Mauni Amavasya:: దేవతలు భూవిపైకి దిగి వచ్చే రోజు.. మౌనీ అమావస్య ప్రత్యేకతలు ఇవే!

by Vennela |   (  Updated:2025-01-28 14:03:57  IST  )

mauni Amavasya :మౌని అమావస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది.

Mauni Amavasya:: దేవతలు భూవిపైకి దిగి వచ్చే రోజు.. మౌనీ అమావస్య ప్రత్యేకతలు ఇవే!
X

దిశ,వెబ్‌డెస్క్: mauni Amavasya : మౌని అమావస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా గంగ, యమునా, సరస్వతీ సంగమ ప్రాంతం హిందూ దేవతలతో పవిత్రంగా ముడిపడి ఉంది. అందుకే మహాకుంభమేళ రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.

ఒక్కసారి ఊహించుకోండి.. ఒకటి కాదు రెండు కాదు 10 కోట్ల మంది జనం ఓ ప్రాంతంవైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుంది..? వారంతా కలిసి పవిత్ర గంగానదిలో స్నానం ఆచరిస్తే ఎలా అనిపిస్తుంది? చూడడానికి రెండు కళ్లు చాలవు కదూ? ఇదంతా ఊహ కాదు.. జరగబోయే వాస్తవం. హిందూ ధర్మంలో కొన్ని ముహుర్తాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో మౌని అమావస్య ఒకటి. జనవరి 29న రానున్న మౌని అమావస్య సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఏకంగా 10కోట్ల మంది ఆ ఒక్క రోజే గంగానదిలో స్నానం చేస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని చెబుతోంది.

మౌని అమావస్య ఎందుకంత ప్రత్యేకం?

మౌనీ అమావాస్య హిందూ ధర్మంలోని ఓ పవిత్రమైన రోజు. ఆ రోజు మౌనంగా ఉండటం, ఆత్మచింతన చేయడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారాలు. మౌనంగా ఉండటం ద్వారా మనసు శాంతి పొందుతుందని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఆ రోజు పవిత్ర గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ రోజు చేసిన తపస్సు, ధ్యానం, జపం ద్వారా విశేషమైన ఫలితం పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లేందుకు చాలా ప్రాముఖ్యమైన రోజుగా హిందూ పండితులు చెబుతుంటారు. మౌనీ అమావస్య నాడు పితృదేవతలకు తర్పణం చేయడం చాలా శుభప్రదమట. ఇక దానం చేయడం ద్వారా పుణ్యం పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు.

రాముడితో లింక్

మౌనీ అమావాస్య వేదకాలం నుంచే ఉన్న ఆచారం. ఈ పండుగ వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. వేదాలు, పురాణాల ప్రకారం మౌనం ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలకు మార్గం. పాండవులు అరణ్యవాసంలో తపస్సు చేశారని హిందూ పురాణాల్లో రాసి ఉంది. అలాగే రాముడు తన అరణ్యవాసంలో ధ్యానం చేసినట్టు కూడా ఉంది. ఈ మౌనీ అమావస్య సంప్రదాయానికి ఈ పురాణ కథలే ప్రేరణ అని చెప్పవచ్చు.

ఆధ్యాత్మిక శక్తి కోసం

మౌనీ అమావాస్య నాడు యోగులు, రుషులు తపస్సు చేసి తమ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకున్నారని హిందూ పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున సాధారణంగా విష్ణుమూర్తిని తలుచుకోని ధ్యానం చేస్తే మహత్తరమైన ఫలితం పొందవచ్చని నమ్మకం ఉంది. ఇక శివుడు తపస్సు చేసిన సందర్భాలు మౌనం ఆధ్యాత్మిక మూలాలను గుర్తుచేస్తాయి. మహాభారతంలో భీష్ముడి తపస్సు, మౌనంగా ఉండటం, ఆత్మాన్వేషణ అనేవి కీలకంగా కనిపిస్తాయి. ఇదంతా మౌనానికి ఉన్న శక్తి.

పటిష్ట ఏర్పాట్లు

మౌని అమావస్య నాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా గంగ, యమునా, సరస్వతీ సంగమ ప్రాంతం హిందూ దేవతలతో పవిత్రంగా ముడిపడి ఉంది. అందుకే మహాకుంభమేళ రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. గూగుల్ నావిగేషన్‌తో భక్తులకి సులభంగా రోడ్డు మార్గాలు అందుబాటులో ఉండడం రద్దీ పెరగడానికి మరో కారణం. ఇక భద్రత కోసం డిజిటల్ కెమెరాలు, డ్రోన్లను యూపీ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. భక్తులకి సమాచారం అందించేందుకు ఆన్-గ్రౌండ్ పోలీస్ సిబ్బంది వ్యవస్థ ఉంది. ఇక మహాకుంభమేళా ప్రాంతాన్ని పూర్తిగా వాహన రహితంగా మార్చారు.

Next Story