శివ పార్వతులు వివాహం జరిగింది ఇక్కడే.. 3 యుగాలుగా వెలుగుతూనే ఉన్న హోమగుండం

by Yella Dhawani Reddy |

హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులను ఆది దంపతులుగా కొలుస్తారు.

శివ పార్వతులు వివాహం జరిగింది ఇక్కడే.. 3 యుగాలుగా వెలుగుతూనే ఉన్న హోమగుండం
X

దిశ, వెబ్ డెస్క్: హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులను ఆది దంపతులుగా కొలుస్తారు. లయకారుడైన శివుడిని భర్తగా పొందాలని పార్వతి దేవి కఠోర తపస్సు చేసింది. పార్వతీదేవి పూర్వ జన్మలో సతీదేవి అని కూడా చెబుతారు. అయితే, భూమిపై పార్వతీపరమేశ్వరులు పెళ్లి చేసుకున్న ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. నేటికి ఆ ఆది దంపతుల వివాహానికి సంబంధించిన సాక్ష్యాలు అలానే ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆలయాన్ని దర్శిస్తే వివాహ జరగని వారికి త్వరగా పెళ్లి అవుతుందని భక్తులు నమ్ముతారు. ఇవాళ (ఫిబ్రవరి 26) మహా శివరాత్రి సందర్భంగా ఈ ప్రదేశం ఎక్కుడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

ఆలయ విశిష్టత

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో త్రియుగీ నారాయణ్ అనే చాలా చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో మహా విష్ణువు అతి పురాతనమైన త్రియూగీ నారాయణ ఆలయం ఉంది. ఈ ప్రదేశంలోనే శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని కైలాసం తీసుకెళ్లాడని అంటారు. ఇందుకు సంబంధించి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం లోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మీనారాయణ మూర్తులు ఉంటారు. ఆలయంలో ఉండే హోమగుండం మూడు యుగాల నుంచి వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు. అందుకే ఈ ఆలయానికి త్రియుగీ నారాయణ్ అనే పేరు స్థల పురాణం చెబుతుంది. హోమగుండం పక్కన ఒక మనిషి కూర్చుని ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. ఆ హోమగుండంలోని విభూతి అతి పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.

ఈ ఆలయంలోని ధర్మశిలలోనే ఆది దంపతుల వివాహం జరిగిందని భావిస్తారు. ఇక ఆలయం బయట చిన్న మందిరంలో శివలింగం ఉంటుంది. ఆలయం బయట ప్రాంగణంలో 3 సరస్సులు వరసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. వీటిని బ్రహ్మకుండము, విష్ణుకుండము, సరస్వతీ కుండములుగా చెబుతారు. ఈ మూడు సరస్సుల్లో స్నానం చేసి, శివపార్వతులను దర్శించుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని ఇక్కడి వచ్చే భక్తులు నమ్ముతారు. అంతేకాదు, శివ పార్వతుల వివాహానికి సంబంధించిన అనేక వస్తువులు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి.

ఆలయానికి ఎలా చేరుకోవాలంటే?

నేషనల్ హైవే 58 మార్గంలో రుద్రప్రయాగ్ ఉంటుంది. ఢిల్లీ నుంచి బద్రీనాథ్ వెళ్లే బస్సులు రుద్రప్రయాగ్ మీదుగా వెళ్తుంటాయి. రైలు మార్గంలో అయితే హరిద్వార్ వెళ్లి అక్కడి నుంచి వెళ్లొచ్చు. ఇక విమాన సర్వీసులు అయితే, డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్ ఎయిర్‌పోర్టు వెళ్లి అక్కడి నుంచి త్రియుగీ నారాయణ్ క్షేత్రం వెళ్లొచ్చు.

Next Story