- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో యువకుడి ఆత్మహత్య.. వాట్సప్ నోట్‌లో నటుడు యష్ పేరు?
కర్ణాటకలో చదువు ఒత్తిడి కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో చదువు ఒత్తిడి కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అతని సూసైడ్ నోట్ లో స్టార్ నటుడు యష్ పేరు ప్రస్తావించడం గమనార్హం. ఆ డెత్ నోట్ ను వాట్సప్ లో పోస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న డిగ్రీ గ్రాడ్యుయేట్ రాకేష్ (21)గా గుర్తించారు. 21 సంవత్సరాలకే యువకుడు చదువు ఒత్తిడితో తనువు చాలించడం అతని స్నేహితులు, కుటుంబీకులను కలచివేసింది. సొరాబా తాలూకాలోని కైసోడి గ్రామంలోని తన నివాసంలో రాకేష్ ఉరికి వేలాడుతూ కనిపించాడు.
సూసైడ్ నోట్‌లో నటుడు యష్ పేరు ప్రస్తావన
రాకేష్.. చనిపోయే ముందు రాసిన డెత్ నోట్ లో నటుడు యష్ పేరును ప్రస్తావించాడు. గతంలో వీకెండ్ విత్ రమేష్ టెలివిజన్ షోలో యష్ పంచుకున్న తన జీవిత ప్రయాణాన్ని గురించి రాకేష్ ఈ నోట్ లో రాశాడు. ఆ ఎపిసోడ్ లో నటుడు యష్.. తాను స్కూల్, కాలేజీలకు బంక్ కొట్టడం, క్లాస్ మేట్స్ ను ఎంటర్టైన్ చేయడం, నటనపై తనకున్న ప్రేమ, కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇంతటి స్టార్ డమ్ తెచ్చుకునేందుకు పడిన కష్టం గురించి యష్ చెప్పుకొచ్చాడని రాకేష్ రాశాడు. ప్రతిభ, సామర్థ్యం అనేవి అదృష్టం కంటే ముఖ్యమని, మనం కోరుకున్న జీవితాన్ని గడపాలంటే.. మనకు ఇష్టమైన పనినే చేయడం ప్రారంభించినపుడు అది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.
తల్లిదండ్రులను కదిలించేలా డెత్ నోట్
పిల్లలపై చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తమ కోరికలను రుద్దడం తగ్గించాలని రాకేష్ కోరాడు. మితిమీరిన అంచనా, పోలికలు విద్యార్థి దశ నుంచి భారంగా ఉంటాయని, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న యష్ వ్యాఖ్యలను రాకేష్ డెత్ నోట్ లో ప్రస్తావించాడు. "తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దకూడదు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ఆసక్తులను అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా మార్గనిర్దేశం చేయాలి. డబ్బు, హోదా వస్తుందని తమకు నచ్చనిదాన్ని చదవమని పిల్లల్ని బలవంతం చేయకూడదు. ప్రతీ విద్యార్థికి జీవితంలో వేర్వేరు ఆశయాలు ఉంటాయి" అని రాకేష్ కోట్ చేశాడు. వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మెంటల్ గైడెన్స్ పై డిపెండ్ అవ్వకూడదని సూచించాడు. దీని వల్ల స్వతహాగా ఆలోచించే శక్తిని, నిర్ణయం తీసుకోవడంలో ధైర్యాన్ని కోల్పోతారని హెచ్చరించాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం కావాలో అడిగి తెలుసుకోవాలని సూచించాడు. రాకేష్ ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






