లక్షలు ఖర్చుపెట్టి తుస్సుమనిపించారు.. ఓరుగల్లులో దసరా డల్

by  |
లక్షలు ఖర్చుపెట్టి తుస్సుమనిపించారు.. ఓరుగల్లులో దసరా డల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి యేటా వరంగల్ లోని ఉర్సు రంగలీల మైదానంలో రావణాసుర వధ నిర్వహిస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా ఉత్సవాల్లో కొంత సందడి తగ్గినా.. ఈ ఏడాది భారీగా ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో రంగలీల మైదానాన్ని అంగరంగవైభవంగా ముస్తాబు చేశారు. లక్షలు ఖర్చు చేసి కళాకారుల నృత్యాలు, లేజర్ లైటింగ్, భారీ మైక్ సెట్లు, బాణసంచా, రావణాసుర వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉత్సవాలను తిలకించేందుకు వరంగల్ నగరవాసులంతా రంగలీల మైదానానికి విచ్చేశారు. ఎన్నో ఊహల మధ్య వచ్చిన వారికి అప్పుడే అయిపోయిందా అన్న నిరాశ ఎదురైంది. ప్రతిసారి రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకూ సాగే ఉత్సవం, ఈ సారి రాత్రి 8.30 గంటల వరకే పూర్తయ్యింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివిధ చోట్ల ఉత్సవాల్లో హాజరు కావాల్సి ఉందని అందుకే వెంట వెంటనే పూర్తి చేస్తున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెప్పుకొచ్చారు.

మేయర్ ప్రసంగం అక్కర్లేదా?

వరంగల్ మహానగర పాలకసంస్థ మేయర్ గుండు సుధారాణికి చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ లోనే అతిపెద్ద ఉత్సవం జరుగుతున్న వేళ.. నగరానికి ప్రథమ పౌరురాలు అయినప్పటికి ప్రసంగానికి అవకాశం ఇవ్వలేదు. ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి మాట్లాడాలని తెలిపారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడి రావాణాసుర వధ కార్యక్రమాన్ని కానిచ్చేశారు. దీంతో మేయర్ ప్రసంగం లేకుండానే ఉత్సవం అయిపోయింది. సద్దుల బతుకమ్మ సమయంలోనూ ఎమ్మెల్యే నరేందర్ దంపతులు వచ్చి వెళ్లాకే మేయర్ గ్రౌండ్ కి రావడం గమనార్హం.

ఉత్సవాన్ని మరింత సమయం చేస్తే బాగుండేది..

కరోనా కారణంగా గతేడాది ఉత్సవాన్ని చూడని చాలా మంది ఎన్నో ఆశలతో ఈసారి రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఏటా వచ్చే విధంగానే ప్రజలంతా రాత్రి 8 గంటలకు మైదానానికి వచ్చారు. దీంతో అప్పటికే రావాణాసుర దహనం మొదలుకావడంతో ప్రజలంతా నిరాశ చెందారు. లక్షలు ఖర్చు చేశామని చెప్పారు.. అప్పుడే అయిపోయింది అంటున్నారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాకారుల నృత్యాలు కూడా అంతంత మాత్రంగానే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల వరకు అయినా కార్యక్రమం జరిగితే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. మంత్రులు వేరే చోట పాల్గొనడానికి ఇంత పెద్ద ఉత్సవాన్ని ఇలా తూతూమంత్రంగా చేస్తారా అని నగరవాసులంతా మండి పడ్డారు.


Next Story

Most Viewed