కేసీఆర్ గారు మా తమ్ముడికి దారి చూపండి..

by  |
కేసీఆర్ గారు మా తమ్ముడికి దారి చూపండి..
X

దిశ, అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. ఈ క్రమంలోనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు సేకరణకు శ్రీకారం చుట్టింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని వంగూరు మండల పరిధిలోని డిండి చింతపల్లి గ్రామంలో రైతుల నుంచి వ్యవసాయ భూములను డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ నిర్మాణం కోసం 2017లో తీసుకుంది. అయితే, బాధితులకు పరిహారం చెల్లించలేదు. దీంతో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి ఘటనే నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో వెలుగుచూసింది. తుమ్మల బుచ్చిరెడ్డి భార్య తుమ్మల రజిత పేరున ఉన్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి కాలువ నిర్మాణం కింద పోయింది. అయితే, బాధిత రైతు కుటుంబానికి నష్టపరిహారంగా నయాపైసా ఇవ్వలేదు. వాటి కోసం ఎదురుచూస్తూ తుమ్మల రజిత అనారోగ్యంతో పాలై శుక్రవారం మృతి చెందినట్టు మృతురాలి కొడుకు ప్రశాంత్ రెడ్డి, ప్రగతి ఆవేదన వ్యక్తం చేశారు.

డిండి తెచ్చిన తంటా..

డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో మూడున్నర ఎకరాల భూమి కోల్పోయిన బాధితుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని తుమ్మల బుచ్చిరెడ్డి 2014లో మృతి చెందగా 2017లో డీఎల్‌ఐ కాలువ నిర్మాణంలో భాగంగా మూడున్నర ఎకరాల భూమి పూర్తిగా కోల్పోయామని, ప్రభుత్వం ఎకరాకు రూ.5.5 లక్షలు చెల్లిస్తామని చెప్పి కాలయాపన చేసిందని బాధితుడు ప్రశాంత్ రెడ్డి వెల్లడించాడు. భూముల పైసలు వస్తాయి కదా అని అప్పు చేసి మరీ అక్క ప్రగతి వివాహం చేశామని, నష్టపరిహారం రాకపోవడంతో మా అమ్మ తుమ్మల రజిత మానసిక వేదనకు గురై అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించిందని తెలిపారు. ఊర్లో ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదని, బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలస వెళ్దామని అనుకున్నట్టు తెలిపాడు. అయితే, చనిపోయిన మా అమ్మ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో తెలీక డీఎల్‌ఐ కాలువ పక్కన టెంట్ వేసుకుని అక్కడే మా అమ్మ అంత్యక్రియలు పూర్తి చేశామన్నాడు. ఉండనికి ఇల్లు లేకపోవడంతో తల్లి దశదినకర్మ పూర్తయ్యే వరకు కాలువ గట్టు పై టెంటు కిందనే గడపాల్సి వస్తుందని వాపోయాడు ప్రశాంత్ రెడ్డి.

మా తమ్ముడికి దారి చూపండి..

అయ్యా ముఖ్యమంత్రి గారు.. మా తమ్ముడికి దారి చూపండి. మాకు ఉన్న కాస్త భూమి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ కింద కోల్పోయామని, మానసిక వేదనకు గురై తల్లి మరణించిందని.. తమ్ముడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మీరు అందరికీ మంచి చేసిండ్రు మాకు మాత్రం మంచి జరగలేదు. మా తమ్ముడు ప్రశాంత్ రెడ్డికి న్యాయం జరిగేలా చూడాలని రోధిస్తూ ప్రగతి ముఖ్యమంత్రిని వేడుకుంది. ప్రస్తుతం మార్కెట్లో భూమి విలువ ఎకరాకు సుమారు ముప్పై నుంచి నలభై లక్షలు పలుకుతుందని, కావున మాకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది.

ఆనాడు సర్పంచ్ మాట విని..

2017లో అప్పటి సర్పంచ్ కరుణాకర్ రెడ్డి మాట విని మా అమ్మ తుమ్మల రజిత డీఎల్‌ఐ కాలువ నిర్మాణం కోసం తమకున్న భూమిని ప్రభుత్వానికి అప్పగించిందని మృతురాలి కొడుకు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గత 6 నెలల కిందట కల్వకుర్తి ఆర్డీవో మరియు స్థానిక వంగూరు తహశీల్దార్ కోల్పోయిన భూములకు నష్ట పరిహారం ఇస్తామని డాక్యుమెంట్లు తీసుకున్నారని,15 రోజుల్లో నష్ట పరిహారం అందుతుందని అధికారులు చెప్పారని కానీ, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తగిన న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు.


Next Story

Most Viewed