కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఎప్పటి నుంచి మొదలైంది?

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది.

కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఎప్పటి నుంచి మొదలైంది?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరికి చూపు అటు వేపే ఉంది. ఈ నేపథ్యంలో కుంభమేళా అంటే ఏమిటి? అసలు ఎందుకు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారనే ఆసక్తి కూడా చాలామందిలో నెలకొంది. కుంభమేళా సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ప్రపంచంలో జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక కూడా ఇదే. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాల నుంచి విముక్తి కలిగి, మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు?

పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు క్షీర సాగర మథనం చేయగా అందులోంచి అమృత కలశం బయటపడింది. దాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకుని భూమి చుట్టూ తిరిగింది. ఆ సమయంలో ఆ కలశంలోని నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ ప్రాంతాలే ప్రస్తుత.. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌. అందుకే ఈ ప్రదేశాల్లోనే కుంభమేళాలు జరుగుతుంటాయి. ఇక కుంభమేళాను 12 ఏళ్లకోసారే ఎందుకు నిర్వహిస్తారంటే.. మనకు రోజు అంటే 24 గంటలు. అలాగే దేవతలకు రోజు అంటే ఒక సంవత్సరం కాలంగా చెబుతారు. ఆ పక్షి భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగిందని, అందుకే 12 సంవత్సరాలకోసారి ఈ కుంభమేళా జరుపుకోవాలనేది ఆచారంగా వస్తోంది.

కుంభమేళా ఎప్పుడు మొదలైంది?

చారిత్రక ఆధారాల ప్రకారం.. కుంభమేళా హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి మొదలైనట్లుగా చెబుతారు. హర్షవర్ధనుడి పాలనలో సుమారుగా ఐదేళ్లకోసారి కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమం నిర్వహించేవారని, ప్రయాగ వచ్చి కవులు, ఆధ్మాత్మికవేత్తలను సమావేశపరిచి దానాలు చేసేవారని అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ఆచార్యులు, ఆర్ట్స్ విభాగం డీన్ అనామిక రాయ్ వివరించారు. అంతేకాదు, ఇదే కుంభమేళాకు సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారంగా పేర్కొన్నారు.

అలాగే ఆమె కుంభమేళా నిర్వహించటంపై మరో వివరణ కూడా ఇచ్చారు. గుప్తుల కాలంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి ఎక్కడా చారిత్రక ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాలు గమనిస్తే హర్షవర్ధనుడి కాలంలో జరిగినట్లు ఆధారాలు ఉండడంతో పాటు శంకరాచార్య కాలంలోనూ జరిగినట్లు ఆధారాలు సూచిస్తున్నాయన్నారు. అయితే, శంకరాచార్య కాలంలో జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా స్వామి కరపాత్రి రాసిన ‘కుంభ తిథ్యాది నిర్ణయ’ పుస్తకంలో ఆ మేరకు ప్రస్తావన ఉందని తెలిపారు. శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించి, ఎప్పుడైతే 12 ఏళ్లకోసారి నక్షత్రాల కలయిక జరుగుతుందో.. అదే సమయంలో కుంభమేళాను జరిపించారని వివరించారు.

Next Story