- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెలకు పాకిన ఫామ్ హౌజ్ కల్చర్.. వీకెండ్ పార్టీలతో దద్దరిల్లుతున్న రిసార్ట్స్
ఒకప్పుడు మహానగరాలకు మాత్రమే పరిమితమైన రిసార్ట్ కల్చర్ ఇప్పుడు జగిత్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది.

దిశ, జగిత్యాల రూరల్ / కొడిమ్యాల: ఒకప్పుడు మహానగరాలకు మాత్రమే పరిమితమైన రిసార్ట్ కల్చర్ ఇప్పుడు జగిత్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది. సేదతీరేందుకు నిర్మించబడిన ఫామ్ హౌస్‌లు క్రమంగా వినోదం పేరుతో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. కొడిమ్యాల, జగిత్యాల, గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లు వేగంగా పెరుగుతూ నామమాత్రపు గ్రామ పంచాయతీ పన్నులు చెల్లిస్తూ వేలల్లో ఆదాయం ఆర్జిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నిర్వాహకులు నియమాలను విస్మరిస్తూ వ్యాపారాలను విస్తరిస్తున్నారు.
వీకెండ్ పార్టీలు.. లిక్కర్ దావత్‌లు..
వీకెండ్‌లు రాగానే ఈ రిసార్ట్స్‌లో డీజే సౌండ్స్, లిక్కర్ పార్టీలతో వాతావరణం మారిపోతుంది. వినోదం కోసం వచ్చే యువత అధిక ఖర్చులకు వెనుకాడకపోవడం వల్ల నిర్వాహకులు భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా, ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండానే వెజ్, నాన్ వెజ్ బఫేలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. మేము పెట్టిందే రేట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న కొందరు రిసార్ట్ ల యజమానులైతే అందుకు తగ్గట్టుగా ప్రాపర్టీ టాక్స్ కట్టకుండా ఆయా జీపీల కార్యదర్శులను మేనేజ్ చేసుకుంటూ వ్యవహారం చక్కబెట్టుకుంటునే ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లాలోని కొన్ని రిసార్ట్స్ లక్షల్లో ఆదాయం పొందుతున్నప్పటికీ జీఎస్టీ నమోదు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియంత్రణ సంస్థలు గట్టిగా స్పందించకపోతే ఈ ధోరణి మరింత విస్తరించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నో సేఫ్టీ.. అంతా మా ఇష్టం..
కొన్ని ఫామ్ హౌస్‌లు, రిసార్ట్స్‌లో అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమాత్రం పాటించడం లేదు. జిల్లాలోని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్న ఓ రిసార్ట్‌లో అయితే కనీసం ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనుమతులు కూడా లేనట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున జనాలు వచ్చి పోయే రిసార్ట్‌లో అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సెలబ్రిటీ రిసార్ట్‌గా గుర్తింపు పొందిన ఇందులో చాలామంది రాజకీయ ప్రముఖులతో పాటు పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రభుత్వాధికారులు వచ్చి పోవడం చాలా కామన్. ఇక లిక్కర్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రిసార్ట్‌కు వచ్చే యువత చాలామంది స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అనేకం ఉన్నాయి.
ఫుడ్ సేఫ్టీ, ఎక్సైజ్ అధికారులకు తెలియదా??
ఫుడ్ సేఫ్టీ, ఎక్సైజ్ అధికారులకు ఈ వ్యవహారాలు తెలియవా అన్న ప్రశ్నలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా బఫేలు నిర్వహించడం, లిక్కర్ వినియోగం జోరుగా సాగడం వంటి అంశాలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు స్పందించట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ లోపమా, లేక నిర్లక్ష్యమా లేక సంబంధిత వ్యక్తులతో ఉన్న వ్యక్తిగత పరిచయమా అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ అక్రమాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






