ఫేక్ అకౌంట్లతో మోసాలు.. మహిళలే టార్గెట్

by  |
ఫేక్ అకౌంట్లతో మోసాలు.. మహిళలే టార్గెట్
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అప్‌డేట్ దగ్గర్నుంచి ఓటీపీ ఫ్రాడ్, ఓఎల్ఎక్స్, గిఫ్ట్ ప్యాక్, సిమ్ స్వాపింగ్ తదితర నేరాలు చేసిన మోసగాళ్లు.. ఇటీవల ఫేస్‌బుక్‌ను కేంద్రంగా చేసుకుని అత్యధిక మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో కాస్తా యాక్టివ్‌గా ఉండి, నలుగురిలో పేరు కలిగిన వ్యక్తులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వీరి పేర్లపై నకిలీ ఖాతాలను సృష్టించి, వారి ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్‌ను ఫేస్ బుక్ ద్వారా సంప్రదించి వసూళ్ల దందా చేపడుతున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి అత్యున్నత సివిల్ సర్వెంట్ అధికారుల పేర్లతో కూడా నకిలీ ఖాతాలు వెలుగులోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోలీసులకు అత్యధికంగా అందుతున్నాయి.

సైబర్ నేరగాళ్లు అమాయకులకు ఏదో ఒక రూపంలో నిత్యం వల విసురుతూ మోసాలు చేస్తున్నారు. వీటిలో మహిళలకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే.. అంగీకరించిన తర్వాత వాట్సాప్ నెంబర్లు మార్చుకుని స్నేహం పేరుతో ప్రేమికులుగా మారి మోసపోవడం ఒకటయితే, ఏకంగా మన పేర్లపైనే నకిలీ ఖాతాలను సృష్టించి స్నేహితులు, బంధువుల నుంచి వైద్యం తదితర అత్యవసరాల పేర్లతో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో జర్మనీ నుంచి డాక్టర్ అజయ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగా అంగీకరించింది. ఫేస్‌బుక్ ద్వారా ఆమెతో స్నేహం పెరగడంతో వాట్సాప్ చాటింగ్ నిమిత్తం ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితులన్నింటినీ గమనించిన సదరు మోసగాడు.. జర్మనీ నుంచి నగలు, విలువైన వస్తువులు పంపుతున్నట్టు చెప్పి, వాటి ఫొటోలను ఆమెకు పంపాడు. దీంతో నిజమే అనుకుని నమ్మడంతో మరుసటి రోజు ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో ఫోన్ రావడంతో వారు చెప్పినట్టుగా చేసి, రూ.13 లక్షలకు మోసపోయింది. ఈ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను సమాజంలో కాస్తా పేరున్న వ్యక్తులతో పాటు పోలీస్ అధికారుల పేరుతో కూడా నకిలీ ఫేస్ బుక్ ఐడీలను మోసగాళ్లు అనేకం క్రియేట్ చేశారు. ఇలా ఐపీఎస్ అధికారుల నుంచి ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారుల వరకూ మోసగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను క్రియేట్ చేసి, వారి ఫ్రెండ్స్ జాబితాలో ఉన్న వారిని డబ్బులు అడుగుతున్నారు.

నకిలీ పోస్టును గుర్తించాలి

నకిలీ ఫేస్ బుక్ ఖాతా క్రియేట్ అయినట్టుగా తెలుసుకున్న సదరు వ్యక్తులు, అధికారులు నా పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారు. మీరెవరూ మోసపోవద్దంటూ వారికి వారే చెప్పుకోవాల్సి వస్తోంది. ఇలా బాధితులుగా మారిన వారిలో ఇన్ స్పెక్టర్ స్థాయి నుంచి అడిషనల్ డీజీ స్థాయి అధికారుల వరకూ ఉన్నారు. ఫేస్ బుక్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అత్యధిక ఫిర్యాదులు అందుకుంటున్నారు. ఈ తరహా ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ మోసాలు రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ నుంచే జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఒక వైపు ఈ ఫిర్యాదులపై దృష్టి పెడుతూనే.. మరో వైపు ఫేస్ బుక్‌కు లేఖ రాశారు. దీంతో నకిలీ అకౌంట్ లను గుర్తించేందుకు ఫేస్ బుక్ కొన్ని మార్చులు చేయాల్సి వచ్చింది. ఎవరైనా ఫేస్ బుక్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత నకిలీ అకౌంట్‌గా అనుమానిస్తే ఫేస్‌బుక్ లోని కుడి వైపు ఉండే మూడు చుక్కల వద్ద క్లిక్ చేస్తే.. రిపోర్ట్ ఆప్షన్ వస్తోంది. ఈ రిపోర్టులో ఈ అకౌంట్‌ను డిలీట్ చేయండని 20 మందికి పోస్టు చేసినట్టయితే ఫేస్‌బుక్ సంస్థ ఆ అకౌంట్‌ను నకిలీదిగా భావించి డిలీట్ చేయనుంది. మీ పేరుపై నకిలీ ఖాతా సృష్టించినట్టుగా తెలిసినప్పుడు వెంటనే ఇతర స్నేహితులు మోసపోకుండా ఉండేందుకు అసలైన ఖాతాలో మోసానికి సంబంధించిన వివరాలు తెలుపుతూ పోస్టు చేయాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.


Next Story

Most Viewed