కొత్త జోనల్ ​అమల్లోకి.. ఉద్యోగ సంఘాలతో సీఎస్ ​కీలక భేటీ

by  |
Employees
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జోనల్ ​అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాత ఉద్యోగుల సర్దుబాటు ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పాత ఉద్యోగుల సర్దుబాటు సమస్య కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్నారు. కొత్త జోనల్​ వ్యవస్థకు ఆమోదం లభించిన నేపథ్యంలో పోస్టుల కేడర్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కేడర్ విభజన తర్వాత ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే సమయంలో సర్దుబాటు చేసే అంశంలో సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఏండ్ల నుంచి పని చేస్తున్న ఉద్యోగులను మళ్లీ పాత స్థానాలకు పంపడం కొలిక్కి రావడం లేదు. దీనికి పాత జీవోలు అడ్డు వస్తున్నాయి. బలవంతంగా పాత స్థానాలకు పంపిస్తే కోర్టు కేసులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఒక ఉద్యోగి కొన్నేండ్లుగా హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. మొదట్లో డిప్యూటేషన్​పై వచ్చి ఏండ్ల నుంచి ఇక్కడే సెటిల్​ కావడంతో ఇప్పుడు సదరు ఉద్యోగిని ఎక్కడి జాబితాలో తీసుకోవాలనే అంశంపై చిక్కులు వస్తున్నాయి. ఉద్యోగంలో జాయిన్​ ప్రాంతంలో ఖాళీ చూపించకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలో కూడా ఖాళీ చూపించడం సాధ్యం కావడం లేదు. ఒకవేళ హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లోనే సర్దుబాటు చేస్తే స్థానికత అడ్డు వస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం తేలడం లేదు.

ఈ నేపథ్యంలోనే సీఎస్​.. ఉద్యోగ సంఘాల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉద్యోగ నేతల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఉద్యోగ జేఏసీ తరుపున టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ప్రతాప్, టీజీఓ నుంచి మమత, ఏనుగుల సత్యనారాయణ, గండూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్​ గౌడ్‌తో పాటుగా పీఆర్టీయూ ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హాజరయ్యాయి.



Next Story

Most Viewed