తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. రికార్డు స్థాయిలో మొక్కుల చెల్లింపులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-31 05:11:07  IST  )

వేసవి సెలవులు త్వరలోనే ముగియనుండగా.. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు పయనమవుతున్నారు. దీంతో కొండపై రద్దీ కంటిన్యూ అవుతోంది.

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. రికార్డు స్థాయిలో మొక్కుల చెల్లింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిరోజులుగా భారీగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్లవుతుండగా.. వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. వేసవి సెలవులు త్వరలోనే ముగియనుండగా.. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తిరుమలకు పయనమవుతున్నారు. దీంతో కొండపై రద్దీ కంటిన్యూ అవుతోంది. వీకెండ్ లో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదివారం ఉదయం 8 గంటల సమయం వరకూ వైకుంఠం క్యూకాంప్లెక్సు నిండి.. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 15-18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని, సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

నిన్న (శనివారం) స్వామివారిని 92,010 మంది భక్తులు దర్శించుకోగా.. రికార్డు స్థాయిలో 52,346 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు సమకూరింది. భక్తులకు స్వామివారి ప్రసాదంగా 4.43 లక్షల లడ్డూలను విక్రయించారు. వెంగమాంబ అన్నదాన సత్రం సహా.. కొండపై పలు ప్రాంతాల్లో 2.85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో.. తిరుమలకు వచ్చేవారు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Next Story