- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పేరుతో కూలిన ఆశలు! కేసముద్రంలో కుటుంబాల కన్నీటి గాథ
మానుకోట జిల్లా కేసముద్రం పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు కొందరి జీవితాలను రోడ్డునపడేశాయి.

దిశ, కేసముద్రం: మానుకోట జిల్లా కేసముద్రం (Kesamudram) పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు కొందరి జీవితాలను రోడ్డునపడేశాయి. పట్టణంలో 80 అడుగుల రహదారి విస్తరణ పనులతో అనేక ఇళ్లు, దుకాణాలు కూల్చివేతకు గురవుతున్నాయి. వందలాది కుటుంబాలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ మార్కెట్ సమీపంలో సుమారు 70 మంది, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద మరో 20 మంది జీవనాధారం కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్నారు. రోడ్ల విస్తరణ కోసం చెట్లు తొలగించడం, ఇళ్లను పాక్షికంగా కూల్చివేయడం జరిగినప్పటికీ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు. పలుచోట్ల డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండగా, మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. కంకర రోడ్డుతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల మరమ్మతులు, నిర్మాణ పనుల కోసం మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్ పెరగడంతో ఖర్చులు కూడా అధికమయ్యాయి. కొందరు బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా, మరికొందరు స్వచ్ఛందంగా తమ ఇళ్లను తొలగించుకున్నారు. ప్రత్యామ్నాయ పునరావాసం లేదా ఉపాధి కల్పించకుండా ప్రభుత్వ స్థలాల్లో జీవనం సాగిస్తున్న వారిని తొలగించడంతో పట్టణ అభివృద్ధి పనులు ప్రజలకు భారంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసి బాధితులకు పరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
కిరాణా దుకాణం పోయింది..
‘‘రోడ్డు విస్తరణ పనులతో మా కిరాణా దుకాణం తొలగించారు. జీవనోపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టంగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి మరో చోట దుకాణాన్ని తిరిగి ప్రారంభించాను. షెల్టర్ ఏర్పాటు చేయడం, దుకాణ సామగ్రిని తరలించడం, మళ్లీ వ్యాపారం ప్రారంభించడంతో ఆర్థిక భారం ఏర్పడింది. ప్రస్తుతం అప్పులతో పాటు కుటుంబ పోషణ కష్టంగా మారింది. అధికారులు పరిహారం లేదా పునరావాసం కల్పించి ఆదుకోవాలి.’’
–బాధితుడు నల్లగొండ ప్రశాంత్






