వరలక్ష్మీ వ్రతం విశిష్టత.. అసలు ఎవరెవరు ఈ వ్రతం చేసుకోవచ్చు?

by Yella Dhawani Reddy |

శ్రీ మహా విష్ణువు సతీమణి లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీగా భక్తులు కొలుస్తారు. వివాహమైన స్త్రీలు కుటుంబశ్రేయస్సు కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి భక్తితో అమ్మవారిని పూజిస్తారు.

వరలక్ష్మీ వ్రతం విశిష్టత.. అసలు ఎవరెవరు ఈ వ్రతం చేసుకోవచ్చు?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రావణ మాసం.. శివకేశవులతో పాటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. అలాగే, ఈ మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలకు ఎంతో అనువైన సమయంగా చెబుతారు. అందుకే, శ్రావణం వచ్చిందంటే.. పండగలు తెచ్చిందంటారు పెద్దలు. ఇక శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున హిందువులు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. ఈ సందర్భంగా అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి? ఎందుకు ఆచరిస్తారు? ఎవరెవరు చేసుకోవచ్చు? వంటి విశేషాలు తెలుసుకుందాం.

శ్రీ మహా విష్ణువు సతీమణి లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీగా భక్తులు కొలుస్తారు. వివాహమైన స్త్రీలు కుటుంబశ్రేయస్సు కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి భక్తితో అమ్మవారిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని విశ్వసిస్తారు.

పార్వతీకి శివుడు వివరించిన కథ

ఇక స్కంద పురాణం ప్రకారం.. ఆ పరమేశ్వరుడు స్వయంగా వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించినట్లుగా చెబుతారు. ఓ రోజు పార్వతీదేవి శివుడిని.. స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అప్పుడు శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి వివరించాడు. పూర్వం మగధ దేశంలో ఎంతో రమణీయమైన కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ ప్రాంతంలో ఎంతో సుగుణవతి అయిన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె ప్రతిరోజూ ప్రాత:కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి, గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో కనిపించింది. 'ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు.. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను' అని చెప్పి అంతర్థానమైంది.

వెంటనే చారుమతి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతితో పాటు ఆ పట్టణంలోని స్త్రీలందరూ వ్రతం చేసుకోవటం కోసం సిద్దమయ్యారు. ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని పూజించారు. అనంతరం భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఇక వ్రతం పూర్తి అయ్యే సరికి చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ నాటి నుంచి వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ సకల సంపదలు పొందారని పార్వతీదేవికి శివుడు చెప్పాడు. ఇక ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్మకం.

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమా నిష్టలు అవసరం లేదు. భక్తితో ఏకాగ్రతతో ఆ అమ్మవారిని పూజిస్తే.. వరలిక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇక స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అలాగే, వ్రతం చేసుకున్న మహిళలు కచ్చితంగా ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి.

Next Story