ఉప్పునుంతలలో చెరువుల కబ్జా.. శిఖం భూములపై అక్రమ కట్టలు!

by Ramesh Naini |

ఉప్పునుంతల మండలంలో చెరువుల శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయి. పక్క పొలాల రైతులు తమ స్వలాభం కోసం చెరువుల్లోనే అక్రమంగా చేపల చెరువులు నిర్మిస్తున్నారు. మామిళ్లపల్లి ఊర చెరువులో సుమారు మూడు ఎకరాల శిఖం భూమి ఆక్రమణకు గురైంది.

ఉప్పునుంతలలో చెరువుల కబ్జా.. శిఖం భూములపై అక్రమ కట్టలు!
X

ఉప్పునుంతల మండలంలో చెరువుల శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయి. పక్క పొలాల రైతులు తమ స్వలాభం కోసం చెరువుల్లోనే అక్రమంగా చేపల చెరువులు నిర్మిస్తున్నారు. మామిళ్లపల్లి ఊర చెరువులో సుమారు మూడు ఎకరాల శిఖం భూమి ఆక్రమణకు గురైంది. మర్రిపల్లిలోని తెట్టకుంట చెరువులో కూడా చేపల చెరువు నిర్మాణం పూర్తయింది. మండల కేంద్రంలోని పోలాన్ చెరువులో కూడా కబ్జా పనులు కొనసాగుతున్నాయి. చెరువుల్లో అక్రమంగా కట్టలు ఏర్పాటు చేయడం వల్ల చెరువుల్లో నీటి సామర్థ్యం తగ్గి, కట్టలు తెగే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు వాపోతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, భవిష్యత్తులో నీటి కొరత వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

దిశ, ఉప్పునుంతల : గ్రామాల్లోని చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. చెరువుల ఉనికిని కాపాడాల్సిన శిఖం భూముల రూపురేఖలను పక్క పొలాలు రైతులు తమ స్వలాభం కోసం మార్చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో చెరువుల్లోనే అక్రమంగా చేపల చెరువులను నిర్మిస్తూ పెద్ద పెద్ద కట్టలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చెరువుల ఆయకట్టు విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ‘మిషన్ కాకతీయ’ వంటి పథకాలతో చెరువుల సామర్థ్యాన్ని పెంచి రైతులకు మేలు చేయాలని చూస్తే, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల చెరువులు ప్రమాదంలో పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో శిఖం భూములను కబ్జా చేసి బహిరంగంగా అమ్మకాలు, కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మామిళ్లపల్లి, మర్రిపల్లిలో నిర్మాణాలు పూర్తి..

మామిళ్లపల్లి గ్రామంలోని ఊరచెరువు సుమారు 154 ఎకరాల ఆయకట్టుతో రైతులకు సాగునీరు అందిస్తోంది. అయితే, చెరువు పక్కన ఉన్న ఒక రైతు సుమారు మూడు ఎకరాల శిఖం భూమిలో చేపల చెరువు తవ్వి, చుట్టూ పెద్ద పెద్ద కట్టలను ఏర్పాటు చేసుకున్నట్లు కన్పిస్తోంది. దీనివల్ల చెరువులో నీటి నిల్వ తగ్గిపోవడమే కాకుండా వర్షాకాలంలో చెరువు కట్టపై ఒత్తిడి పెరిగి కట్ట తెగే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్ట తెగితే కింద ఉన్న పంట పొలాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. గ్రామానికి సమీపంలోనే పెద్ద పెద్ద యంత్రాలతో ఈ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, 35 ఎకరాల ఆయకట్టు ఉన్న మర్రిపల్లి గ్రామంలో కూడా ‘తెట్టకుంట’ చెరువులోనే అక్రమంగా చేపల చెరువు నిర్మాణం పూర్తి చేశారు.

ఉప్పునుంతలలో కొనసాగుతున్న పనులు

మండల కేంద్రమైన ఉప్పునుంతలలో ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో ఉన్న ‘పోలాన్ చెరువు’లో కూడా చేపల చెరువు కోసం పనులు చేపట్టారు. ఈ చెరువు మొత్తం ఆయకట్టు 36 ఎకరాలు కాగా, ఇందులో సుమారు 20 ఎకరాల వరకు శిఖం భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువుల సామర్థ్యం తగ్గి, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ కట్టలను తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చెరువులను పూర్వపు స్థితికి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎలాంటి అనుమతులు లేవు, హెచ్చరించాం

‘చెరువుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా చేపల పెంపకానికి కట్టలు ఏర్పాటు చేయడం వాస్తవమే. చెరువుల రూపురేఖలు మార్చడం చట్ట విరుద్ధం. వారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాము. ఉప్పునుంతల పోలోని చెరువు పనులు నిలిపి వేయించాం. నిబంధనలకు విరుద్ధంగా కట్టలు ఏర్పాటు చేసిన వారికి నోటీసులు జారీ చేస్తాం. వారు స్వచ్ఛందంగా తొలగించకపోతే పోలీసుల సహాయంతో కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఉప్పునుంతల ఇరిగేషన్ ఏఈ అలివేలమ్మ హెచ్చరించారు.

Next Story