వాటర్ ట్యాంక్, ఉమ్మడి అవసరాల కోసం మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే శ్రీ రక్షిత వెంచర్‌లో దాదాపు పది ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వెంచర్ లో 10 శాతం భూమి అంటే ఒక ఎకరం భూమి వరకు గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా కాకుండా భూమిలో కూడా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా మిగులుచుకున్న ఒక ఎకరం భూమి విలువ దాదాపు రూ . కోటి వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే కుంట భూమిని రోడ్డుగా చేస్తూ ఆక్రమించిన భూమి, ఎఫ్టీఎల్ పామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్ల నిర్మాణం, గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా మిగిల్చుకున్న భూమి విలువ మరో ఎకరం.. అంటే అంటే రూ.2. కోట్ల విలువైన భూమిని రియల్ వ్యాపారి అక్రమంగా ఆక్రమించినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ పేరు చెప్పి బెదిరింపులు..?

‘‘నేను అధికార పార్టీ ప్రముఖ నేతకు సోదరుడిని.. వెంచర్ ఏర్పాటు చేయాలంటే నిబంధనలు ఏమి ఉండాలో నాకు తెలుసు.. మీ సొంత భూమిని ఏదైనా ఆక్రమిస్తున్నానా.. మీకెందుకు బాధ.. ఏం జరిగినా నేను చూసుకుంటానులే..’’ ఆక్రమించిన భూమికి సంబంధించిన విషయంపై రియల్ వ్యాపారిని ప్రశ్నించిన గ్రామస్తులపై అధికార పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. వెంచర్ ఏర్పాటు విషయంపై కనీసం ఇప్పటివరకు గ్రామపంచాయతీలో కూడా చిన్న దరఖాస్తు కూడా పెట్టుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన వెంచర్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story