పండగ పూట తగ్గుతున్న చికెన్ రేట్!

83

దిశ‌ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పౌల్ట్రీ రంగాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. గ‌త ప‌దిరోజులుగా రోజుకో రాష్ట్రంలో బ‌ర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్ప‌టికే బ‌ర్డ్ ఫ్లూతో దాదాపు 7రాష్ట్రాల్లో ప‌క్షులు, కోళ్లు, బాతులు మృతిచెందాయి. ఈ నేప‌థ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా బ‌ర్డ్ ఫ్లూ వ‌స్తోంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌టంతో చికెన్ ప్రియులు కొనుగోళ్ల‌కు దూరంగా ఉంటూ ఉంటున్నారు. దీంతో అమ్మకాలు దారుణంగా ప‌డిపోయాయి. డిమాండ్ త‌గ్గిపోవ‌డంతో చికెన్‌ వ్యాపారులు ధ‌ర‌ల‌ను త‌గ్గించేశారు. అయినా కొనుగోళ్లు పెర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌దిరోజుల క్రితం వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ ప‌ట్ట‌ణాల్లో కిలో చికెన్ ధ‌ర రూ.250కి పైగా అమ్మ‌కాలు జరిగాయి. బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి వ‌స్తోందంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో కొనుగోళ్ల‌కు వినియోగ‌దారులు జంకుతున్నారు. సోమ‌వారం వ‌రంగ‌ల్‌లో కిలో చికెన్ ధ‌ర రూ.150కి ప‌డిపోయింది. అలాగే జ‌న‌గామ, మ‌హ‌బూబాబాద్‌,న‌ర్సంపేట‌, ప‌ర‌కాల‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, భూపాల‌ప‌ల్లి వంటి ప‌ట్ట‌ణాల్లో రూ.160లోపు అమ్మ‌కాలు జ‌రిగాయి. అత్య‌ల్పంగా పాల‌కుర్తిలో రూ.140కే వ్యాపారులు విక్ర‌యాలు జ‌ర‌గడం గ‌మ‌నార్హం.

ఓ వ్యాపారి ఆవేదన..

వ‌రంగ‌ల్ టీచ‌ర్స్ కాల‌నీ ఫేజ్-1లోని ఓ చికెన్ వ్యాపారిని దిశ ప‌ల‌క‌రించ‌గా.. ప‌దిరోజుల క్రితం వ‌ర‌కు కూడా తాను రోజూ క్వింటాల్‌కుపైగా చికెన్ అమ్మేవాడినని.. ఆదివారాల్లో అయితే ఈ లెక్క డ‌బుల్ అని చెప్పాడు. పండుగ స‌మ‌యాల్లో త్రిబుల్ ఉండేద‌ని, కానీ ప్ర‌స్తుతం రోజూ క‌నీసం 30కేజీలు కూడా అమ్ముడు పోవడం లేదని పేర్కొన్నాడు. బ‌ర్డ్ ఫ్లూ భ‌యాల‌తో ప‌ట్ట‌ణాల్లో కాస్తో కూస్తో చికెన్ కొనుగోళ్లు జ‌రుగుతున్నా.. ప‌ల్లెల్లో మాత్రం వ్యాపారం పూర్తిగా డౌన్ అయింది. దీంతో ట్రేడ‌ర్లు ఎంత బ‌తిమాలిన కోళ్ల‌ను తీసుకోవ‌డానికి వ్యాపారులు అంగీక‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే కొన్నిచోట్ల అయితే అగ్గువకే కోళ్ల‌ను వేసి వెళ్తున్నార‌ని, లెక్క‌లు త‌ర్వాత చూసుకుందామ‌ని చెప్తున్నట్లు పేర్కొంటున్నారు.

త‌ల‌లు ప‌ట్టుకుంటున్న పౌల్ట్రీ రైతులు

ఉన్న కోళ్ల‌కే మార్కెట్ స‌రిగా లేక‌పోవ‌డంతో కొత్త‌గా బ్యాచ్ ర‌న్ చేస్తున్న రైతుల్లో బెంగ ప‌ట్టుకుంది. సంక్రాంతి పండుగ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకుని చాలా మంది రైతులు బ్యాచ్‌లు వేశారు. 40 నుంచి 45రోజుల మ‌ధ్య మార్కెట్‌కు త‌ర‌లిస్తూ ఫాం ఖాళీ చేసుకోవ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌తో ఉన్నారు. అయితే మూడు రోజులుగా మార్కెట్లోకి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ట్రేడ‌ర్లు సెంట‌ర్ల‌కు త‌ర‌లించేందుకు య‌త్నాలు చేస్తున్నా.. వ్యాపారుల నుంచి విముఖ‌త వ్య‌క్తమ‌వుతుతోంది. పెరిగిన కోళ్ల‌కు దాణా పెట్టి ఇంకెన్నాళ్లు కాపాడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో న‌ష్టాలు త‌ప్పేలా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధార‌ణంగా డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి మాసాల్లో చికెన్‌కు డిమాండ్ అధికంగా ఉంటుంది. డిమాండ్ ఉంటుంద‌నే ఆశ‌తో కోళ్ల పెంప‌కాన్ని రైతులు అధికంగా చేప‌ట్టినా.. బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌కంప‌న‌ల‌తో ఊహించ‌ని న‌ష్టాల‌ను పౌల్ట్రీ రైతులు చ‌వి చూడాల్సి వ‌స్తోంది.

ఎవ‌రూ చికెన్ కొంట‌లేరు : బానోతు మ‌హేశ్, చికెన్ సెంట‌ర్ నిర్వాహకుడు, కేస‌ముద్రం
గ‌తంలో మాదిరిగా చికెన్ చాలా మంది కొనుగోలు చేయ‌డం లేదు. బ‌ర్డ్ ఫ్లూ భ‌యాందోళ‌న‌తో కొనుగోళ్ల‌కు ముందుకు రావ‌డం లేదు. మ‌న ద‌గ్గ‌ర బ‌ర్డ్ ఫ్లూ వ‌చ్చింద‌ని ఎక్క‌డా నిర్ధార‌ణ కాన‌ప్ప‌టికీ జ‌నాలు మాత్రం చికెన్ కొన‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో రోజూ అమ్ముడ‌య్యే దాంట్లో ప్ర‌స్తుతం పావువంతు కూడా అమ్మకాలు జరగడం లేదు.