- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలపతో అద్భుతమైన అమ్మవారి ఆలయం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
మన దేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. శతాబ్ధాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా, అద్భుత శిల్ప కళకు సాక్ష్యంగా విరాజిల్లుతున్నాయి. దాదాపు ఈ ఆలయాలన్నీ రాతి కట్టడాలే. నాటి ఆలయాలే కాదు.. ప్రస్తుతం నిర్మించే ఆలయాలు కూడా రాయి, ఇటుక, సిమెంట్‌తో నిర్మిస్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఈ ఆలయం పూర్తిగా కలపతో (Wood), ప్రకృతి ఒడిలో అపురూపంగా నిర్మితమైంది. సాంస్కృతిక వారసత్వానికి ఆధునిక స్పర్శను జోడిస్తూ నిర్మించిన ఈ అరుదైన నిర్మాణం వెనుక కథేంటో తెలుసుకోండి.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట్ మారుమూల అటవీ ప్రాంతంలో మహంకాళీ ఆలయం ఉంది. ఆదివాసులు ఈ ఆలయాన్ని పూర్తిగా కలపతో నిర్మించి అమ్మవారి పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇందు కోసం ఒక్క చెట్టును కూడా కొట్టలేదు. తమ గూడెం చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో వర్షాలకు, అగ్నికీలలకు నేలవాలిన వృక్షాలను పోగు చేసి ఆలయ నిర్మాణానికి వినియోగించారు.
గతంలో ఇక్కడ చిన్నపూరిగుడిసెలో మహంకాళీ మందిరం ఉండేది. కొన్నేళ్ల క్రితం గ్రామస్థుడు కినక శంభు నేపాల్ వెళ్లిన సమయంలో అక్కడ ఓ కలప ఆలయాన్ని చూశాడు. తమ గ్రామంలోనూ ఇదే తరహాలో నిర్మించాలని భావించారు. 2023లో గ్రామస్థుల సహకారంతో వాయిపేటలో మందిర నిర్మాణాన్ని తలపెట్టారు. 26 స్తంభాలు, గోపురం, గర్భగుడి, ప్రధాన ద్వారం, గోడలు అన్నీ కలపతోనే రూపొందించారు. కర్రలన్నిటిపై ఆదివాసీ ఆరాధ్య పశుపక్ష్యాదులు, దేవతామూర్తుల చిత్రాలను చెక్కారు. ఇంజినీర్లు, ఆధునిక యంత్ర సామగ్రి లేకుండా స్థానిక వడ్రంగులే అన్నింటినీ తయారు చేశారు.






