Ayyala Gutta : గుడి వద్దని వారించిన మహాశివుని జాతర

by Muthe.Rajitha |

సాధారణంగా దేవుళ్ళు, దేవతలు భక్తులకు కలలో కనిపించి తనకు గుడి కట్టమని చెబుతారు.

Ayyala Gutta : గుడి వద్దని వారించిన మహాశివుని జాతర
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా దేవుళ్ళు, దేవతలు భక్తులకు కలలో కనిపించి తనకు గుడి కట్టమని చెబుతారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మహాశివుడు మాత్రం భక్తుల కలలో కనిపించి తనకు ఎలాంటి గుడి కట్టవద్దని ఆజ్ఞాపించగా.. ఇప్పటికీ ఎలాంటి ఆలయం లేకుండానే ఓ చెట్టుకింద పూజలు అందుకుంటున్న మహా శివుని జాతర గురించి తెలుసుకుందాం రండి. నిజామాబాద్(Nizamabad) జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో చారిత్రాత్మక మహిమాన్విత క్షేత్రము అయ్యలగుట్ట రాజరాజేశ్వరస్వామి(Ayyalagutta Rajarajeshwara Swamy) వారి జాతర ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. చుట్టు ప్రక్కల గ్రామాల వారు, జిల్లా వాసులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ స్వామివారు 300 సంవత్సరాల నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారని పూర్వీకులు చెబుతుంటారు. అయ్యలు, సిద్ధులు అనే ఋషులు ఇక్కడ తపస్సు చేయడం వల్ల అయ్యల గుట్టగా పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి ఏటా పుష్యమి అమావాస్య రోజున గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బెల్లం అన్నం నైవేద్యాలతో, ఎడ్ల బండ్ల ఊరేగింపుతో స్వామి వారిని అలంకరించి, పల్లకిలో ఊరేగింపు తీసుకువచ్చి గుట్ట చుట్టూ తిప్పి మర్రి చెట్టు గద్దెపై పెట్టి పూజలు చేయడం జరుగుతుంది.

రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు ఇక్కడ సిద్ధులు, అయ్యలు తపస్సు చేసే శబ్దాలు వినిపిస్తాయని నాటి పూర్వీకులు చెబుతుండేవారని ఆలయ పూజారి తెలిపారు. భక్తుల కోరికలను తీర్చే దైవమై... భక్తుల పాలిట కొంగుబంగారంగా స్వామివారు నిలుస్తున్నారని... విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, సంతానం కాని వారికి, ఉద్యోగం కావాలనుకునే వారికి, వ్యవసాయంలో అభివృద్ధి జరగాలనుకునే వారి అందరి కోరికలు స్వామి తీరుస్తున్నారని అన్నారు. ఈ అయ్యల గుట్ట ప్రత్యేకత ఏంటంటే లింగానికి పూజ కాదు.. సాక్షాత్తు వీరభద్రుడు కొలువైనటువంటి ప్రదేశమిది అందుకే అయ్యలు అని చెబుతారు. ఎక్కడైనా లింగానికి పూజ జరుగుతుంది కానీ ఇక్కడ వీరభద్రుడికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అందుకే ఇది అయ్యల గుట్ట అని ప్రసిద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలైన సుంకేట్, మోర్తాడ్, వేల్పూర్, జాగిర్యాల్, భీంగల్ తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఊరి నుంచి విదేశాలకు వెళ్లిన వారు, వేరే చోట స్థిరపడ్డ వారైనా సరే ఖచ్చితంగా అయ్యలగుట్ట జాతరకు కచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది.

ఈ స్వామి వారు ఎప్పుడైనా చీకట్లోనే ఉంటారు. మేము ఇక్కడ రాత్రిపూట విద్యుత్ దీపాలు వెలిగించి వెళితే ప్రొద్దున వచ్చేసరికి అవన్నీ షార్ట్ అయిపోతాయి. ఇలా గతంలో జరగగా, ఇప్పుడు కూడా జరుగుతోంది. స్వామి వారు చీకట్లో సహజసిద్ధమైన వెలుతురులో మాత్రమే ఉంటారని పూర్వీకులు కథలుగా చెప్పుకునేవారట. ప్రతి చోట దేవుడికి గుడి ఉంటుంది కానీ, ఇక్కడ మాత్రం స్వామివారికి గుడి కట్టలేదు. స్వామి వారు ఒక భక్తునికి కలలో వచ్చి గుడి కట్టవద్దని చెప్పడంతో.. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు గుడి కట్టలేదు. ఇక్కడ స్వామి వారు మర్రిచెట్టు కింద గద్దెపై మాత్రమే ఉంటారు. అంతక ముందు స్వామివారు మర్రిచెట్టుపై ఉండగా.. తర్వాత బండపై వెలిశారు. ఆ బండని గతంలో దొంగలు పగలగొట్టినా మళ్లీ వారం రోజుల్లో యథా రూపానికి రావడం స్వామివారి మహిమగా చెప్పుకుంటారు. అందుకే స్వామి వారు నిజంగా ఇక్కడ ఉన్నారని చెప్పి జనాలందరూ భక్తితో కొలవడం జరుగుతుందని భక్తులు వెల్లడించారు.

Next Story