శ్రీవారిని దర్శించుకున్న అంబానీ ఫ్యామిలీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-12 02:43:19  IST  )

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్, కోడలు రాధికతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అంబానీ ఫ్యామిలీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తన కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), కోడలు రాధికా మర్చంట్‌లతో కలిసి ఆయన తెల్లవారుజామున కొండపైకి చేరుకున్నారు. నూతన దంపతులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడంపై రిలయన్స్ వర్గాలతో పాటు భక్తులలోనూ ఆసక్తి వ్యక్తమైంది. స్వామివారికి జరిగిన అత్యంత పవిత్రమైన అభిషేక సేవలో ముకేశ్ అంబానీ కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న అంబానీ ఫ్యామిలీకి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఘన స్వాగతం పలికారు. దైవదర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు..

వీఐపీల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో తిరుమలలో సాధారణ భక్తుల రద్దీపై తీవ్ర ప్రభావం పడింది. టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntham Queue Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. గురువారం స్వామి వారిని 75,428 మంది భక్తుల దర్శించుకున్నారు. అదేవిధంగా 42,566 మంది తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story