- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి.. ఆలయ శుద్ధి నిర్వహించారని తెలిపారు. కాగా ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
టీటీడీకీ రూ.10 లక్షలు విరాళం
గుంటూరుకు చెందిన శ్రీ వేంకటేశ్వర పౌల్ట్రీస్ సంస్థ అధినేత వేంకటేశ్వరరావు మంగళవారం స్వామివారి అన్నప్రసాద ట్రస్టుకు భారీ విరాళమిచ్చారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరికి రూ.10,01,116 విరాళంగా అందించారు.






