- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింఛన్ల కోసం ముప్పుతిప్పలు.. ఎండలో ‘ముసలోళ్ల’ పడిగాపులు..
ధన్వాడలో పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా పింఛన్ డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎండను లెక్కచేయకుండా ప్రతిరోజూ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు.

ధన్వాడలో పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా పింఛన్ డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎండను లెక్కచేయకుండా ప్రతిరోజూ పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా లబ్ధిదారులు రోడ్డుపై బైఠాయించారు. ‘బ్యాంకుల్లో డబ్బుల్లేవు’ అని అధికారులు చెబుతున్నారే తప్పా ప్రత్యామ్నాయం చూపడం లేదు. ఓట్లు వేయించుకున్న నాయకులు తమను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నచ్చజెప్పినా సమస్య తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ డబ్బులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దిశ, ధన్వాడ : ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా 10 నుంచి 15 రోజులుగా ధన్వాడ మండల కేంద్రంలో పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నరకం అనుభవిస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయక, పింఛన్ డబ్బుల కోసం తిరుగుతున్నారు. ‘అప్పుడు ఇస్తారు.. ఇప్పుడు ఇస్తారు’ అంటూ అధికారులు చెబుతున్న మాటలు నమ్మి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రతి నెల అందించే పింఛన్ డబ్బులు ఈసారి పది రోజులు దాటిపోయినా అందకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి విసుగు చెందిన లబ్ధిదారులు ప్రతిరోజు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేస్తున్నా, పాలకులు, అధికారుల్లో చలనం రావడం లేదని వాపోతున్నారు.
మా తిప్పలు చూడండయ్యా!
‘అయ్యా మేము కుంటోళ్లం.. రోజు రావడానికి కష్టంగా ఉంది,’ అని కొందరు, ‘అయ్యా మేము గుడ్డోళ్లం, కళ్లు కనిపించవు, రోజు రావాలంటే కష్టం,’ అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అయ్యా మేము ముసలోళ్లం.. మొదలే ఎండాకాలం, తాళలేక పోతున్నాం, రోజు రావాలంటే చేతకాదు,’ అంటూ ప్రతిరోజు ధన్వాడ పోస్ట్ ఆఫీస్ వద్ద కనిపిస్తున్న దృశ్యాలు అనేకం. కనీసం ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ వీరి సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తిండి తిప్పలు వదిలి ఉదయం 8 గంటలకే పోస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చి గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు.
బ్యాంకుల్లో డబ్బుల కొరత సాకు..!
బ్యాంకుల్లో డబ్బుల కొరత ఉందంటూ అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు కానీ, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. రోజూ రావడం, తీరా డబ్బులు ఇవ్వకపోవడంతో విసుగు చెందిన లబ్ధిదారులు రోడ్డుపై బైఠాయింపు జరుపుతున్నారు. పోలీసులు వచ్చి ఏదో విధంగా నచ్చజెప్పి ఆందోళన విరమింప చేస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు. మంగళవారం సైతం పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో గంటల తరబడిగా పోస్ట్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాశారు. ఒక దశలో ఓపిక నశించిన లబ్ధిదారులు, ‘ఓట్ల కొస్తారు.. తీరా ఓట్లు వేసుకొని మా సమస్యను పట్టించుకోని నాయకులు ఎందుకు?’ అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి, పింఛన్ డబ్బులు త్వరగా అందజేయాలని కోరుతున్నారు.






