ఇప్పుటికైతే గింతే.. లోపాలతోనే ‘ధరణి’

82

దిశ, తెలంగాణ బ్యూరో :

‘ధరణి’ పోర్టల్ దసరాకు ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించనున్నారు. భూమి హక్కులకు పవిత్ర గ్రంథంగా తీర్చిదిద్దిన ఈ పోర్టల్ పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అవగాహన కల్పించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, పౌతి, భాగస్వామ్య పంపిణీ వంటి ప్రక్రియలు ఏ విధంగా చేపట్టాలో వివరించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ధరణి రిజిస్ట్రేషన్ నేపథ్యంలో ఏ డాక్యుమెంట్ ఏ విధంగా చేయాలనే అంశాలపై సీఎస్ మార్గనిర్దేశం చేశారు. ధరణి పోర్టల్ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనం, భద్రత, రక్షణ, సులభతరంగా ఉంటుందన్నారు.

విచక్షణాధికారాలు లేకుండా ఉంటాయని, ఇది వినూత్నమైనదని, దేశంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని కొనియాడారు. ఈ పోర్టల్ ద్వారా 570 మండలాల్లో తహసీల్దార్లు ఇక నుంచి జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగానూ పని చేస్తారన్నారు. 142 ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ధరణి పోర్టల్ కార్యకలాపాలకు అవసరమైన సిబ్బంది, వసతులతో 100 శాతం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లను కోరారు. రేపటిలోగా తహసీల్దార్లందరూ ప్రయోగాత్మకంగా ధరణి పోర్టల్ ద్వారా కనీసం 10 లావాదేవీలను చేపట్టాలని సూచించారు. ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో పని చేసేటట్లు అవసరమైన హార్డ్ వేర్ సౌకర్యాలను సమకూర్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ధరణి సేవల్లో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా డిస్కం, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టీఎస్ టీఎస్ ప్రతినిధులతో నిరంతర సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.

సమస్యలన్నీయథాతథమే..!

ప్రస్తుతానికి ధరణి పోర్టల్‌లో 58 లక్షల ఖాతాలతో 1.44 కోట్ల ఎకరాల భూమి ఉంది. అయితే వివాదాస్పద భూములు, పట్టాదారు పాసు పుస్తకాలు రాని ఖాతాలేవీ నమోదు కాలేదు. పార్టు బి‌కి సంబంధించిన భూముల వివరాలేవీ నమోదు చేయలేదు. ఇలాంటి వాటి నుంచి ఎదురయ్యే సమస్యలకు ప్రస్తుతానికి ధరణి పరిష్కారం చూపడం లేదని కొందరు తహసీల్దార్లు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రికార్డుల్లోకెక్కని భూముల సంగతిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ వంటివి లేవు. ఎన్ఆర్ఐలు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా రావాలన్నట్లుగా ధరణి చెబుతోంది. విరాసత్ డాక్యుమెంట్ ఇవ్వగానే మ్యుటేషన్, భాగ పంపకాలు చేయాలా? ఏమైనా విచారణ చేయాలా? ఎలాంటి విచారణ లేకుండా ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా తలెత్తే సమస్యలకు పరిష్కారం కనిపించడం లేదు. జాయింట్ అఫిడవిట్‌ను పరిశీలన చేయకుండానే పూర్తి చేయడం తగదని తహసీల్దార్లు సూచించారు.

ఇంకా పలు అనుమానాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటికైతే ధరణి పోర్టల్‌లో ఉన్న ఖాతాల వరకు రిజిస్ట్రేషన్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. వివాదాస్పద భూములు, చట్టంలో లేని అంశాల గురించి తర్వాత చూద్దామని సమాధానమిచ్చినట్లు తెలిసింది. తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-2020 అమలుకు మార్గనిర్దేశకాలను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ శేషాద్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వి, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జోంగ్తు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్ టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, టెర్రాసిస్ సిబ్బంది పాల్గొన్నారు.