గిఫ్ట్‌ వచ్చింది.. రోడ్ టాక్స్ కట్టమన్న దొంగలు దొరికారు

137

దిశ, కాళోజీ జంక్షన్ : డబ్బు సంపాదించేందుకు ఈ రోజుల్లో అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. సైబర్‌ క్రైమ్‌ను వేదికగా చేసుకొని జనాలను దోచుకుంటున్నారు. ఇటువంటి ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల వద్ద కొట్టేసిన లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

పూర్తి వివరాలు పోలీసుల మాటల్లో..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇప్పరాజ్ కుమార్ ఈజీగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం ఎంచుకున్నాడు. ఇతనికి తోడుగా మరో 12 మంది(తాళ్లపల్లి దామోదర్ గౌడ్, సరి హరీశ్ గౌడ్, మేకల ఆదిత్య, ఆకునూరి శ్రవణ్ కుమార్, గంగాధర్ రాకేశ్, పోరండ్ల విజయ్, ఈద రవికుమార్, దార్శ గణేష్, సిరికొండ వినోద్ కుమార్, వోల్లల ప్రవీణ్, గంగాధరి రాంచందర్, ఆడేపు సిద్ధార్థ్) ముఠా ఏర్పాడ్డారు. వీరందరూ కలిసి కోల్‌కతాకు చెందిన ప్రజీత్, సంజీవ్ ప్రకాశ్ అనే సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపారు.

డబ్బు సంపాదననే లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే వారికి వల వేసి.. వారి మొబైల్ నెంబర్లు సేకరించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వారికి ఫోన్ చేసి.. ‘మీరు కొనుగోలు చేసిన వస్తువులకు బహుమతి గెలుచుకున్నారు’ అంటూ నమ్మించారు. పలు స్ర్కాచ్ కార్డులను సెండ్ చేసి.. భారీ గిఫ్ట్(కారు, ఇతర వాహనాలు) మీ ఇంటికి రావాలంటే రోడ్ టాక్స్ తప్పనిసరిగా కట్టాలని.. అందుకు బ్యాంక్ అకౌంట్‌కు నగదు పంపించాలని చెప్పుకొచ్చారు.

సైబర్ క్రిమినల్స్ మాటలు నమ్మిన పలువురు అమాయక జనాలు డబ్బులు పంపించారు. ఆ తర్వాత గిఫ్ట్ కోసం ఎదురుచూసిన ఎంతకీరాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్దనున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇకమీదట ఆన్‌లైన్ నుంచి వస్తున్న ఫేక్ కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కమిషనర్ తరుణ్ జోషి ప్రజలకు సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..