- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mystery Temple: ఈ ఆలయంలోని విగ్రహాన్ని ముట్టుకుంటే సొట్టపడుతుంది.. ఎక్కడ ఉందో తెలుసా?
మన దేశానికి ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

దిశ, వెబ్ డెస్క్: మన దేశానికి ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అందుకు నిదర్శనంగా ఎన్నో పురాతన ఆలయాలు, కట్టడాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇక ఆ ఆలయాల్లో సైన్స్‌కు సైతం అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను ఛేదించడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు నేటికీ ప్రయత్నిస్తున్నే ఉన్నారు. అలాంటి మిస్టరీ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం విశిష్టత ఏంటి? ఆలయంలోని రహాస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయ విశిష్టత
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ సమీపంలోని దండకారణ్యంలో 4 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో దాదాపు పది అడుగుల ఎత్తుతో శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు, ఈ ఆలయాన్ని నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనదిగా పేర్కొంటారు. ఈ ఆలయంలో శిల రూపంలోని స్వామి విగ్రహంలో నోరు, నుదురు మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా గుర్తించవచ్చు. స్వామి వారికి వెంట్రుకలు కూడా కనిపిస్తాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. స్వామివారిది రాత్రి విగ్రహం అయినప్పటికీ ఎక్కడ తాకినా సొట్టపడుతుంది. కాసేపటికి యధాస్థితి చేరుకుంది. దీని వెనుక ఉన్న రహస్యం నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అలాగే, స్వామి నాభి నుంచి కారే ఎర్రటి రక్తం లాంటి స్రావం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ తెలుసుకోలేకపోయారు. ఈ చందాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు. దీనిని ప్రసాదంగా తీసుకున్నవారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
స్థల పురాణం
పురాణాల ప్రకారం.. ఇక్కడ నరసింహ స్వామి అగ్నిపర్వతం నుంచి ఉద్భవించినట్లుగా చెబుతున్నాయి. ఓసారి భరద్వాజ, అంగీరస మహర్షులు గోదావరి నది ఆద్యంతాలను తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో సేదతీరుతుండగా వారి కలలో స్వామివారు కనిపించి ఇక్కడి కొండల్లో తాను ఉన్నానని తెలియజేశాడని అంటారు. వెంటనే ఆ మహర్షులు తమ శిష్యులతో కలిసి ఇక్కడున్న కొండల్ని గునపంతో తొలవడం మొదలుపెట్టారట. కాసేపటికి స్వామి విగ్రహం బయటపడింది. అయితే, తవ్వే క్రమంలో గునపం స్వామి నాభికి తగలడంతో నెత్తురును పోలిన ద్రవం స్రవించిందని, దాన్ని ఆపేందుకు మహర్షులు చందనాన్ని అడ్డుగా పెట్టినట్లు చెబుతారు. అప్పటి నుంచి నేటి వరకూ స్వామి నాభి నుంచి రక్తంలాంటి స్రావం వస్తూనే ఉంటుంది. దాన్ని నియంత్రించేందుకే ఎప్పటికప్పుడు ఆలయ అర్చకులు చందనాన్ని పూతగా వేస్తారు.
ఎలా చేరుకోవాలంటే?
ఆధ్యాత్మికతతో పాటు పర్యటక ప్రాంతంగానూ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని ప్రతి రోజు 5:30 గంటలకే మూసేస్తారు. ఇక ఈ ఆలయం ఏటూరునాగారం-భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. ఇక భద్రాచలం, హన్మకొండ నుంచి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు. అక్కడ నుండి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు ఉంటాయి. మల్లూరుకు కొన్ని ప్రత్యక్ష బస్సులు కూడా ఉన్నాయి.






