- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల పేరిట ‘పైసా వసూల్’.. కామారెడ్డిలో కలకలం రేపుతున్న వసూళ్ల దందా!
గృహప్రవేశాలు చేసుకున్న కొందరు లబ్ధిదారులు మొదట ఏమీ ఇవ్వకపోవడంతో, తక్కువలో తక్కువ దావత్ చేసుకునేందుకు అయినా ఎంతో కొంత ముట్ట జెప్పాలని కొందరు చివరి మాటగా అడుగుతుండడంతో మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు లబ్ధిదారులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, భిక్కనూరు : పేదలకు అందించే పథకాలు కొంత మంది నేతలకు బాగా కలిసొచ్చింది. స్థానిక నాయకత్వానికి, అధికారులకు దగ్గర ఉంటూ అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాల్లో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ముడుపులు ముట్టజెప్పిన వారంతా ఇన్నాళ్లు తమ మనసులో దాచుకున్న విషయాన్ని ప్రస్తుతం ఒక్కొక్కరుగా బయటికి చెబుతున్నారు. ఇక మౌనంగా ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందనే భావన బాధితుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో, ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు కట్టుకునేందుకు ముందుకు వస్తుండగా.. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునే విధంగా అధికార పార్టీకి చెందిన కొందరు బ్రోకర్లుగా మారారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల నుంచి లంచం రూపంలో తీసుకోవద్దని సమావేశాలలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పినా.. వారి మాటలు డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ సీక్రెట్ గా లబ్ధిదారుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది.
తక్కువలో తక్కువ దావత్ అన్నా..!
మొదటి విడతతో పాటు, రెండో విడత కూడా ఇండ్లు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇల్లు మంజూరు చేయించి అన్నీ నేను చూసుకుంటానంటూ భరోసానిస్తూ డబ్బులు కూడా మాట్లాడుకుంటూ అడ్వాన్స్ గా కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఉచితంగా రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి వస్తున్నాయనే అన్న భావనతో కొందరు నాయకులు కార్యకర్తలు, పొట్ట తిప్పలంటూ బ్రోకర్లుగా మారి ఒక్కో లబ్ధిదారుడి నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ప్రచారం గ్రామాల్లో జరుగుతోంది. అయితే ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మూడు నాలుగు విడతల్లో డబ్బులు పడుతుండడంతో బ్రోకర్లు డబ్బులు అడిగే విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా ఈ విషయం బయట తెలిస్తే ఎక్కడ డబ్బులు ఆగిపోతాయో నన్న భయంతో గప్ చుప్‌గా వారు ఉండిపోతున్నారు. గృహప్రవేశాలు చేసుకున్న కొందరు లబ్ధిదారులు మొదట ఏమీ ఇవ్వకపోవడంతో, తక్కువలో తక్కువ దావత్ చేసుకునేందుకు అయినా ఎంతో కొంత ముట్ట జెప్పాలని కొందరు చివరి మాటగా అడుగుతుండడంతో మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు లబ్ధిదారులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ తరహా వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలు.. డబ్బులు ఎవరికి ఇవ్వొద్దు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కొందరు డబ్బులు అడుగుతున్నారన్న విషయం తెలియడంతో భిక్కనూరు మండలం కాచాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బంజర్ల నర్సింగ్ రావు 10 రోజుల క్రితం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. నిలువ నీడ లేని నిరుపేదల నుంచి డబ్బులు ఎవరైనా వసూల్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు.
ప్రతిపక్ష నేతల చేతుల్లో వసూళ్ల చిట్టా..
లబ్ధిదారుల నుంచి కొందరు నేతలు వసూల్ చేస్తున్న డబ్బులకు సంబంధించిన చిట్టాను ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు పూర్తి ఆధారాలతో సేకరించే పనిలో ఉన్నారు. ఎవరెవరు లబ్ధిదారుల నుంచి ఎంత వసూలు చేస్తున్నారన్న విషయాలను సీక్రెట్‌గా సేకరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఆ చిట్టాను బయటపెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.






