- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరామ చరితం.. వసుదైక కుటుంబకం....!
రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమ..! / రాజ సర్వస్యలోకస్య మఘ వానివ..!!... "శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమ..! / రాజ సర్వస్యలోకస్య మఘ వానివ..!!... "శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణికోటికి హితము కలిగించే సాధు జీవుడు రాముడు. అతని పరాక్రమానికి తిరుగులేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్లే, ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు."
జై శ్రీరామ్.. ఈ పదం వింటుంటేనే మదిలో తెలియని అనుభూతి ఉప్పొంగుతుంది. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు చేసిన త్యాగాలు, సేవలు, అజరామరం. సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు శ్రీరాముడు చరిత్ర దేదీప్యమానం విలువలు, సంస్కారం, సభ్యత క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత ఒకటేమిటి..సర్వం శ్రీరామచంద్రుడే ఆదర్శం. ఈ లోకంలో భార్యాభర్తలు.. అన్నదమ్ములు.. తల్లిదండ్రులు.. పరిపాలకులు.. కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలో ఆచరించి చూపిన మహనీయుడు శ్రీరాముడు. ఈ సృష్టికి మార్గదర్శి. అందుకే ప్రపంచాన్ని ఆకర్షించే రీతిలో రామ భక్తులు రాముల వారి కళ్యాణం నిర్వహించుకుంటున్నారు. ఊరు.. వాడ.. పల్లె.. పట్టణం.. ప్రతి ఇల్లు జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లుతుండటం అత్యంత విశేషం. శ్రీరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. సనాతన ధర్మానికి, సమస్త లోకానికి మార్గదర్శి.
పరాయి పాలన కారణంగా సనాతన ధర్మం, సంప్రదాయాలపై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. దాదాపు 500 సంవత్సరాల క్రితం మొగలుల కారణంగా ధ్వంసమైన రామ మందిరాన్ని ఇటీవల కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించి, అయోధ్యలో భవ్య.. దివ్య శోభాయమానమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసుకున్నాము. ఈ శ్రీరామనవమికి రెండోసారి అయోధ్యలో వైభవంగా రాముల వారి కళ్యాణం చేసుకోవడం శుభ సందర్భం. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు కనుల పండుగగా రాముల వారి కళ్యాణం నిర్వహించుకోవడం ఆనందదాయకం.
రాముడు ఆదర్శ పురుషుడు.. మర్యాద పురుషుడు.. ఏకపత్ని వ్రతుడు.. పితృ వాక్య పరిపాలకుడు.. పరిపాలన దక్షకుడు.. పేదల సంక్షేమం కోరే మహనీయుడు. అటువంటి రాముడిని స్మరించుకోవడం మన కర్తవ్యం.
మహాత్మా గాంధీ అందించిన రాములవారి సందేశం..
భారత స్వాతంత్రానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గారు "రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం" అంటూ భజనలు చేస్తూ.. భారతీయుల్లో చైతన్యం తీసుకువచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేశారు. శ్రీరాముడి గుణగణాలను మన జీవితంలో అలవర్చుకోవాలని కోరుకున్నాడు. దేశానికి స్వాతంత్రం సంపాదించాక ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే రామ రాజ్యం కావాలని కాంక్షించాడు. అందులో భాగంగా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఉన్న పేజీలో సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉన్న చిత్రాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి రాముడు విశిష్టతను ప్రపంచానికి తెలియజేశాడు.
అడవి బాట పట్టిన పితృవాక్య పరిపాలన
తెల్లవారితే పట్టాభిషేకం ఉన్నప్పటికీ, రాజ్యాన్ని, రాజ్య భోగాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్లిన పితృ వాక్య పరిపాలకుడు శ్రీరాముడు. రాముడు తండ్రి మాటను జవదాటకుండా 12 సంవత్సరాలు కఠోరమైన అరణ్యవాసం అనుభవించాడు. అయినప్పటికీ తల్లిదండ్రులపై కించిత్ కోపం కూడా ప్రదర్శించలేదు. అది రాముల వారు తండ్రికిచ్చే గౌరవం.
కానీ, నేటి పరిస్థితుల్లో అధికారం కోసం ఎంతకైనా తెగించి, కుర్చీని సొంతం చేసుకునే కుట్రలు మనం చూస్తున్నాము. రక్తసంబంధీకులు, తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు కొరవడిన సమాజాన్ని నేడు మనం చూస్తున్నాము. అరణ్యవాసంలో సహధర్మచారిని సీతమ్మను రావణాసురుడు అపహరిస్తే ఆక్రోశించిన రాముడు.. సీతమ్మ జాడ తెలుసుకొని ధర్మపోరాటం చేసిన వీరుడు. పర స్త్రీలను తల్లులుగా భావించి సీతమ్మ తల్లికి సొంతమైన రాముడు ఏకపత్నివతుడిగా ఆదర్శమయ్యాడు.
సీతమ్మ పాతివ్రతం..!
రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్లి అశోకవనంలో నిర్బంధించి అనేక ప్రలోభాలకు గురిచేసినా సీతమ్మ తన నిష్ఠను కోల్పోలేదు. పతియే దైవంగా శ్రీరాముడిని స్మరిస్తూ ఆయన రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ.. తన పతివ్రత నిష్టను చాటి చెప్పిన మహా సాధ్వి సీతమ్మ. తరతరాలకు ఆమె ఆదర్శం. పాశ్చాత్య నాగరికతకు.. భోగలాలసకు లోనై, కొంతమంది సొంత భర్తలను, కనుకున్న పిల్లలను కర్కశంగా కడతీరుస్తున్న నేటి సమాజంలో సీతమ్మ తల్లి గొప్పతనం తెలుసుకోవడం చాలా అవసరం.
స్వామి భక్తికి సాక్షాత్కారం హనుమంతుడు..
రామాయణంలో నేర్చుకోవాల్సిన హనుమంతుని నిబద్ధత చాలా ఉంది. ఆంజనేయుడు బుద్ధిశాలి. బలశాలి. ధైర్యశాలి. ధర్మశాలి. విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక. సీతమ్మను రాముడి నుంచి వేరు చేసిన రావణాసురుడి అంతం కోరిన మహనీయుడు. అణువణువు అన్వేషించి లంకలోని అశోకవనంలో బందీగా ఉన్న సీతమ్మ జాడను కనుగొని, లంకా దహనం చేసిన బుద్ధి బలశాలుడు. ఎల్లవేళలా రామ బంటుగా ఉండడమే గాని.. ఏనాడు కీర్తి ప్రతిష్టలకు పాకులాడలేదు. స్వామి భక్తి ఏ విధంగా ఉండాలి అనే విషయంతోపాటు విశ్వాసాన్ని నేర్పే ఆంజనేయుడి ద్వారా సమాజానికి గొప్ప సందేశం అందించవచ్చు.
లక్ష్మణుడు..
లక్ష్మణుడు తన అన్న రాముడి కోసం అడవులకు బయలుదేరాడు. కటోరమైన వనవాసం అనుభవించాడు. రాజ భోగభాగ్యాలను వదిలిపెట్టి అన్న శ్రీరాముడి సేవలో తరించి ఆదర్శవంతమైన తమ్ముడిగా చరిత్రలో నిలిచాడు. అన్న అడుగులో అడుగు వేస్తూ అనునిత్యం రాముడి వైభవం కోసం పనిచేసిన లక్ష్మణుడు ఉత్తమమైన సోదరుడు గా చరిత్రలో నిలిచాడు. అయితే ఒక కడుపులో పుట్టిన అన్నదమ్ములే నేడు కక్షలు కార్బన్యాలతో కొట్టుకు చస్తున్న సంఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఆస్తుల కోసం, సంపద కోసం తన్నుకు చస్తున్న సందర్భంలో కుటుంబ విలువలు, ఆత్మీయత అంశాలను లక్ష్మణుడి ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
లోక కళ్యాణం కోరిన రాముడు..
ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా "సర్వేజనా సుఖినోభవంతు" అంటూ లోక కళ్యాణం కోరుకునే శ్రీరాముడు ప్రపంచానికి ఆదర్శం. ఎంతటి క్లిష్ట పరిస్థితులలోనైనా నిబద్ధత కోల్పోకుండా.. కర్తవ్య నిష్టతో ముందుకు సాగిన రాముడు లోకానికి ఆదర్శం. ఎటువంటి రాగద్వేషాలకు తావు లేకుండా..జాతి వర్గ విభేదాలు లేకుండా.. అందరూ సమానం అనే భావనతో పరిపాలన సాగించిన దక్షకుడు శ్రీరాముడు. ఎలాంటి నిందలకు ఆస్కారం లేకుండా సత్యం, ధర్మం, నిష్ట కోసం నిలిచిన ఆదర్శ పురుషుడు శ్రీ రాముడు.
రామాయణమే ఆదర్శం..
ప్రస్తుతం శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని మనమంతా రామ భక్తులుగా జీవితాలను మెరుగుపరచుకోవాలి. ప్రతిభాపాటవాలు పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూ.. వాటిని భావితరాలకు అందజేయాలి. మన దేశం విద్య, వైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు వ్యవసాయ పారిశ్రామిక సంబంధిత రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి. ప్రపంచానికి సనాతన ధర్మం మార్గదర్శిగా నిలవాలి. ఆ దిశగా మనమందరం కలిసి పని చేయాలి. శ్రీరామనవమి సందర్భంగా రామాయణం ఆధారంగా జీవించడం అలవాటు చేసుకోవడం సముచితం.
కుటుంబ విలువల పరిరక్షణ ఔషధం.. రామాయణం
భార్యాభర్తల అన్యోన్యత, సోదరుల సౌబ్రాతృత్వం అడుగంటిన ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ విలువలు పెంచి పోషించే రామాయణం ప్రతి ఒక్కరికి మార్గదర్శి కావాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు భార్యాభర్తలు, పరిపాలకులు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు. నియమనిష్టలు పాటిస్తూ.. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే దృఢ సంకల్పం.. ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా ఆత్మవిశ్వాసం సడలిపోకుండా నిబ్బరంగా నిలబడి పరిస్థితులను జయించే శక్తిసామర్థ్యాలను కలిగిన శ్రీరాముడు.. రామాయణం నుంచి నేటి సమాజం నేర్చుకోవడం అవసరం చాలా ఉంది. వ్యసనాలు.. కలహాలు, డ్రగ్స్ ..జూదం తదితర చెడు అలవాట్ల నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలంటే రామాయణం అధ్యయనం చేయాలి. వసుదైక కుటుంబంపై అవగాహన పెంచుకోవాలి. కుటుంబ విలువలు బలపడితేనే మనిషి మనుగడ సాధ్యం అనే విషయం గ్రహించాలి. అందుకు రామాయణమే చక్కటి ఔషధం అనే విషయం తెలుసుకుంటే ఉత్తమం.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
99129 75753






